సేవాధర్మోపదేశం3
ఆ. అనిన ధౌమ్యుఁడిట్టులనియె నీవత్సర
మొకఁడు నెట్టులయిన నుడిగిమడిఁగి
సంకటముల కోర్చి చరియించి యాపద
నిస్తరించి పిదప నెగడవలయు (విరాట. 1-143)
ధౌమ్యుడు ఆశీర్వదిస్తూ హెచ్చరించాడు. ‘ఈ అజ్ఞాతవాస సంవత్సరం కష్టతరమైనది. చాలా సమయస్పూర్తితో మెలగాలి. ఎక్కడైనా మీ అభిమానం దెబ్బతిని మీరు విజృంభించే పరిస్థితి వస్తే నిగ్రహంతో సమాధానపరచుకుని ఉండాలి. ఏవిధంగా అయినా సరే, ఈ ఒక్కసంవత్సరం సహనంతో, మీ విద్యాసామర్థ్యాలను గమనించుకుని, వివేకంతో గట్టెక్కాలి’ అన్నాడు.
క. అనవుడు నట్టుల చేసెద,
మని వారలు భక్తియుక్తి నతనికి నభివం
దన మొనరించినఁదగుదీ,
వన లిచ్చెనతండు గాఢవాత్సల్యమునన్ (విరాట. 1-144)
‘అనవుడు నట్టుల చేసెద మని’ పాండవులందరూ సమాధానం చెప్పి, -“భూదేవోత్తము నాశీర్వాదంబులఁ బ్రీతిఁబొంది వారలు,”- ధౌమ్యాచార్యులు, ఇతరబ్రాహ్మణులఆశీర్వాదాలు తీసుకుని, అక్కడనుంచి మేం బయల్దేరతాం అన్నారు. ధౌమ్యులవారు కూడా, ‘సమ్మోదావహ పుణ్యకర్మముల కుద్యతుఁడై’ వారి అగ్నిహోత్రాన్ని గ్రహించి, పాండవులకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించే జపహోమాది పుణ్యకర్మలను సంకల్పించి బ్రాహ్మణసమూహంతో ప్రయాణమై వెళ్లాడు. వారు వెళ్ళాక పాండవులు పాంచాలి ఎవరు ఏవృత్తుల్లో ఉండాలి అన్నది ధౌమ్యాచార్యుల వారికి కూడా తెలియకుండా ఇది వరకే నిర్ణయం చేసుకున్నారు కనుక, వీళ్ళు కూడా బయలుదేరారు.