పాండవుల వృత్తినిర్ణయం9

దుర్యోధనుడు ద్వైతవనంలో పాండవులు ఉండగా పరాభవించాలని అనుకున్నప్పుడు ఒక గోపాలుడిని పట్టుకుని వచ్చాడు. వాడు వచ్చి సభలో ఇబ్బంది ఉందని చెపితే ఘోషయాత్రకు వెళదామన్నాడు. అప్పుడు వాళ్ళందరూ సభ తీరినప్పుడు అతడు రాగా ఇదిగో ద్వైతవనప్రాంతంనుండి కీలారివాడు వచ్చాడు అని ఆయన ప్రయోగించాడు. ఈ ‘కీలారితనమునకు నే చాలుదునని కొలిచి మత్స్యజనపాలుకడన్ మేలగు నడవడి తంత్రీపాలుడు’-. తంతీపాలుడు, తంత్రీ పాలుడు రెండు మాటలు కనిపిస్తాయి. తంత్రి అంటే దారము, తాడు. దానిని పట్టుకుని పాలించేవాడు. నకులసహదేవులు కవలలు గదా! ఒకరు అశ్వపాలకులైతే మరొకరు గోపాలకులు. ‘వంజలనైనను వల నేర్పడఁగ ఒక భంగిఁ జేఁపఁగఁ జేసి పాలు గొనఁగ’- వంధ్య ప్రకృతి. వంజ వికృత’ గొడ్రాళ్లైన ఆవులను కూడా చేపేటట్లుగా చేయగలను. ‘బడుగులనైనను పాటించి పరికించి’- బడుగు అంటే బక్కచిక్కినవి. బడుగు బ్రాహ్మణుడు అని వాడుతూ ఉంటాము. కృశించిపోయినవాడు అని అర్థం. బక్కచిక్కి ఉన్న ఆవులను కూడా ‘పాటించి, పరికించి’, చూసి ‘గోమునమైఁ’ చాలా ప్రేమతో ఎంత గోము చేస్తాడండీ వీడు అంటాం కదా! ఆ గోమున వాటిని‘మైకండ క్రొవ్వు దేఱ’- వాటికి బాగా కొవ్వు, కండలు పట్టేట్టుగా చేస్తాను.

‘తెవులు గొంటులనైనఁ దేర్చు సంకటమున కోపి ముందటియట్ల రూపు సేయ’- పంటలకూ పశువులకూ వచ్చే రోగాన్ని తెగులు అంటాం. రోగాలను తెచ్చుకుని, శుష్కించిన ఆవులను కూడా తీర్చి -‘సంకటమునకున్ వాటి బాధను పోగొట్టి ముందటియట్ల రూపు జేయ’- ఆ రోగం రాకముందు ఎలా ఉండేవో అలా చేస్తాను. ‘నఱ్ఱలనైనను నలువైన వెరవుల’- నఱ్ఱలు అంటే ఎద్దులు, చిన్నయసూరిగారు పంచతంత్రంలో అంటారు. వర్ధమానుడను సార్థవాహుడు బయల్దేరినపుడు తన ఎద్దుకు కాలు విరిగిపోయినపుడు ‘ఇది మంచి నఱ్ఱ’ దాన్ని ఎలా వదలి వెళ్ళగలమని అని అనుకుంటాడు. అయినా తప్పనిసరై అడవిలో వదలివేస్తాడు. ఇది మంచి ఎద్దు అనడానికి, ఇది మంచి నఱ్ఱ బాగా పొగరుగా ఉండే ఎద్దు అంటారు. ‘నఱ్ఱలనైనను, నలువైన వెరవున’- పొగరుబోతుతనపు ఎద్దులనైనా ‘ముట్టె యంటగ బట్టి కట్టి విడువఁ’- దాని ముక్కుకు తాడు వేసి, మూతి చుట్టూ తాడు వేస్తారు. ముక్కు తాడు వేరు, ముక్కులోనుంచి వచ్చేది. ఆ మూతి చుట్టూ ఒక తాడు కట్టి కొమ్ములకు కడతారు. ‘ముట్టె యంటగ పట్టి కట్టు విడువ పిదుక కదుపు నేర్ప’- పాలు పిదకడానికి. కదుపు వాటి సమూహము, ఆ ఆలమందలలో చేర్చడానికి ‘కదుపు నేర్పబెదరు వాపఁగ’- వాటి భయాన్ని పోగొట్టి, ‘నీరు మేపు గలుగు నెడకు మెలఁగ’- నీరు మేత ఉండే ప్రదేశాలకు వెళ్ళేట్టుగా చేసి, ‘వెలువ మెకము నరయ’- మెకము అంటే మృగము. వెలువ అంటే బయట ఉండే మృగము. వెలువలెందుకు? కుక్కలు, కోళ్ళు, ఆవులు, ఎద్దులు, గుఱ్ఱాలు మొదలైనవాటిని పెంచుకోవచ్చు. సింహాలు, పులులు వంటివాటిని ఇంటిలోపల పెంచుకోము. అవి వెలుపలే ఉండాలి, అవి ‘వెలువ మెకములు’. క్రూరమృగములనుంచి ‘అరయ మ్రుచ్చు మెలగిన’- దొంగలు వచ్చి ఆవులను తీసుకుని పోవాలనుకుంటే వారిని ‘వెలకొట్ట నేర్తు’- వెళ్ళగొట్టగలను. వాళ్ళను తరిమివేస్తాను. ‘పసికి చాలా కూర్తు నేను’- పశువులకు చాల ప్రియంగా ఉంటాను. అని నన్ను ‘విరాటుండు మున్ను నీ వెందుండుదువు’- విరాటుడు ఇంతకుముందు ఎక్కడ ఉండేవాడివి అని అడిగితే, పాండవులదగ్గరనుంచి వచ్చాను, వాళ్ళు దేశాటనకు పోయారు అని చెప్తాను. అన్నదమ్ములందరూ నిర్ణయించుకున్నారు. ఇంక ద్రౌపది వ్యవహారం వచ్చింది. ద్రౌపది వైపు చూశాడు.

ద్రౌపది - ధర్మరాజు విచారం

               అన్నదమ్ముల వృత్తినిర్ణయమైన తరువాత ధర్మరాజు తన ప్రక్కన నిలబడిన ద్రౌపదివైపు చూడగానే అంత వరకు ఆవరించిన విషాదచ్ఛాయ మరింతగా కలిగింది. మహాసామ్రాజ్యంలో ఒక యజ్ఞవిధానంలో అవతరించిన స్త్రీ తమను అనుసరించి అరణ్యవాసానికి వచ్చింది. వీరి ఇతర భార్యలెవరూ వీళ్ళతో పాటుగా రాలేదు. ద్రౌపది మాత్రమే వచ్చింది. జూదంలో అరణ్యవాసము చేయాలని చెప్పినపుడు దుర్యోధనాదులు ద్రౌపది కూడా చేయాలని నియమం పెట్టినట్టు మనం చదువుకోలేదు. కానీ ఆమె అనుసరించి వచ్చింది. అరణ్యవాసంలో వుండే కష్టాలను లెక్క జేయకుండా. ఆమెను చూసేటప్పటికి ‘ఇది కడు ముద్దరాలు’- ఎక్కడో అంతఃపురకాంతలతో వుండ వలసినది. 

Player
>>