సేవాధర్మోపదేశం2
ఉ. రాజ గృహంబు కంటె నభిరామముగా నిలుగట్టఁగూడ దే
యోజ నృపాలుఁడాకృతికి నొప్పగు వేషము లాచరించు నే
యోజ విహారముల్ సలుప నుల్లమునం గడు వేడ్క సేయు నే
యోజ విదగ్ధుఁడై పలుకు నొడ్డులకుం దగదట్లు సేయఁగన్ (విరాట. 1-123)
ఇంకా ఏమన్నాడంటే రాజుగారిచిత్తవృత్తిని ఆయన మానసికస్థితిని గ్రహించుకుని ఆయనవైభవాన్ని అతిక్రమించకుండా మెలగగలవాడు సేవాధర్మంలో కృతకృత్యుడౌతాడు.
ఆ. రాజునొద్దఁ బలువురకు సంకటంబుగాఁగ
దిరుగు పనులనెంత తేజమయిన
వాని బుద్ధి గలుగు వారొల్లరది మీఁదఁ
జేటు దెచ్చుటెట్లు సిద్ధమగుట (విరాట. 1-126)
“రాజునొద్దఁ బలువురకు సంకటంబుగా దిరుగు పనులనెంత తేజమయిన వాని బుద్ధి గలుగు వారొల్లరు” - రాజుకు నువ్వు ఆయన ఆప్తవర్గంలో జేరినపుడు రాజుకు సన్నిహితుడుగా పెరిగిన నీ గౌరవము, ప్రభావము చూసి ఇతరులు భయపడే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో నువ్వు ఎక్కువగా అన్ని విషయాల్లో జోక్యం చేసుకుని ప్రజలందరికీ కష్టం కలిగేవిధంగా ప్రవర్తిస్తే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి రాజు దగ్గర చనువు మంచిదేకానీ మర్యాదను గుర్తించి నీకున్నటువంటి పరిమితులను గమనించి ప్రవర్తించవలసినది. రాజుకు ఎదురుగా తగ్గి అణగిమణగి ఉండవలసిన విషయం వస్తుంది. “మన్నన ఉబ్బక” రాజేమైనా పొగిడితే లేదా ఇంకెవరైనా పొగిడితే మీరున్నస్థానాన్ని బట్టి అటువంటి పొగడ్తలకు పొంగిపోకుండా మేమే గొప్ప అనే అహంకారాన్ని మనసులో రానివ్వకూడదు.
క. మన్నన కుబ్బక యవమతి,
దన్నొందిన స్రుక్కఁబడక ధరణీశుకడన్
మున్నున్న యట్ల మెలఁగిన
యన్నరునకు శుభము లొదవు నాపద లడఁగున్ (విరాట. 1-133)
‘అవమతి దన్నొందిన స్రుక్కఁబడక’ - ఎటువంటి పరిస్థితిలోనైనా ఒకానొకపరిస్థితిలో రాజుగారుచిరాకు పడవచ్చు. అటువంటి పరిస్థితిలో వెంటనే ప్రతిస్పందించకుండా అవగాహనతో బహుకార్యవ్యగ్రుడైనటువంటి ప్రభువు మానసికస్థితిలో అనవలసినఅవసరం వచ్చిందేమో అన్న అవగాహనతో దాన్ని సర్దుకునిపోవాలి. అని ఈవిధంగాచెప్పి సభామర్యాదలగురించి కూడా ఉపన్యసించి ధౌమ్యుడు నచ్చజెప్పాడు. ధౌమ్యుని ఉపదేశానికి పాండవులు, ‘ప్రసన్న చిత్తులై,’- వినమ్రులై ‘కొలిచి వర్తిల్లెడు తెఱంగు లెంతయుఁ దెల్లము సేసితి,’ రని కృతజ్ఞతతో నమస్కరించి, వెళ్లడానికి సిద్ధమయ్యారు.