పాండవుల ప్రయాణం3

మరి? ఇది అవసరమైనప్పుడు ఎవరికి కనపడాలి? ఆవేశపరుడైనటువంటి భీమసేనుడికి కనపడకూడదు. ‘భీముడు ధార్తరాష్ట్రకుల భీషణరోషుడు; చిత్తమెప్పు డెట్లై మద మెత్తునో’- ఇప్పుడు భీముడు వంటలవాడిగా వెళతానన్నాడు. వంటల వాడిగా వెళ్ళిన వాడు ఊరి బయటకు వంట చెరుకు కోసమో మరి దేని కోసమో రావడం సంభవించి శమీవృక్ష ప్రాంతానికి వచ్చి వీరికి జరిగిన అన్యాయాలకు కొంచెం మనసుకు ఉద్రేకపడితే వెంటనే ఈ ఆయుధాల జోలికి ఏమన్నా వెళ్ళే అవకాశముంటుందేమో! ధర్మరాజు గారికి భీముడి మీద ఉన్న అవ్యాజమైన ప్రేమ వల్లనో ఏమో భీముడికి అటువంటి పరిస్థితి రాకూడదనుకున్నాడు. ధర్మరాజు గారు స్వయంగా తనే ఆయుధాలను శమీ వృక్షం మీద పెట్టి, వాటిని

క.            నరునకు నాకుం దక్కఁగ
               నొరులకు మీరూపు సూపకున్నది; విషవి
               స్ఫురిత భుజంగభంగి భయం
               కర మూర్తులు దాల్చి యుండఁగా వలయుఁజుడీ’ (విరాట.  1-176)

   నాకు అర్జునునికి తప్ప మీ స్వరూపాన్ని ఎవ్వరికీ చూపించవద్దు. ఇంక మరెవ్వరూ వచ్చి చూచినప్పటికీ ఒక భీకరమైన సర్ప రాజము సుళ్ళు తిరుగుతున్నట్లు మీరు కనపడవలసినదే కాని ఆయుధములనే ప్రసక్తి ఆకార విశేషం చేత గోచరింప చేయకూడదు అన్నాడు. ఇలా ప్రార్థిస్తూ ధర్మరాజు గారు స్వయంగా ఆయుధాలనుపెట్టి  క్రిందకు వచ్చి, భీమునికి సాంత్వనవచనాలు పలికి నట్లు తిక్కనగారు చెప్పారు. అయితే మూలంలో నకులుడు వెళ్ళి ఈ ఆయుధాలని వృక్షం మీద పెట్టినట్లుంది.  ఈ చెట్టు రహస్యమైన ప్రాంతం. వీళ్ళు మూట గట్టి అక్కడ పెడితే ఇది కొమ్మల్లో కొమ్మలాగ గుబురులో గుబురులాగ కలిసిపోయి ఉంటుంది. ఆ శమీ తరు చక్రవర్తి భయంకరమైన రూపాన్ని ఇది వరకే చెప్పారు కాబట్టి ఎవరూ వచ్చే అవకాశమే లేదు అని నిశ్చయించారు. కాని ఇక్కడ ధర్మరాజు వీటిని పెట్టి ఆయుధాల అధిదేవతలను ప్రార్థించి అక్కడ నుంచి బయలు దేరారు.

విరాటనగర ప్రవేశం –గమన వివేచన

ఇంతలో తెల్లవారుఝామునే ఆవుల మందను తీసుకురావడానికో, లేకపోతే పశువులను మేపడానికో, గొల్లవారు, గోపబాలకులు, లేక నగర ప్రవేశం చేసేవారో ఒకరొకరు వస్తున్నారు. వాళ్ళు చూశారు ఈ శమీ వృక్షం ప్రాంతంలో వీళ్ళు రావటము, పైనేదో పెట్టడము, ఎవరో గమనించారు. వాళ్ళు గమనించారో అడిగారో తెలియదు కాని గమనించినట్లు భావించి, ధర్మరాజు వాళ్ళందరికీ సమాధానం చెప్పాడు.

            “అయ్యా! 


చ.         ఇది శతవృద్ధు మాజనని; యిప్పుడు మృత్యువుఁబొందె; నట్లు సే     
            యుదుము; కుల ప్రయుక్త మగుచున్న సనాతన ధర్మమిత్తెఱం        
            గ; దహన కర్మ మొల్ల; మది గానిదిగా మును నిశ్చయించి మా      
            మొదలిటివా రొనర్చు విధముం గొనియాడితి మేము నియ్యెడన్   (విరాట.  1-179) 

          ‘ఇది శతవృద్ధు మాజనని’ ఏమనుకుంటున్నారు, ఇది మా తల్లి. వీళ్ళ ఆయుధాలను రక్షించేది ఈ శమీవృక్షమే కదా! అందుకని తల్లితో పోల్చడంలో తప్పు లేదు. ‘ఇప్పుడు మృత్యువుఁబొందె,’- ఇప్పుడు వీటితో మాకు పని లేదు. ‘అట్లు సేయుదుము కుల ప్రయుక్త మగుచున్న సనాతన ధర్మం’ కాబట్టి మాకు వీటిని రక్షించుకుని ఉండవలసిందే కాని దీనికి దహన ఖనన సంస్కారాదులు చేయడం మా కులాచారం కాదు. అందుకని ఇక్కడ పెడుతున్నాం’ అంటూ  విరాట నగర ప్రాంతం వైపు బయల్దేరారు.

Player
>>