భీమమల్ల యుద్ధము6

         ‘తోరహత్తము’ అంటే తోరము, మనం తోరం కట్టుకుంటూ ఉంటాం. తోరము అంటే బంధం. బంధించి ఉండేది తోరం. హత్తము అంటే హత్తుకుని ఉండడం. ఎదుటి వాడిని పట్టుకుని గట్టిగా హత్తుకుంటే తోరంతో బంధించినట్లుగా దాన్ని తోర హత్తము అంటారు. ఆ తోరహత్తము సూపి, ఆ పట్టులో తన నైపుణ్యం చూపి, (ముష్టితో) ‘వ్రేయక సమదవృత్తిఁ బాసి’ - ఒక్కసారి వాడి దగ్గరకు పోయి పట్టుకుని వెంటనే వదిలి పెట్టి, ‘క్రమ్మఱఁజేరు’ - ఒక్కసారి వాడి దగ్గరకు పోవటం పట్టుకోవడం, వదలడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళటం. ‘బలువిడి వాఁడు పై నదరిన జరగక’ - వాడు కొంచెం విజృంభించి ‘పైనదరిన’ - తన మీదకు వస్తే, 'జరగక'. పరుగెత్తి పోకుండా అక్కడే అదే స్థానంలో నిలబడి, ‘అవనిఁగ్రుంగి నిలుచుచు’ భూమిపై కూర్చున్నాడు. వాడు లేచి మీద పడితే కూర్చున్నాడు. ‘నిలుచు నొత్తొరువున వలచినయప్పుడు’ - ఒత్తొరువు - ఒత్తు ఒరువు, ఒరువు అంటే బంధము లేదా నేర్పు. ఒరయు పిడి - ఒరపిడి అంటే ఒరుచుకుని రాపిడి. ఒత్తుకుని గట్టిగ పట్టుకుని ఒరపిడిపట్టి మేనును మేనుతో ఒత్తుకుంటున్నట్లుగా, ‘ఒత్తు ఒరవున వలచినయప్పుడు గొనిపోవు’ - పట్టుకుని కావలసినప్పుడు చుట్టూ తిప్పేస్తున్నాడు. ‘అవలీలఁ గూలవైచు’ - పట్టుకుని ఒక్కసారిగా వదిలేస్తున్నాడు. ‘జళికి పట్టిస మను సన్నపు విన్నాణములు దొరకొన్నను’ - మల్లయుద్ధంలో నాజూకైన విధానాలు ఇవి. ‘జళికి’- ఖడ్గం తీసుకుంటే మనమేం చేస్తాము? ఝళిపిస్తాము. ఆ ఝళిపించటం నుంచీ వచ్చింది. ఇక్కడ కత్తిలేదు, చెయ్యే! ఆ చేతిని ఝళిపించినప్పుడు ఆ జళికి ఎదుటివాడి హృదయంలో ముష్టిఘాతం అవుతుంది. పట్టిసము, వాడిస, పరిఘ, ఇవన్నీ ఆయుధాలు. ‘ఆ విన్నాణములు దొరకొన్నను ముట్టఁగొనఁడు’ - వాడేం చేస్తున్నా తాను మాత్రం దొరకడంలేదు, అందడం లేదు. ‘కాలిదెసఁ జొరవచ్చుట కానిపించి యుడుగు’ - తన కాళ్ళను పట్టుకుని, వాడు వంగి కాళ్ళను పట్టుకుని పైకి విసరివేసే ప్రయత్నం చేయబోతే అక్కడే నిలిచిపోయేవాడు. ‘సీసానఁబట్టియు’ - సీసము అంటే ఒక విధమైన ప్రయోగంచేత లంకె వేసి, మూతవేసి కదలకుండా చేయటం. మల్లయుద్ధంలో అది కూడా ఒక ప్రక్రియ, ‘సీసానఁబట్టియు నుప్పళించుఁ బోవనిచ్చు’ - ఆ విధానంలో పట్టుకుని కూడా వాడిని వదలివేస్తాడు. ‘మగుడ నేచి పోరఁజేరు’ - ఒకసారి వదిలాడులే అనుకుంటే మళ్ళీ పోయి పట్టుకుంటాడు. ‘చేరు నెడల సరిసేయ నగు తడవీక హత్తు’. ఇది వారిరువురి మధ్య మల్లయుద్ధం జరిగిన విధానం. తెలుగులో పదాలతో మల్ల యుద్ధం చేశారీయన.

వ్యాసులవారే మన్నారు, అంటే,

శ్లో.            ఉభౌ పరమ సంహృష్టౌ మత్తా వివ మహాగజౌ
               కృత ప్రతికృతై శ్చిత్రై ర్బాహుభిశ్చ సుసంకటైః
               క్షేపణై ర్ముష్టిభి శ్చైవ వరాహోద్ధత నిఃస్వనైః
               తలై ర్వజ్రనిపాతై శ్చ ప్రసృష్టాభి స్తథైవ చ                           (వ్యాసభారతం)

         అనుష్టుప్ శ్లోకాల్లో ఆవేశమూ ఉంటుంది. చాలా శాంతంగానూ ఉంటాయి. ‘శుక్లాంబరధరం విష్ణుం’ వంటివి. కానీ అనుష్టుప్ శ్లోకాల్లోనే ఈ రౌద్ర వర్ణనం కూడా చేశారు.

          ‘శలాకా నఖపాతై శ్చ’ - క్షేపణము, శలాకా నఖపాతనము వంటివి ఇరవదిఒక్క యుద్ధవిశేషాలు చెప్పారు వేదవ్యాసులవారు. ఈ తోరహత్తము వంటి శాస్త్ర జ్ఞానాన్నంతా ఆయన వెలువరింప జేశారు.

శ్లో.          ‘శలాకా నఖపాతైశ్చ పాదోద్ధూతై శ్చ దారుణైః
               జానుభి శ్చాశ్మ నిర్ఘోషైః శిరోభి శ్చావఘట్టనైః
               తద్యుద్ధ మభవత్ ఘోర మశస్త్రం బాహు తేజసా
               ప్రకర్షణాకర్షణయో రభ్యాకర్ష వికర్షణైః                                 (వ్యాసభారతం)
               ఆకర్షతు రథాన్యోన్యం జానుభిశ్చాపి జఘ్నతః
               తతః శబ్దేన మహతా భర్తృయన్తౌ పరస్పరమ్
               వ్యూఢోరస్కౌ దీర్ఘభుజౌ నియుద్ధ కుశలౌ వుభౌ
               బాహుభి స్సమసజ్జేతా మాయసైః పరిఘై రివ’                     (వ్యాసభారతం)

శలాకా నఖపాతైశ్చ పాదోద్ధూతై శ్చ దారుణైః’ - కాళ్ళతో కుమ్ముకోవడం.తద్యుద్ధ మభవత్ ఘోర మశస్త్రం బాహు తేజసా- ఆయుధాలు లేకపోయినా చేతులతోనే చేస్తున్న ఆ మల్లయుద్ధం భయంకరమైపోయింది. 

Player
>>