భీమమల్ల యుద్ధము5

మల్లయుద్ధ విశేషం....

           ఇప్పుడు భీముడు వచ్చి నిలబడ్డాడు. ‘అతండును అనిలసుతుండునుం బరస్పరమూర్తుల నవలో కించి’-ఒక్కసారి ఒకరినొకరు చూసుకున్నారు. మల్లయుద్ధానికి సిద్ధమౌతున్నారు. ‘యుద్ధరంగంబున మన్ను’ - అక్కడ ఉన్న మన్ను ‘ఫాలప్రదేశంబున ధరియించి’ – నుదుటిపై ఉంచుకొని, అది సంప్రదాయం. క్రిందికి వంగి, ఆ మట్టిని తీసుకుని, నుదుటిపై వ్రాసుకొని, ‘శరీరంబులపైఁజల్లుకొని’ - మట్టి తీసుకుని శరీరానికి పూసుకొన్నారు.

             వ్యాయామం చేసేటప్పుడు ఒక ఆచారం ఉండేది. వ్యాయామశాలలో బహిరంగంగా ఒక ఆవరణ, లోపల ఒక గది ఉంటాయి. ఆ గదిలో మెత్తటి మన్ను పరిచి ఉంటుంది. దాని లోపలికి పోవడానికి మనిషి దూరగలిగే సందు మాత్రం ఉంటుంది. తలుపులు ఏమీ ఉండవు. ఆ లోపలకి వెళితే వేడిగా ఉండి చెమట కారుతూ ఉంటుంది. ఆ వాతావరణంలో మల్లులు శరీర సాధన చెయ్యాలి. మూడడుగులు పైకి ఎగిరి భూమికి సమాంతరంగా ఉండే భంగిమలో కొద్దిసేపు నిలిచి, భూమి మీద పడాలి. ఆ చప్పుళ్ళు బయటకు ఎంత వినపడితే అంత సాధన చేస్తున్నారని అర్థం. అలాంటి శిక్షణ ఇస్తారు. ఆ మన్నుకు అంతటి ప్రాధాన్యం.

              కనుక ‘శరీరంబులపైఁ జల్లుకొని రెండు సేతుల మునివ్రేళ్ళను గొండొక పుచ్చికొని’ - ఇద్దరూ తీసుకున్నారు. ఆ సంప్రదాయాలు తెలుసు కాబట్టి ఆ మన్నును ‘మునివ్రేళ్ళను’ కొంచెం పట్టుకున్నారు. ‘ఒండొరుల దెసకు వైచి’ - ఎదుటివారివైపు వేసి, ‘యున్నతంబులగు నపసవ్య కరంబులను’ - భయంకరంగా ఉన్న అపసవ్యము, అంటే కుడి చెయ్యి. సవ్యాపసవ్యము అనే పదం వలన అపసవ్యము అంటే ఎడమచేయి అనుకుంటాం కాని అపసవ్యము అంటే కుడి చెయ్యి. ఆ కుడి చెయ్యి చాలా దీర్ఘంగా, బలిష్ఠంగా ఒక పరిఘలా ఉంది. ఆ కుడిచేతితో ‘ఆకుంచిత సవ్య బాహు తలంబుల’ ఎడమచేతిని వంచి ఇలా పెట్టుకున్నారు, ‘ఆకుంచితమైనటువంటి ఎడమ చేయి మీద సమున్నతమైన అపసవ్యం బాహు తలంబుల నప్పళించు’, ఆ సన్నివేశాన్ని సాక్షాత్కారం చెయ్యాలి కదా! ముడుచుకుని ఉన్న ఎడమచేతిపై కుడిచేతిని వేసి జబ్బలు చరుస్తూ, ఆ ‘ఆకుంచిత సవ్య బాహు తలంబుల నప్పళించు చప్పుళ్ళు గలిసి’, ఇద్దరూ పోరుకు సిద్ధ మవుతున్నారు కనుక ఒకేవిధంగా ఈ పనులన్నీ చేస్తున్నారు. ఇద్దరు ఒకే తాళ లయ సమన్వయంతో చేస్తున్నారు. అయినా ‘అది ఒక్కరుండె మల్ల సఱచిన చందంబున వీతేర’, ఇద్దరూ లయాత్మకంగా చేస్తున్నారు. ‘వింత తానకంబుల నిలిచి’ - వింతలు పుట్టించే తానకము, ఒక స్థానములో నిలబడేది స్థానకము, అదే తెలుగులో తానకము. వింత వింతగా ఇక్కడినుంచి, అక్కడికి పోయి నిలబడి, ‘కదిసిన యప్పుడు వృకోదరుండు’ అప్పుడు భీముడు ఏం చేశాడు? ‘ఉపతాయిలో’, ఇక్కడ తిక్కనగారు అప్పటి తనయుద్ధవిద్యా నైపుణ్యాన్ని చూపుతూ మల్లయుద్ధంలోని విశేషాల నన్నిటిని ఇక్కడ వివరించారు.

            ఆ యుద్ధం చేస్తున్నప్పుడు, మల్లయుద్ధం కదా! ఆయుధాలు లేవు. శరీరంలో ఉన్న ఆయుధాలు బాహువులే. ఆ బాహువులతో ఒకరిని ఒకరు పట్టుకునేటప్పుడు వాళ్ళు ఉపయోగించేవిధానాలు అవతలి వాడిని ఓడించటానికి పట్టే పట్లు అన్నిటినీ చూపిస్తున్నారు. ఉపతాయి, అంటే మల్లయుద్ధజ్ఞానాన్ని ఉపతాయి అంటారు. తాయి అంటే దెబ్బ. ఉపతాయి - ఆయుధంతో కాకుండా శరీరగతంగా దెబ్బతీయడం. ‘తనకొదవిన తోరహత్తము సూపి’ - ఉపతాయిలో - మల్లవిద్యాపరిశ్రమలో సంపాదించిన జ్ఞానములో తనకు చాలా పట్లు తెలిసి ఉన్నాయి. కాని అన్నీ ఒక్కసారే చూపించకూడదు కదా! ఒకేసారి బౌండరీస్, సిక్సర్లు కొడితే బౌలరుకు వాడిని ఎలా బయటికి పంపాలో తెలిసిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించుకుని ఎదుటివాడిని ఎలా ఓడించాలో అలా చేయాలి.

Player
>>