భీమమల్ల యుద్ధము2

            ‘అనునెడ’ వాడిని చూశారు. ‘వాని యుగ్రసమదాకృతియుం’ - వాని ఆకారము. ఉగ్రత అంటే భయం. దానికి తగిన ఆకారం. భీముడు ఉన్నాడు. ఆయన ఉగ్రసమదాకృతి అనుకున్నప్పుడు అలాగే అవుతాడు. మామూలుగా ప్రసన్నంగా ఉంటాడు. వీళ్ళందరికీ నచ్చచెప్పేటప్పుడు, చూశాం కదా! పాపం! నేను వంట చేసుకుంటాను. ఎవడినైనా తంతాను కాని చంపను. ఇవన్నీ చెప్పుకున్నాడు.

           ఆ మల్లుడు భయంకరుడు. దానికి తగిన ఆకారము ఉంది. ‘పటువాక్య వృత్తియుం’ - ఆ గర్వంతో సవాలు చేస్తున్న వాక్యముల విశేషం, ‘కని విని’- వాని యుగ్రసమదాకృతి కని, పటువాక్యవృత్తిని విని, ‘మల్లులెల్ల భయకంపితమూర్తులు దాల్చి’ - ఒకసారి చూశారు, చూసి ఫర్వాలేదులే! అనుకుంటూ ఉండగానే వాడు చెప్పిన మాటలు విని భయపడ్డారు. ‘మాఱువల్కను, గనువిచ్చి చూడను’ క్రమం  మార్చేశాడు ఇక్కడ. ఈ పద్యంలో ఉండే విశేషం చూడండి. క్రమాలంకారంతో వాడి ఆకారము కని, పలుకులను విని వాళ్ళు నిశ్చేష్టితులయ్యారు. మళ్ళీ ఏమయ్యారు? ‘భయకంపితమూర్తులు దాల్చి, మాఱు పల్కను’ ఎందుకండీ? జవాబు ఇవ్వాలి కాబట్టి పలకాలి, కను విచ్చిచూడను, కళ్ళు మూసుకున్నారు. అందుకని తిరగబడిందక్కడ మళ్ళీ వచ్చేటప్పటికి. వాళ్ళు కను విచ్చిచూడను, మాఱు పల్కను అంటే క్రమం తప్పదు. కానీ వాడు సవాలు చేస్తున్నప్పుడు రాజు తన మల్లులవైపు ఎవడైనా ఉన్నాడా? అని చూశాడు. వాళ్ళు రాజు వైపు చూశారు. చూసి మాఱుపల్కను, మాట లేదు కాబట్టి కళ్ళు దించుకున్నారు. ‘మాఱు వల్కను గను విచ్చి చూడను మొగం బెగయింపను’– వంచిన మొహం పైకెత్తలేకపోయారు. తల దించుకున్నారు.

   మూలంలో వ్యాసులవారు....

శ్లో.          అథ మాసే చతుర్థే తు బ్రహ్మణః సుమహోత్సవః
              ఆసీ త్సమృద్దో మత్స్యేషు పురుషాణాం సుసమ్మతః
              తత్ర మల్లాః సమాపేతు ర్దిగ్భ్యో రాజన్ సహస్రశః
              మహాకాయా మహావీర్యాః కాలఖంజా ఇవాసురాః                  (వ్యాసభారతం)

               అందరూ వచ్చారు. ఎవరెవరు వచ్చారు అంటే? ‘మహాకాయాః మహావీర్యాః కాలఖంజా ఇవాసురాః’ తిక్కనగారు ఎవరెవరు వచ్చారో చెప్పలేదు. ఆ మల్లునిగురించి మాత్రమే చెప్పాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా మహాకాయులు, మహా వీరులు, కాలఖంజులు లాంటి వాళ్ళు.

               ‘దర్పోన్యద్ధా బలోదగ్రా రాజ్ఞా సమభిపూజితాః’ వీళ్ళందరూ వచ్చారు. ‘అసకృ ల్లబ్ధ లక్షా స్తే రంగే పార్థివసన్నిధౌ’ అందరూ వచ్చి నిలబడ్డారు. ‘తేషాం ఏకో’ – ‘వారలలోన ఒక్కడు విశాలోరస్కుండు’. ‘తేషా మేకో మహానాసీత్ సర్వమల్లా స్యాహ్వయత్’ - వీళ్ళందరికీ కలిపి ఒకే రూపు అయినట్లు వాడు ఒక్కడే నిలబడ్డాడు. ‘ఆవల్గమానం తం రంగే నోపతిష్ఠతి కశ్చన’ - ఎవరూ కూడా చూడలేకపోయారు వాడిని. సవాలు చేశాడు. విరాటరాజు ఏం చేయాలి? అనుకుంటూ మొహం కొంచెం దించుకున్నాడు. వీడు ఎక్కడినుంచీ వచ్చాడో తెలియదు. తన రాజ్యంలోకి వచ్చాడు. తాను చేస్తున్న ఉత్సవంలో ఊరికే ఏదో క్రీడావిశేషంగా పాల్గొంటే బాగుంటుంది. కానీ బాహువులు చరచటంతో మహాప్రభువుకే సవాలు విసరినట్లయ్యింది. తన గౌరవాన్ని ఎవరు నిలుపుతారు? అని చూస్తున్నాడు. 

Player
>>