పాండవుల ప్రయాణం1

ఆయుధ నిక్షేపణ- పాండవుల ప్రయాణం

   ఇంకా తెల్లవారలేదు, చీకట్లున్నాయి. కానీ తెల్లవారకుండానే గమ్యస్థానం చేరుకోవాలి. కేవలం ఆయుధాలు తప్ప మిగతా వస్తువిశేషాలు ఏవీ వీరిదగ్గర పెట్టుకోలేదు. వెళుతున్నారు, వెళుతున్నారు. అరణ్యవాసంలోనుంచే వచ్చారు. అక్కడనుంచి శరీరం మనస్సు అన్నీ డస్సిపోయి ఉన్నాయి. తరువాత వచ్చిన ఆలోచనలు, మానసికమైన వేదన, అజ్ఞాతవాససమయాన్ని ఎలా గడపుకోవాలనేఆందోళన, శారీరకంగా, మానసికంగా అన్నివిధాలైన అలసటతో వెళుతుంటే, కుసుమకోమలగాత్రి ద్రౌపది అరణ్యవాసంలో ఎన్ని క్లేశాలనుభవించినా, ఇప్పుడు ఇంత తక్కువసమయంలో ఇంత వడివడిగా నడుస్తూ విరాటనగరానికి వెళ్లవలసి వచ్చినపుడు చాలా అలసిపోయింది. అలసిపోయి, ధర్మరాజుతో ‘వసామేహాపరాం రాత్రిం బలవాన్ మే పరిశ్రమః’- ‘చాలా అలసిపోయాను. ఒక్కరాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుందాము, అన్నది. కానీ ఆమె ‘బలవాన్ మే పరిశ్రమః’, ఎలాంటిది? రసాభ్యుచితబంధంగా దృశ్యసాక్షాత్కారం చేస్తూ విరాట పర్వం రచిస్తున్న కవిబ్రహ్మ ‘పథిశ్రమంబునూనిన’ ద్రౌపదిలో ‘బలవాన్ శ్రమః’- కలిగించిన శారీరక పరిణామస్థితిని ప్రత్యక్షం చేస్తూ, ద్రౌపదితో పలికించిన అభ్యర్థన.

ఉ.           డప్పిజనించె వ్రేళుల పుటంబులు పొక్కఁదొణంగె గోళ్ళలో
              జిప్పిల జొచ్చె నెత్తురులు చిత్తము నాకు గడున్ వశంబుగా
              దప్పుర మిచ్చటచ్చటను నాసల వచ్చితి నెంత దవ్వొకో
              యిప్పటి భంగి నొక్కడుగు నేఁగెడు దానికి నోర్వనెమ్మెయిన్ (విరాట.  1-148)

             ‘డప్పిజనించె’ మార్గాయాసం వల్ల  మొట్టమొదట కలిగే అవస్థ పిపాస, దాహం.  ‘వ్రేళుల పుటంబులు పొక్కఁదొణంగె’–  ఇది ఒకవిధమైన రాజమార్గం కాదు. ఆమె అసూర్యంపశ్యగా పెరిగి పాండవులను పరిణయమాడిన తరువాత కాలవిపర్యయంలో వచ్చిన క్లిష్ట పరిస్థితి, అరణ్యవాసంలో ఉన్నప్పటికీ కూడా చదునుచేయబడిన పరిసరప్రాంతాలలో సంచరిస్తున్నటువంటి ఆమె ఇప్పుడు కటికరాళ్ళతో ఎటువంటి సంస్కారమూ లేని దారిలో నడువవలసి వచ్చినపుడు  ఆ ముళ్ళకు రాళ్ళకు ఆమె వేళ్ళ చివర్లు బొబ్బలు ఎక్కాయి.ఎక్కుతున్నాయి. ‘గోళ్ళలోజిప్పిల జొచ్చె నెత్తురులు’  - ఇవన్నీ తగిలి గోళ్ళనుండి రక్తం స్రవిస్తోంది. ‘చిత్తము నాకు గడుంవశంబుగాదు’ – నా మనసు నా ఆధీనంలో లేదు. శరీరం సన్నగిల్లుతోంది ఎక్కడో బడలికతో పడుకోవాలనిపిస్తోంది కానీ ఓపిక నశించింది. ‘అప్పుర మిచ్చటచ్చటను నాసల వచ్చితి’– మనం వెళ్ళాల్సిన విరాటనగరం ఇక్కడిక్కడే సమీపంలో ఉందేమో అని అనుకున్నాం కానీ, ‘ఎంత దవ్వొకొ’,- ఇంకా ఎంత దూరముందో! ‘యిప్పటి భంగి నొక్కడుగు నేఁగెడు దానికి నోర్వనెమ్మెయిన్’ ఇంతవరకు ఎలాగో అలా నేను నడుస్తూ వచ్చాను కానీ ఇంక నడవాలంటే ఓపిక లేదు. మనస్సులో స్వస్థత లేదు. అన్న ద్రౌపది అవస్థను గమనించినటువంటి ధర్మరాజు, ఎలాగైనా విరానగరం చేరేవరకూ ఆగకూడదని నిశ్చయించి, అలసిపోయిన ద్రౌపదిని ఎత్తుకుని రావలసిందిగా అర్జునుని ఆదేశించాడు. ఇది మనకు ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు.  అసంభవమైనదీ కాదు. లాక్షాగృహసందర్భంలో భీమసేనుడు వీళ్ళందరినీ మోసుకుని ఆ ప్రదేశాన్నుంచీ వెళ్ళాడు. అందరూ విరాటనగరం పొలిమేరలలోకి వెళ్ళారు. ఇపుడు మిగిలిన పని ఒకటి ఉంది.

   పాండవులు మాత్రమే తేజోమూర్తులు కాదు. వాళ్ళకున్న ఆయుధములు కూడా మహాతేజస్వంతములు. ఆ ఆయుధాలను ఎలా ఎక్కడ రక్షించు కోవాలి? ధౌమ్యాచార్యులకు అగ్నిహోత్రం ఇచ్చారు. రథాలను, సారథులను ద్వారకకు పంపించారు. పరిచారకులను, వంటవాళ్ళను పాంచాలనగరానికి పంపించారు. కాని ఆయుధాలను ఎవరికి అప్పగిస్తారు? చూస్తున్నారు.

చూస్తుంటే అర్జునుడికి ఎదురుగా కనపడ్డది. ‘నెగసిన కొనలేచి నింగినంతంతకు నవలఁద్రోచుచుఁ దనరారు దాని,’- ఒక మహావృక్షం కనిపించింది. దాని ‘నెగసిన కొనలు’, ఆ చిట్టచివరి కొనలు ఎంత ఊర్ధ్వ భాగానికి వెళుతున్నాయంటే ఆకాశం చివరల వరకు వ్యాపించి ఉన్నాయి. ‘చాఁగిన శాఖ లాశాచక్రమున కొలందులు బారవెట్టంగఁ బొలుచు  దాని’ దాని శాఖలు ఎంతో దూరంగా విస్తరిల్లి ఉన్నాయి. అది శమీ వృక్షమే కాని వటవృక్షాన్ని అయినా మించిపోయిన వైశాల్యముతో దట్టంగా 

Player
>>