భీమమల్ల యుద్ధము4

              ‘కనుగొని య మ్మత్స్యవిభునకు వినయంబుతో నిట్లనియె’. ‘అధిప! ధర్మజు పాల నున్నప్పు డతని వేడుకకుఁ దగఁ బెనఁగుదు’- ‘అయ్యా! నేనేదో గొప్పవాడిని కాదు. ఆయన వినోదం కోసం చేశాను’. ‘వింతలైన జెట్టిమల్లులతో నిప్పుడట్టువోలె’ ధర్మరాజు దగ్గర ఉన్నప్పుడు ‘వింతలైన జెట్టిమల్లులు’- ఎవరు వాళ్ళు? బకాసురుడు, హిడింబాసురుడు, కిమ్మీరుడు, జటాసురుడు, జరాసంధుడు, వీళ్ళు! ‘ఇప్పుడు అట్టు వోలె 'నీదు వేడ్కకుఁ బెనఁగెద నేర్చినట్లు’ – ‘నీ వినోదం కోసం నాకు చేతనైనట్లు పోరుతాను.’

               ‘అని మెత్తన యియ్యకొని’ రంగస్థలం నిర్మాణం చెయ్యాలి కదా! అంతవరకూ అక్కడ ఉన్న మల్లులలో ఏ మల్లుడు జీమూతమల్లునితో పోరుకు ముందుకు రాలేదు. అక్కడ ఉన్న యోధులంతా పోరలేక తల దించుకున్నారు, మాట పెగల్లేదు. ‘ఆహా! వీడు వచ్చాడు. వీడి రాకతో మనం బతికిపోయామురా’ అనుకున్నారు. విరాటుడు భటులను పిలిపించాడు, అక్కడ మల్లయుద్ధానికి కావలసిన రంగం సంసిద్ధం చేశారు. మల్లయుద్ధరంగంపై మల్లులు భూమిమీద పడితే ఆ భూమి కఠినంగా ఉండే రాతినేల అయితే అననుకూలంగా ఉంటుంది. కాబట్టి అక్కడ సన్నని ఇసుక వేశారు. రంగస్థలాన్ని సిద్ధంచేశారు.

               భీముడు వచ్చాడు. ‘అని మెత్తన యియ్యకొని’ - మెల్లిగ ఒప్పుకున్నట్లు నటించాడు. కాని భీముడిలో పొంగిపోతున్న ఉత్సాహం వేరేగా ఉంది. ఇన్ని రోజులుగా చేతులకు సరియైన పనిలేదు పాపం. ఎప్పుడూ ఆ గరిట తిప్పుకుని వంటవారితో ఉండాల్సిన వ్యవహారమే అయ్యింది. శరీరానికి సరియైన శ్రమ కలగలేదు. చాలా కాలమైపోయింది. వీళ్ళను చూసేటప్పటికి చాలా ఉత్సాహం కలిగింది. ‘మెత్తన యియ్యకొని, గర్జించి గజాలస్యంబునం బ్రాంగణంబు సొచ్చి’ - ఏనుగు నడకతో మెల్లిగా వచ్చాడు.

           ‘ఆలస్యము’ – ‘అలసస్య భావః ఆలస్యమ్’ - అలసుడైనటువంటి వాడు అంటే సోమరితనంగా ఉండేవాడు. మనకు తెలుసు కదా, సోమరులకు ఒక రాజుగారు ప్రకటంచిన బహుమానం సంగతి. ఈ రాజ్యంలోకెల్లా సోమరి యెవరో చేతులెత్తండి అని ఒక రాజు అడిగాడుట. ఒక్కడు మాత్రం చెయ్యి ఎత్తకుండా ఉంటే, ఆహా! ‘వీడు కదా మహా పురుషుడు’ అనుకుని, ‘నువ్వు సోమరి కావా’ అంటే ‘సోమరినే’ అన్నాడు. ‘మరి చేయి ఎందుకు ఎత్తలే’దంటే, దాన్నెందుకు ఎత్తడం దండగ?’ దానికి కూడా సోమరితనమే అన్నమాట. ‘అలసస్య భావః’ మరి అలసుడు అంటే సోమరితనం ఉన్నవాడు కదలనే కదలడు, ఆ విధంగా నెమ్మదిగా వచ్చాడాయన. మనం పనికిమాలిన వెధవ! అని తిడుతూ ఉంటాం. ఇంగ్లీషులో యూజ్ లెస్ ఫెల్లో. కాని అటువంటి వాడు సృష్టిలో ఎవడూ లేడు. వాడు కూడా దేనికో ఒకదానికి పనికొస్తాడు. అరే దేనికి పనికొస్తాడయ్యా! ఉదాహరణగా చెప్పడానికి పనికొస్తాడు కదండీ! వాడి లాగా ఎందుకున్నావు అనవచ్చు కదా!

               భీముడు మెల్లిగా వచ్చాడు. ‘ప్రాంగణంబు సొచ్చి’ - మల్లయుద్ధరంగంపైకి వచ్చి, ‘భూపాలుని ముందట భుజాస్ఫాలనంబు సేసి’ - ఆ ఆస్ఫాలనం ఎలా చేశాడు? నిత్యవ్యాయామకర్కశమైన తన శరీరాన్ని ఒక్కసారి పొంగించి భుజాస్ఫాలనం చేశాడు.  ‘మ్రొక్కి మరలునెడ’ - రాజు దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకుని, ‘మరలునెడ నంతకుమున్న యమ్మల్లవరుండు’ - వలలుడు - భీముడు – రాక ముందే, ఆ మల్లుడు వచ్చి నుంచున్నాడు. ఆ మల్లుని పేరు తిక్కనగారు చెప్పలేదు, కాని జీమూతమల్లుడని వ్యాసుల వారు చెప్పారు.

               ఆ మల్లుడు ఇంతకుముందే తయారై ఉన్నాడు కాబట్టి ‘నరపతి యనుమతి వడసి, కృతపరికర బంధుండై’ - మల్లయుద్ధానికి కావలసినట్లుగా దట్టి బిగించాడు, శరీరాన్ని సిద్ధం చేసుకున్నాడు. పట్టు బిగువకుండా ఉండే తైలము పూసుకున్నాడు. ‘అరుగుదెంచి యచ్చట నునికింజేసి’ – అక్కడ నిలబడి ఉండగా, ‘అతండును, ననిలసుతుండునుం’, అతడు అక్కడే నిలబడి ఉండగా, అనిలసుతుడు – భీముడు రాజుగారి అనుమతితో భుజాలను చరుచుకుంటూ మెల్లిగా వచ్చాడు. పరస్పరం ఎదురుగా నిలబడ్డారు. తన ఎదుట నిలబడిన భీముని చూస్తూ గర్వంతో నిలబడ్డాడు జీమూతమల్లుడు. ఎందుకని? ఇంతవరకు అతనిని తాకినవాడు లేడు. ఇక్కడికి వచ్చి ఆ విషయాలను గురించి ఆతను చెపుతూ ఉండగానే, అందరూ తలలు దించుకుని వెళ్ళిపోయారు.  

Player
>>