భీమమల్ల యుద్ధము1

జీమూతమల్లయుద్ధం

జీమూతమల్లుని రాక...

క.            ఉన్న తఱి వివిధదేశో
   
            త్పన్నులు నద్భుతవిధాయి బలవిక్రమ సం
              
పన్నులు నగుమల్లులు విభ
               
వోన్నతుఁడగు విరటుపాల నుద్భటవృత్తిన్’                      (విరాట.  2-4)

               తిక్కన గారు కథను చాలా సంక్షిప్తం చేసి సూటిగా మల్లుడిని కథలోకి తీసుకుని వచ్చేశారు. ఒక బ్రహ్మోత్సవం జరిగింది. సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అని అక్కడ వేదవ్యాసులవారు చెప్పారు.  

               ‘అథ మాసే చతుర్థే తు బ్రహ్మణః సుమహోత్సవః’- నాలుగు మాసాలయినాయి. ఒక మహోత్సవం జరిగింది. ఆ మహోత్సవంలో జరిగే విద్యాప్రదర్శన కారణంగా మల్లులు అందరూ వచ్చారు.

క.            తమలోన మాటలాడెడు
  
            సమయంబున నొక్కరుఁడు విశాలోరస్కుం
               
డమితబలుఁడు పంచానన
              
సమమూర్తిస్ఫూర్తి యధిక సంరంభమునన్.’             (విరాట.  2-5)

భయంకరమైన ఆకారంతో ఒక మల్లుడు వచ్చాడు,

వ.  ‘అన్నరపతి కట్టెదుర నిల్చి మ్రొక్కి భుజాస్ఫాలనంబు సేసి యిట్లనియె’ (విరాట.  2-6)

               అంతకుముందు ఎవరెవరు వచ్చారు? ఏమి జరిగింది? అనే ప్రసక్తి తిక్కన గారు వదిలేశారు. ఆ మల్లుడు వచ్చి భుజాస్ఫాలనం చేశాడు. రాజు ఎదుట భుజాస్ఫాలనం చేయడం అంటే, అక్కడ ఉన్న వాళ్ళను సవాలుచేస్తున్నట్లు. ఎవరైతే మల్లయుద్ధంలో నన్ను గెలుస్తారో వాళ్ళకు తాను దాసుడ నవుతానని చెప్పడం. విలువిద్యలో సవాలు చేసే విధానం- విల్లును ఎక్కుపెట్టి ధనుష్టంకారం చేస్తారు. నారి సారించి వదిలితే, ఆ ధనుష్టంకారం వల్ల ఎదుటివాడికి రోషం కలుగుతుంది. ఒక్కొక్క ఆయుధ విశేషంతో, ఒక్కొక్క శాస్త్ర ప్రధానంలో ఒక్కొక్క విధంగా ఎదుటివాడిని సవాలు చేస్తారు. కూచిపూడి నాట్యంలో జడ ప్రదర్శించటం అటువంటిదే. ఆ విధంగా మల్లుడు వచ్చి భుజాస్ఫాలనం చేసి,  ‘నేల నాలుగు సెఱఁగుల నృపుల కొలువు, లందు నేను వర్తించితి’ ఈ కథ అందరికీ తెలిసిందే. ఆ మల్లుడిని భీముడు ఏం చేశాడో తెలుసు. కాని అక్కడ జరిగిన విశేషాన్ని తిక్కనగారు ఎలా చెప్పారో చూద్దాం.

తే.         నేల నాలుగు సెఱఁగుల నృపుల కొలువు

            లందు నేను వర్తించితి నవనినాథ!
            యగ్గలించి నా యెదుర బాహప్పళించి

            కడఁగజాలెడు మల్లులఁ గాన నెందు                   (విరాట.  2-7)

               ‘యగ్గలించి’ - ఎవ్వడు కూడా విజృంభించి ‘నా యెదుర బాహప్పళించి’ - నా ఎదురుగా, నేను చేస్తున్నట్లు ‘బాహువులు అప్పళించి, కడఁగఁజాలెడు మల్లులఁ గాన నెందు’ - చేసిన వాడు లేడు, నేనింతవరకు నాకు సరైన వానిని చూడలేదు.

Player
>>