సేవాధర్మోపదేశం1

ధౌమ్యుని సేవాధర్మ ఉపదేశం

“అనపాయత వర్తిల్లుదమని ధర్మతనయుండు” తన సోదరులతో ద్రౌపదితో విరాటనగరానికి వెళ్ళి అక్కడ విరాటరాజ కొలువును ఆశ్రయించుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తిలో ప్రవేశించి తమతమ రహస్యాన్ని రక్షించుకుంటూ అజ్ఞాతకాలం గడుపుదామని నిశ్చయించారు. “ఈవిధంబున కార్యంబు నిర్ణయించి,”- కానీ చేయవలసినపనులు కొన్ని మిగిలిపోయాయి. వీళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఉన్న సేవకులు, పరివారం రథాలు,- వీళ్లందరికీ ఒక వ్యవస్థను ఏర్పరచాలి. అంతేగాక క్షాత్రధర్మయోగ్యమైన నిత్యాగ్ని హోత్రులు కనుక వీరి గార్హస్థ్యాగ్నిని జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. ఆ కార్యానికై పురోహితుడు ధౌమ్యాచార్యుల వారు సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ ఆలోచించి ధర్మరాజు  సోదరులను చూసి, -‘మన అగ్నిహోత్రంబుల నెల్ల ధౌమ్యులు రక్షించువారు వంటలవారును మహానసాధ్యక్షులును బాంచాలీ పరిచారికలును ద్రుపదపదమ్మున నిలచువారు రథంబులు గొని ఇంద్రసేనాదులైన సారథులు ద్వారకానగరమ్మునకరుగువారు వీరెల్లను’ వీళ్లందరూ, అంటే  ద్రౌపది పరిచారికలు  పాంచాలదేశానికి వెళతారు. రథాలను తీసుకుని యింద్రసేనాదులు ద్వారకకు వెళతారు. మరివీళ్లందరూ పన్నెండు సంవత్సరాలు పాండవులదగ్గర ఉన్నారు కదా. అరణ్యవాసం తరువాత పాండవులు ఎక్కడకి వెళ్ళారని ఎవరైనా వీళ్ళను అడగడానికి అవకాశం ఉంటుంది కదా అలా ఎవరైనా అడిగితే వీళ్ళేం చెపుతారంటే “పాండవులు ద్వైత వనమ్మున మమ్ములను విడిచి పోయిరి అట యెఱుంగము”. నిజానికి కూడా అంతే, ఎందుకంటే వీళ్ళు అరణ్యవాసకాలం చివరలో వచ్చినప్రదేశం ద్వైతవనం. దానితరువాతనే అజ్ఞాతవాసం ఆరంభమైంది. కాబట్టి వాళ్ళందరూ సమాధానమిస్తారు. “ద్వైతవనంలో ఉన్నారు. ఆతరువాత వారెటుపోయారో మాకు తెలీదు” అని. అని అందరినీ నియమించి పరివారాన్నంతటినీ పంపించేశారు. మిగిలిన వారు పురోహితులు ధౌమ్యాచార్యులవారు, పాండవులు. ధౌమ్యాచార్యులు పాండవులను గమనించి ‘అయ్యా! మీరు చక్రవర్తులు, మహా ప్రభువులు, మహాబలసంపన్నులు. తేజోమూర్తులు. అయినప్పటికీ కాలప్రభావంచేత ఒక సంవత్సరం ఎవరికీ తెలియనివిధంగా మీ జీవనాన్ని గడుపుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. మీరు మీ ఈ ప్రభుత్వాన్ని, అభిజాత్యగౌరవాన్ని నిలుపుకుంటూ అలాగే ప్రవర్తిస్తాం అంటే మీ ఎరుక ప్రజలకు కలిగే అవకాశం ఉంటుంది. అలా అయితే ప్రమాదం సంభవిస్తుంది. కాబట్టి అటువంటి పొరబాటు రాకుండా మీరు నిర్వహించవలసినటువంటి ధర్మం ఏరాజును ఆశ్రయించో,  ధర్మమునాశ్రయించో సేవావృత్తిని స్వీకరించి మీ అజ్ఞాతవాసాన్ని గడుపవలసి ఉంటుంది. ప్రత్యామ్నాయం లేదు, కానీ ప్రభుత్వాన్ని నెఱపి సేవలనందించుకుంటున్న మీరు సేవావృత్తిలోకి పోయి ఏవిధంగా ఉండాలి,  అన్న విషయాన్ని   కొంచెం పరామర్శిస్తాను. మీరు మహాప్రభువులుగా ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న సేవకులు ఏవిధంగా  ప్రవర్తించేవారో మీకు తెలుసు. మీరు సేవకులుగా ఉన్నప్పుడు మీరు కొలిచే ప్రభువులపట్ల ఆవిధంగానే ఉండాలన్న విషయం సూక్ష్మంగా మనసులో ఉంచుకొనవలసినటువంటి విషయం”, అని అత్యద్భుతమై క్రమశిక్షణాసహితమైన సేవాధర్మాన్ని ధౌమ్యుడు ధర్మరాజు తక్కిన పాండవులకు బోధించాడు. ఉన్నవిషయాలెన్నో చెప్పినా కూడా చాలా ముఖ్యమైనవిషయం చెప్పాడు. అయ్యా! ఒక రాజు దగ్గర కొలువు చేస్తున్నప్పుడు ఆరాజు మీ సేవలు మెచ్చి వివిధ సందర్భాల్లో మీకు ధనకనక వస్తువాహనాలతో మిమ్మల్ని తృప్తిపరచవచ్చు. ఈవిధంగా మీకు లభించిన సంపదతో, వస్తువులతో రాజుకన్నా  మిన్నగా మీ భవన వాహనాలను ఏర్పరచుకుంటే, అది కొట్టొచ్చినట్టుగా కనబడి రాజు విముఖుడయ్యే అవకాశం ఉంటుంది. 

Player
>>