కీచకుని ఆగమనం1

కీచకుని ఆగమనము

            పాండవులు విరాట మహారాజు కొలువులో ప్రవేశించి దాదాపు పది నెలలయింది. అప్పుడు జరిగిన ఒక సమారోహంలో దేశాంతరగతులైన మల్లులందరూ వస్తే వాళ్ళందరిలో ప్రప్రథముడుగా ఉన్న జీమూతుడనే మల్లుడితో వలలుడుగా ఉన్న భీముడు మల్లయుద్ధం చేసి అతనిని జయించాడు. దాని తరువాత అందరూ సంతోషంగానే ఉన్నారు.

            ‘ఇట్లు పాండవులు పాంచాలీ సహితంబుగా విరాటు నగరంబున వర్తించుచుఁ గతిపయదినంబులు గొఱంతగా నేఁడుకాలంబు గడపిన సమయంబున’ - కొన్ని రోజులు తక్కువగా ఒక సంవత్సరకాలం గడచింది. ‘మత్స్యపతి మఱందియు, దండనాథుండును, గీచకాగ్రజుండును, రూపాభిమానియు, నానాభరణధరణశీలుండును, దుర్విదగ్ధుండును, బలగర్వితుం డును నగు సింహబలుండు’ - ఒక పాత్రను ప్రవేశపెట్టారు తిక్కనగారు. విరాటరాజు బావమరిది గారు వచ్చారు అని చెప్తే ఆయనకు తృప్తి లేదు. వాడి లక్షణాలన్నిటినీ పాత్రప్రవేశంలోనే నిక్షేపించి, దానికి అనుగుణమైన వాక్యప్రయోగంతో కీచకుడిని ప్రవేశపెడుతున్నాడు. అతనిలోని అనుకూల, ప్రతికూల లక్షణాలను అంటే అతనికి ఉద్బోధకంగా, వినాశకరంగా ఉండే గుణాలన్నిటిని ఇక్కడ కేంద్రీకరించి చెప్పారు. ‘మత్స్యపతి మఱందియు దండనాథుండును’ ఈ దండనాథత్వం అతనికి బాంధవ్యంవలన వచ్చిన పదవా? లేకపోతే దండనాథుడికి కావల్సిన లక్షణాలు ఉండటంవలన విరాటుడికి మరిది అయ్యాడా? రెండూ పరస్పరం నిజం. ‘కీచకాగ్రజుండును’ - నూరు మంది కీచకులలో ఇతను అగ్రజుడు. కౌరవులు నూరుమంది తరువాత కీచకులు నూరుమంది. వారికి ఇతను అగ్రజుడు. ‘రూపాభిమానియు’ - అతనిని ఆకర్షించినది సజీవమైనదైనా, నిర్జీవమైనదైనా, ఏదైనా సరే ఆహరించుకుని, అప్పళించుకునే స్వభావం ఉన్నవాడు. ‘నానాభరణ ధరణశీలుండును’ – వివిధ రకములైన ఆభరణాలను ధరించే విషయంలో ఆసక్తి ఉన్నవాడు. ‘దుర్విదగ్ధుండును’ - నేర్పు లేదు. విదగ్ధత అంటే ఒక విధమైన కుశలత. కార్యమును సాధించుకునే విషయంలో కౌశల్యం లేనివాడు దుర్విదగ్ధుడు. విదగ్ధత లేనివాడు దుర్విదగ్ధుడు. అంతేకాదు. చేస్తున్న పనిని చెడగొట్టుకునే విధంగా ప్రవర్తించేవాడు. ‘దుర్విదగ్ధుండును’ ఎందుకొచ్చిందా దుర్విదగ్ధత? ‘బలగర్వితుండును’ - అతనికున్న అపారమైన బలముచేత వచ్చిన గర్వంతో కలిగింది. ‘అగు సింహబలుండు’ - ఏనుగు చాలా శక్తిమంతమైన జంతువు అని అనుకుంటాం కాని ఆ ఏనుగు కుంభస్థలాన్ని కూడా చీల్చి చంపేది సింహం. సింహానికున్నంత బలమున్నవాడు సింహబలుడు. ఈ పదానికి ఒక ప్రాయోజికార్థం కూడా చెప్తారు. ఏ ఆయుధ సహాయం లేకుండా సింహంతో పోరి దానిని నిర్జించగలిగిన బలమున్నవాడు సింహబలుడు. అటువంటి కీచకుడు ‘దనయప్ప సుదేష్ణకు మ్రొక్కంజను వాఁ డద్దేవికి అనతి దూరంబున’ - అక్కగారిని చూసి పోదామని వచ్చాడు.

            ఇక్కడ తిక్కన గారు వాడిన ‘అప్పగారు’ అనే ప్రయోగం ‘అక్క’ అనే పదానికి పర్యాయపదం. ఆంధ్రదేశంలో ఉన్న మూడు ప్రధానప్రాంతాల్లో ‘అప్పగారు’ అనే పద ప్రయోగం కృష్ణాజిల్లా నుండీ ఆ పై వరకు కనపడుతుంది కాని, నెల్లూరుజిల్లాలో కూడా అంత ఎక్కువగా వినపడదు. రాయలసీమలో అసలే ఉండదు. రాయలసీమలో అక్క అంటారు కాని అక్కయ్య అని కూడా అనరు. అక్క అనేది చాలా విస్తారంగా కనిపిస్తుంది. ఈ ‘అప్ప’ అనే పదాన్ని నెల్లూరుకు, అక్కడికి దగ్గరలోని గుంటూరు ప్రాంతం వాడు కదా! నిక్షేపించాడు.

ద్రౌపదిని చూచిన కీచకుని మదనవికారం...

            తన అక్క సుదేష్ణకి ‘మ్రొక్కంజను వాడు’ - నమస్కరించి వెళుతున్నాడు. ‘నానాభరణధరణ విభూషితుండు, బలగర్వితుడు’ కనుక ఆ రాజసాన్ని వెలిగిస్తూ వస్తున్నాడు. వచ్చి వెళ్తున్నప్పుడు ఏదో తళుక్కుమని చెప్పి మెరుపు మెరిసినట్టయింది. ఏమిటిది? అని ఒక్కసారి తిరిగి చూశాడు. చూస్తే, ‘అనతి దూరంబున’ - అతిదూరము కాదు, చాలా దూరంలో లేదు. అనతి దూరంలో ఉన్న ‘ద్రుపద రాజ నందనం గనుంగొని’ - వీడు సింహబలుడు, సూతుడు, కీచకుడు. ఆమె ద్రుపదరాజనందన. ఆమె ద్రౌపది. కాని సైరంధ్రిగా ఉన్నది. ‘ఆమెను కని’ - ఒక్కసారి ఆమెను చూశాడు. రూపాభిమాని కదా! తిక్కనగారు కీచకుడి విషయంలో చేసిన పదప్రయోగం. ‘రూపాభిమానియు నానా భరణధరణ శీలుడు’.

కాబట్టి ఆ రూపాన్ని చూడగానే వెంటనే ‘అక్కజమైన చెల్వమున నాత్మకు వ్రేఁగయి పొల్చు పొల్తిపై నెక్కొను చూడ్కి’ - ఇంతవరకు ఇటువంటి స్వరూప సౌందర్యవిశేషవైభవాలున్న స్త్రీని ఎప్పుడూ గమనించినట్టు లేదు. ఆమె ఒక సాధారణమైన వనిత. శరీరంలో ఉన్న వర్ణం నలుపు. ధరించిన వస్త్రాదులు ఆమె సౌందర్యానికి ఉత్పాదకంగా లేవు. కానీ సహజంగా వెలుగుతున్న అగ్నికీలవలె తేజరిల్లితున్న ఆమె సౌందర్యాన్ని చూసినప్పుడు వెంటనే మ్రాన్పడిపోయాడు. ‘అక్కజమైన చెల్వమునకు ఆత్మకు వ్రేగయి పొల్చు’ - వెంటనే మూలాంతరాల్లో ఉన్న ఆత్మను తాడు వేసి లాగినట్లయింది. ‘పొల్చు పొల్తి పై’ - ఇది తిక్కనగారి పద ప్రయోగం. పొలతి అంటే స్త్రీ, ‘పొలతిపై’ అంటే ఛందస్సుకు సరిపోయే గణం రాదు, అందుకని ‘పొల్తి పై’. ‘నిరంకుశాః కవయః’ - పదాలను సృష్టించుకునే నిరంకుశత్వం కవులకు సహజసిద్ధమైన అధికారమేమో. ‘పొల్తి పై’ - అంటే పొలతిపై అనే వరకు కూడా ఆగలేదన్నమాట. చూశాడు. వెంటనే ‘పొల్తి పై నెక్కొను చూడ్కిఁ గ్రమ్మఱుప’ - అక్కగారిని చూడాలని గంభీరంగా వస్తున్నాడు. ఎవరో నమస్కరిస్తుంటే చెయ్యూపుతున్నాడు. తలకాయ ఊపుతున్నాడు. వంది మాగధులు నమస్కారాలు చేస్తుంటే, చూశాడు,చూశాడు. అక్కడే నిలబడిపోయాడు. ‘నెక్కొను చూడ్కిఁ గ్రమ్మఱుప నేరక యూరక నిల్చె’ - జడత్వాన్ని పొంది నిల్చిపోయాడు. 

Player
>>