పాండవుల ప్రయాణం2

గుబుర్లతో నిండి ఉంది. ‘కవటలొండొంటితోఁ గదియుచు నెడములు మ్రింగి ప్రబ్బఁగ సొంపు మిగులు దాని’ అవి ‘కవటలు ఒండొంటితో,’- అద్భుతమైన ప్రయోగం! కవటలు, పెద్ద పెద్ద కొమ్మలు. ఆ వృక్షానికి చిన్న కొమ్మలున్నాయి, పెద్ద కొమ్మలున్నాయి. ఈ పెద్ద పెద్దగా ఉండి బాగా విస్తరిల్లిన కొమ్మలు ఒకదానితో ఒకటి, ‘కదియుచు’,- రాసుకుంటూ, ‘ఎడములు మ్రింగి,’- అంటే మధ్యలో ఖాళీస్థలం లేకుండా, వృక్షానికి శాఖోపశాఖలై కొమ్మలు విస్తరించటం సహజం. అయితే ఈ శమీ వృక్షానికి ఒక క్రమంగా వ్యాపించవు కదా! ఎక్కడ అవకాశము ఉంటే కొమ్మలు ఆ విధంగా అటువైపు వ్యాపించి ఉన్నాయి.  ‘లోని జొంపము పవలును బెను జీఁకటి నొదవించి పొదలంగ నొప్పుదాని,’- ఆకులచేత దట్టంగా కప్పబడి లోపలికి వెళితే మహా గుహలోకి వెళ్ళినట్టుంది కాని ఒక చెట్టు కింద చేరినట్టు లేదు. అంత దట్టంగా ఆకాశం వరకు వ్యాపించిన ఔన్నత్యంతో నాలుగు దిశలవరకు సాగిన వైశాల్యంతో కొమ్మలకు కొమ్మలు దట్టంగా అల్లుకుని పోయి ఉండి మధ్య స్థలము లేనటువంటి ప్రదేశంతో ఈ ఆకుల చేత గుబురు గుబురుగా ఉండి కప్పబడిన చీకట్లతో ఉన్న చెట్టును చూశారు.

‘కనియె పవమాన వివిధ వర్తన కళానువర్తి,’- గాలి ఏ విధంగా వీస్తుంటే ఆ వీచేటువంటి వాయువుకు అనుగుణంగా తన ఆకులను కొమ్మలను కదిలిస్తున్నది. ‘కాక ఘూకారవస్ఫూర్తి,’- వాటి మీద ఉన్న కాకులు, గుడ్లగూబలు మొదలైన పక్షుల ఆరావాలతో ఉండి, ‘జాతభీతి పరిసరవర్తి,’- దాని సమీపంలోకి వెళ్ళాలంటేనే భయం కొలిపే విధమైన పరిసర ప్రాంతాలు కలిగిన ‘ఆభీల భుజగ చండమూర్తి,’- ఒక మహా సర్పం పడగ ఎత్తి లేచి ఉన్నదా అనే విధంగా వ్యాపించి ఉన్న ‘శమీతరు చక్రవర్తి,’- మహా వృక్షాల్లో చక్రవర్తి స్థానాన్ని అందుకున్న విధంగా వెలిగిపోతున్న శమీ వృక్షాన్ని చూడగానే అర్జునుడికి సంతోషం కలిగింది. ఎందుకంటే తమకున్న ఆయుధాలలో, అర్జునునికి తన విల్లు, గాండీవం ప్రాణ సమానమైనది. దాంతో అర్జునుడు సాదించిన విజయాలు అత్యద్భుతమైనవి. అందుకనే మనం  విజయదశమి రోజు ‘శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ దర్శనః’ అనే ప్రాస్తావిక శ్లోకంలో అర్జునునికి కనులపండువుగా కనిపించిందని అనుకుంటాం. చూసి, దాన్ని అన్నగారికి చూపించాడు. చూపించి చెప్పాడు. అన్నయ్యా! చూశావా? ఇది. ఈ మహా వృక్షం ఎలా ఉంది? 

‘పక్షి వ్యాకులమున్,’- ఇది విశాలంగా ఉన్నది. ఆకాశోన్నతంగా వ్యాపించి ఉన్నది కాబట్టి దీని మీద ఉన్న వివిధ రకములైన పక్షికులములచేత ఇది కలకలారావాలతో ఎప్పుడూ నిండి ఉన్నది. ‘పరేత నిలయోపాంతోత్థమున్,’- అంతే కాదు ఈ శమీ వృక్షమెక్కడ ఉన్నది? ఊరికి బహిః ప్రదేశంలో, శ్మశాన భూమికి సమీపంలో ఉన్నది. ‘డాకినీ రక్షోభూత పిశాచ గోచరము,’- శ్మశానానికి దగ్గర్లో, ప్రేత భూమి పరిసర ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ శ్మశానాన్ని ఆవాసంగా చేసుకున్న రాక్షసుల భూతముల, పిశాచ గణముల ఆక్రందన చేత, ఆవాసం చేత భయంకరమైనది. ‘దుర్గంధంబు’- అక్కడ పరిశుభ్రం చేయడానికి ఎవరుంటారు? ఈ ప్రాంతంలో వ్యాపించిన వివిధ రకాలైన శవములు, ప్రేతభూమి ప్రాంతంలో ఉన్న జుగుప్సావహమైన వాసనల చేత, ‘చిత్తక్షోభం బొనరించు,’- మనసును కలవరపెడుతుంది.

ఎవడూ ఈ వృక్ష ప్రాంతానికే రాడు. ఎందుకంటే వికృతములైన అరుపులతో రక్షో భూత పిశాచ భీకరములతో, శ్మశానానికి సమీపంలో కాలుతున్న శవములలో నుంచి వచ్చే దుర్గంధంతో, గుబురులుగా ఉండడం వల్ల కమ్ముకున్న చీకట్లతో ఇది ‘చెంతం చేరరాదు,’- ఇంత భయంకరమైనది. దీని దగ్గరకు ఎవరొస్తారు? ‘ఇందుఁ బెట్టుదమె పృథ్వీనాథ! శస్త్రాస్త్రముల్?,’- అందుచేత మన శస్త్రాస్తాలను ఇక్కడ పెడదామన్నాడు. ధర్మరాజు ఆ శమీ వృక్షాన్ని చూసి, అర్జునుడిని చూశాడు. “ఆహా! ఎంత చక్కటి ప్రదేశము! భగవంతుడు మనకు అనుకూలంగా చూపించాడు. ఇంత వరకు ఆయుధాలను ఎక్కడ నిక్షేపించాలి అనే ఆలోచనతో ఉంటే మనకోసమే ఏర్పడిందా అన్నట్టుగా ఈ శమీ వృక్షం కనపడ్డది” అని, ఇక్కడే ఉంచుదామన్నాడు. ఇక్కడొక చిన్న విషయముంది. శమీవృక్షంపైన వీరి ఆయుధాలనన్నిటినీ ఒక మూటగా కట్టి అక్కడ పెట్టారు. అయితే ఎవరు కట్టారక్కడ? ఇక్కడ ఇవి దైవలబ్ధమైనవి కాబట్టి ఆ దేవతలను ప్రార్థించి అక్కడ ఉంచాలి. 

Player
>>