భీమమల్ల యుద్ధము3

జీమూత మల్లునితో భీమసేనుని మల్ల యుద్ధం...

               ‘అజ్జనపతి వేడ్క మ్రోడుపడు చందము గాంచి యుధిష్ఠిరుం డనున్’ - ధర్మరాజు అనే పదం వాడలేదు. తిక్కన గారిలో ఉండే అత్యద్భుతమైన ఉచితపదప్రయోగనైపుణ్యమిది. యుధిష్ఠిరుడు, ఎప్పుడయినా యుద్ధంలో గాని, క్లిష్టపరిస్థితిలో గాని స్థిరంగా నిలబడేవాడు. ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితి కలిగింది. ఈ పరిస్థితి యుధిష్ఠిరుని లాగానే ఉండాలి కనుక – ‘యుధిష్ఠిరుం డనున్’.

క.         వీనికి మార్కొనఁ జాలెడు
            దానికిఁ దగువాని ధర్మతనయుని పురిలో
             నానానియుద్ధలంపటు 
             నే నొక్కనిఁ గంటి నిపుణుఁ డిందుల కతఁడున్                   (విరాట.  2-9)

               ధర్మరాజు పక్కనే కూర్చున్నాడు కదా! మెల్లిగా అంటున్నాడు. ‘దీని కింత డీలా పడాల్సిన పని లేదు. వీడితో పోరగలవానిని ధర్మరాజు కొలువులో చూశాను. ‘నిపుణుఁ డిందుల కతఁడున్’ వీడితో యుద్ధం చేయాలంటే వాడే తగిన వాడు,

క.         మన బానసీఁడు వలలుం,
            డను శూద్రుఁడు నాకుఁదెల్ల మధిక బలుల నో
            ర్చినవాఁ డనేక మల్లుల.
            నిను మెచ్చింపంగఁజాలు నిజమిది యధిపా!          (విరాట.  2-10)

               వాడిని పిలిపిద్దాం. గొప్ప శిక్షకులే అవసరంలేదు. ‘అనవుడు-ఆ నాలుగు నెలలలో విరాటుడు కంకుడు ఏది అంటే అదే అనే పరిస్థితికి వచ్చాడు. సందర్భానికి తగిన ఉదాత్తవచన ప్రకారాలన్నీ చెప్తానని ఆయనే చెప్పుకున్నాడు కదా!

                ‘అనవుడు భూపతి పిలువం బనిచె నతని నతఁడు నపుడ భయభక్తులతోఁ’ అతన్ని పిలిపించాడు.  వచ్చిన అతడెవరు? భీముడు. ‘వచ్చి భయభక్తులతో వలలుడు, చనుదెంచి మల్లవర్గముఁగని’ భీమునికి తెలియదు ఎందుకు పిలిపించాడో? ఒక్కసారి ఆ పైకొంగు వేసుకుని వచ్చాడు. రాజుగారి దగ్గరకు వచ్చి చుట్టూ చూస్తే, కనులకు నయనానందకరమైన దృశ్యం. చూస్తే ఒక్కొక్కళ్ళూ మూపులు పెంచుకున్న వాళ్ళు, కచ్చ బిగించిన వాళ్ళు, ఒళ్ళు విరుచుకుంటున్న వాళ్ళు, అందరినీ చూశాడు. చూస్తేనే అర్ధమైపోయింది, ‘ఆహా! ఇది కదా! నాకు షడ్రసోపేతమైన భోజనం’ అనుకున్నాడు. ‘మై వెఱుగంగ నిలిచె’ మై అంటే శరీరం. ‘వెఱుగంగ’ - శరీరం ఉప్పొంగింది. ‘కౌతూహలియై’ తనకు ఇన్నాళ్ళకు సరైన పని దొరక బోతోందనే కుతూహలం కలిగింది.  

               ‘ఇట్లు నిలిచిన పవనతనయు నవలోకించి, యవనీ వల్లభుండ మ్మల్లముఖ్యుం జూపి’ - ఆ మల్ల ముఖ్యుని చూపించి ‘ఇతని తోడి యుద్ధంబునకు సన్నద్ధుండవు కమ్ము’ - ఇక్కడ విరాటుని మాటల విధానం చూడండి. ఇది తిక్కనగారు పాటించిన మర్యాద. ధర్మరాజుతో మాట్లాడేటప్పుడు ఉచితంగా మాట్లాడాడు. భీమునిదగ్గరకి వచ్చేటప్పటికి అతను సేవకుడు మాత్రమే, ఆజ్ఞాపించాలి అంతే. ‘ఇతనితోడ యుద్ధమ్మునకు సన్నద్ధుడవు కమ్ము’ - ‘నువ్వు ఆ రోజు జగజ్జెట్టి మల్లుడ నని అన్నావు కదా! పోయి సిద్ధం కా’ అన్నాడు. ‘అనిన అతండును ధర్మతనయు’ చూశాడు. అలా సభనంతా చూస్తున్నట్లు ధర్మరాజు వైపు చూశాడు. ‘అనిన నతండును ధర్మతనయు కనుసన్న గనుంగొని’ ధర్మరాజు అంగీకారంగా చూశాడు. కళ్ళతోనే ఆమోదం లభించింది. 

Player
>>