భీమమల్ల యుద్ధము7

          ఈ శ్లోకాన్ని సీస పద్యంలో అచ్చమైన తెలుగు చేశారు తిక్కన గారు.

వ.    ‘మఱియు ననేకగతుల యోజలు మెఱయుచుఁ గొండొకసేపు విరాటునకు వినోదంబు సలిపి’    (విరాట. 2-16)

               ‘నీకు వినోదాన్ని కలిగిస్తాను’ అని చెప్పాడు కనుక కొంతసేపు ఆడుకున్నాక ఇంక చాలు అనిపించింది. ‘కచ్చ యమరఁ బట్టి’, ఒకొక్క రాక్షసుణ్ణి ఒకొక్క విధంగా చంపాడు. ఒకడిని చిత్రవధ చేశాడు, ఒకడిని పట్టుకుని ‘వాని ముక్కునన్ వాతను కర్ణరంధ్రముల’ అన్నాడు, కిమ్మీరుణ్ణి పట్టుకుని వాడి ‘కోలెమ్ము బల్లమనగ’ విరిచినాడు. ఇప్పుడు వీడి విషయమేం చేయాలంటే ‘కచ్చ యమరఁ బట్టి’ ఆ మల్లుడిని అణచిన విధానం. పూర్ణమైన వస్త్రధారణ లేకుండా తొడలవరకే ఆ వస్త్రాలు ఉన్నాయి కాబట్టి, అడుగు భాగంలో పట్టుకున్నాడు, వాని ‘కచ్చ యమరఁ బట్టి కాళ్ళును జేతులు వ్రేల’ - ఒక్క చేతిలో ఆ నడుమును ఆ శరీరం మధ్య భాగంలో దృఢంగా కట్టుకున్న కచ్చను పట్టుకుని పైకి లేపితే, నీరసించి పోయి, చేతులు కాళ్ళు ‘వ్రేల’ - వ్రేలాడిపోయాయి. అంటే కింద ఉన్న పూలమాలను మధ్యభాగంలో పట్టుకుని పైకి తీస్తే రెండు వైపులా వ్రేలాడినట్లుగా వాడిని ఎత్తాడు. ‘మత్త గజము లీల మెఱయ’ - ఏనుగు ఒక వస్తువును ఎత్తినట్లుగా వాడిని పైకి ఎత్తాడు. ‘ముష్టి బలువు నెఱయ’ - తన ముష్టి, ఆ చేతుల్లో ఉండే దార్ఢ్యం మెరిసేటట్లుగా ‘ముక్కున వాతను నెత్తురొలక మల్లు నెత్తివైచె’ - వాడిని చాలా అవలీలగా ఎత్తి విసిరేశాడు. ఈ మల్లుడేమీ రాక్షసుడు కాదు కదా పాపం! బకాసురుడితో పోలిస్తే వీడెంత? వీడిని ఎత్తి పట్టుకుని, ఊరికే అలా పైకెత్తి చుట్టుతా తిప్పి పడేశాడంతే!

              ‘ఇవ్విధంబున విసరి నేలతో వ్రేసి వీఁపున మండివెట్టిన’ - ఏం మండి పెట్టాడు? మనం మండిగ వేసుకుని కూర్చో! అంటాం. అంటే మోకాళ్ళ మీద కూర్చోవడాన్ని ‘మండిగ వేసుకుని’ అంటాం. మనకు చిన్నప్పుడు స్కూల్లోనో, ఇంట్లోనో మాట వినకపోతే, చదివినది మరచిపోతే టీచర్ ఇచ్చే శిక్ష మోకాళ్ళ మీద కూర్చోవటం. వీపున ‘మండిపెట్టడ’మంటే బోర్లా పడిపోయిన వాడి వీపుమీద ఒక మోకాలు, ఒకటి భూమిమీద పెట్టి వాడిని వెనకనుంచి అణచి ఉంచటం. ‘మండి పెట్టిన’ ‘పెలుకుఱి తాళం బీ మదిఁ దలంచి’, వాడికి అస్తవ్యస్తమైపోయింది. ‘పెలుకుఱి తాళంబు’ - తాళము అంటే ఒక దెబ్బ. తన్నడం. మల్లుడు భీముడిని దెబ్బతీయాలని కింద పడి పోయినవాడు చేయి ఎత్తాడు. ఒక్కసారి ‘తాళంబీ మది దలఁచి’ భీముడిని మళ్ళీ కొట్టాలి అనుకుని, ‘అనువు గాక’ - వీలు గాక ‘ధరణీ తలము గరతలంబుల నప్పళించె’ - కింద పడిపోయాడు కదా! వీలు కాక చేత్తో భూమిని తడుతున్నాడు. ‘వాఁడక్కొలు వార్వఁగ విఱిచి మెఱసెఁ గుంతీసుతుఁడున్’ - వాడిని విఱిచి, అంటే చంపాడా? గెలిచాడా? అనేది మన ఊహకు వదలివేశాడు. వ్యాసులవారు జీమూతుడి పని పూర్తి చేశారు. వాడి వ్యవహారం అయిపోయింది.

               ‘ఇవ్విధంబున మహాబలుపట్టి యాజెట్టి నెట్టన గెల్చిన మత్స్యపతి మెచ్చి తనకిచ్చిన ధనంబు లచ్చటి యర్థి జనంబుల కిచ్చి’– ఈ విధంగా ఆ మహాబలుని గెలువగా విరాటుడు తనకిచ్చిన కానుకలను అక్కడే ఉన్న యాచకులకు పంచిపెట్టి, ‘నిజ నివాసంబునకుం జనియె’ - తన స్థానానికి వెళ్ళిపోయాడు. ‘మఱియు నిత్తెఱంగున నతనికి వేడ్కసలుపుచుండుఁ జిక్కని మల్లులు లేని తఱి’ - విరటునికి వేడుక కలగాలంటే మళ్ళీ మల్లులు రావాలి కదా! ఇటువంటి జీమూతమల్లులు దొరకకపోతే, ‘అంతిపురంబు నింతులు సూడ’ - విరాటునికిది వినోదమై ‘వేరు మల్లులు లేకపోతే ఏం? వీడితో వినోదించవచ్చని’, అంతఃపురకాంతలకు అందరికీ వినోదం కలిగించేలా, భీముని పిలిపించి ‘అయ్యవనీకాంతుండు పోరింప శార్దూల శుండా లాదులతోడ’ - పులులు, ఏనుగులతో పోరిస్తే, ‘ఈడంబోక పెనంగి భంగంబునకుం దెచ్చి మెచ్చించు చుండ’ - వాటిని లొంగ దీసుకుని మెప్పిస్తూ ఉన్నాడు.

క.         పెఱవారలు తమమెలఁగెడు
            తెఱఁగులు దొరఁకొన్న వింత తెరువుల నేర్పుల్
            మెఱయుచుఁ బతిచిత్తము గొన
            నొఱపు గలిగి మాన్యవృత్తి నుండుదురు దగన్                      (విరాట.  2-21)

              భీముడు ఇంత ఘనకార్యం చేస్తే ఉత్సాహంతో పొంగిపోవల్సిన ధర్మరాజు చాలా గంభీరంగా ఉన్నాడు. ఈ విధంగా అవకాశం వచ్చినప్పటికి బయటపడకుండా, తమ ప్రవర్తనను అనుమానించేందుకు ఆవగింజంత అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళు గడుపుతున్నారు.

          ‘ఇట్లు పాండవులు పాంచాలీ సహితంబుగా విరాటునగరంబున వర్తించుచుఁ గతిపయ దినంబులు గొఱంతగా నేఁడుకాలంబు గడపిన’ - ఏడు కాలమేమిటి? ఏడు – సంవత్సరం. ‘కతిపయ దినంబులు కొఱంతగా ఏడుకాలము’ - కొన్ని దినాలు తక్కువగా సంవత్సరమయింది. అంటే నాలుగు మాసాలలో మల్లుడు వచ్చాడు. ఆ తర్వాత కొంత కాలం గడిచింది. అంటే దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలయిపోయాయి. ఏడాది పూర్తి కావడానికి ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి అదీ ఈ వాక్య నిర్మాణం. ‘గతిపయ దినంబులు కొఱంతగా నేఁడుకాలంబు గడపిన సమయంబున మత్స్యపతి మఱందియు, దండనాథుండును, గీచకాగ్రజుండును, రూపాభిమానియు, నానాభరణధరణశీలుండును,  దుర్విదగ్ధుం డును, బలగర్వితుండును నగు సింహబలుండు దనయప్ప సుదేష్ణకు మ్రొక్కంజను వాఁడు’ కీచకుడి పాత్రప్రవేశం జరిగింది. ఈయన పాత్రప్రవేశం చెప్పినప్పుడు తిక్కనగారు వాడిన పదాలలో ఈ మాట చాలా విశేషమైనది. ‘ఏడు కాలంబు గడపిన సమయంబున’- ‘ఏడుగడ’ అంటే అభివృద్ధి. కీచకుడి దగ్గరకు వచ్చేటప్పటికి ‘ఏడు కాలంబు సమయంబున’ వాడి కాలం చెల్లిపోయి ఇక్కడకు వచ్చాడు. 

Player
>>