కీచకుని ఆగమనం10

చిక్కు ప్రశ్న....

ఇలాగే ఒక ప్రేమజ్వర బాధితుడు ఇటువంటి వాటితోనే పద్యం వ్రాసుకున్నాడు తన ప్రియురాలిని బ్రహ్మదేవుడు ఏ మూలపదార్థంతో తయారు చేశాడోనని.

            పల్లవముఁ బూని సకియ మేనెల్లఁ జేసి
            పద్మగర్భుడు లా దీసి వా గుడిచ్చి
            మూ విసర్జించి యప్పుడప్పూవు బోడి
            డెంద మొనరించె సందేహమందనేల?                                                  

            ‘పల్లవము పూని’ పల్లవము-చిగురుటాకు తీసుకున్నాడండీ! ‘సకియ మేనెల్లఁ జేసి’ ఆమె శరీరాన్నంతా ఆ పల్లవంతో చేసాడట. అంత కోమలంగా. ‘పల్లవము పూని సకియ మేనెల్ల చేసి’ బాగుంది. మళ్ళీ పద్మగర్భుడు ‘ల’ తీయడ మెందుకు? ‘వ’ గుడిచ్చి, ‘ము’ విసర్జించడమెందుకు? ఆయనన్నాడు, ‘అయ్యా! ఇవి బహిఃప్రాణమైన శబ్దాలు, వీటి వెనక అర్థాన్ని కూడా గమనించండి’. పల్లవము అనే అక్షరాలను తీసుకున్నాడు. పల్లవము అనే పదంతో ‘సఖియ మేనెల్ల జేసె’ శరీరాన్ని చేశాడు. పద్మ గర్భుడు ‘ల’ తీసి. పల్లవములో మిగిలిందేమిటి? ‘పవము’. ‘వ గుడిచ్చి’ - ‘వ’కు గుడి ఇచ్చాడు. పవిము అయింది. ‘ము’ విసర్జించి - ఇంక మిగిలిందేమిటి? ‘పవి’ - వజ్రాయుధం. ‘అప్పుడప్పూబోడి డెంద మొనరించె’ - శరీరం చెయ్యడానికి చిగురు తీసుకున్నాడు. మనసు చెయ్యడానికి వజ్రం తీసుకున్నాడు. మనసు కరగటం లేదు కదా! అందుకని. అంత కఠినంగా చేశాడా మనసు. ఆమె శరీర లావణ్యానికి మూల పదార్థం చిగురు. హృదయం చేయడానికేమో వజ్రం. ఇదన్నమాట ఆవిడ సంగతి!

          కీచకుడూ అలాగే అనుకున్నాడు. ‘నెఱి నిట్టిదని యింతి! నీ నెమ్మనం బెన్ని భంగుల నరసినఁ బట్టువడదు’ - ‘నేను ఇన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా నీ మనసు మాత్రం నాకు తెలియటం లేదు’. ‘తన యభిలాషంబు తేటపడం బలికిన నబ్బోటి కలుషించియు ‘ - కీచకుడు మాటలకు ద్రౌపది మనసులో, ‘చిక్కులో పడిపోయాను. చెప్తే ఒక దోషం, చెప్పకపోతే మరొక దోషం. వీడు సామాన్యమైన సేవక వృత్తి లోని వాడు కాదు. దండనాథుడు. రాజుగారి బావమరిది’ అనుకుని, ‘దుర్వారం బైన పరిభవవికారంబు దోఁపకుండ’ - బాధపడికూడా తనలోని అవమానవికారాన్ని బయటకు తెలియనివ్వకుండా ‘తన్నుందాన యుపశమించుకొని’ - తనను తాను కొద్దిగా నిలువరించుకొని, ‘వీడు దురభిమానియై యున్నవాడు’ - వీనిలో దురభిమానం పొరలు కప్పుకొనిపోయింది, కనుక విచక్షణ, వివేకము పనిచేయవు. ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. ‘వేగిరపడుట వెరవు గాదు’ - తొందర పడటం మంచిది కాదు. ఇప్పుడు వీడితో తొందరపడి ఒక మాట అంటే దాని పరిణామం ఎక్కడికన్నా పోవచ్చు. ‘వెరవు తోడన తప్పించుకొనవలయు’ కొంచెం భయం కలిగినా కూడా, జాగ్రత్తగా నైపుణ్యంతో ఇక్కడి నుంచీ తప్పించుకుపోవటం మంచిది ‘అని తలంచి’ - అని అనుకుంది.

            సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తెచ్చాడు కనుక ‘నాయున్న బాముఁ దలఁపవ’ - నా అవస్థను నువ్వు గుర్తించవా? చూడు ఎలా ఉన్నానో? నన్ను చూస్తే ఏమనిపిస్తున్నది? ‘యీ యొడలీ చీర యిట్టి యేవపుఁ జందం బోయన్న మదన వికృతిం జేయు ననుట యెంతయును నిషిద్ధము గాదే’ - ఓ అన్నా! నన్ను చూస్తే నీకు ఈ శృంగార భావమెలా కలిగిందో ఆశ్చర్యంగా ఉంది. నా శరీరం చూడు ఎట్లా ఉందో! ‘చనునె యిమ్మాటలాడ’- ఈ మాదిరిగా మాట్లాడటం నీకు తగునా? ‘సజ్జనులకు’ - అందులో నీలాంటి ఆభిజాత్య సంపద ఉన్న వాళ్ళకు, ‘ఆడుఁ బుట్టువులతోడ నీవును బుట్టినాఁడవు’ - నీకు కూడా తోబుట్టువులు ఉన్నారు కదా. ఇలా పలికితే ఎలా? ‘అట్లు గాకయు హీనవంశాభిజాత నైన పతివ్రతనగు నన్ను నడుగఁదగునె’ - ‘హీనవంశాభిజాత’. ఆమె హీనవంశంలో జన్మించినదా? కాదే! ద్రుపదరాజనందన. ఆమె హీనవంశంలో ఎలా పుట్టింది? ఈ హైన్యం ఎక్కడిది? హీనత అంటే ‘హీయతే స్మ హీనం’ - జారిపోయేది, విడువబడేది. దేనినైతే వదిలివేస్తామో అది హీనం. ‘ఓహాక్ త్యాగే’,- ‘హా’ అనే ధాతువుకు అర్థం త్యాగము. విడిచిబెట్టబడింది. ఎవరినైతే అందరూ వదిలిపెట్టేస్తారో వాడు హీనుడన్నమాట. హీనుడు అంటే మామూలు అర్థంలో పరమనికృష్టుడు, అసహ్యమైనవాడు అని.

           ‘హీనవంశాభిజాత’-నా వంశం గొప్పతనాన్ని నేను వదిలిపెట్టాను. అజ్ఞాతవాసధర్మంతో నా వంశమును, ఆభిజాత్యగౌరవమును హీనను - నేను వదిలిపెట్టినాను. ఆ అభిజాత్యాన్ని కనుక నేను కలిగి ఉన్నట్లైతే నా వైపు తేరిపార చూడగలిగే వాడివా? కనుక ‘హీనవంశాభిజాత నైన పతివ్రతనగు నన్ను’ – నేను హీనవంశాభిజాతను, వివాహితను అందునా పతివ్రతను. ‘అని వీడఁగఁ బల్కిన నమ్మనుజాధముఁ డంతఁ బోక మదనోన్మాదంబునఁ దన్ను నెదిరి నెఱుఁగక ‘ - చూపులతోనే ఇంతవరకు వచ్చింది. ఆమె రెండు మాటలు మాట్లాడేటప్పటికి ఇంకొంచెం ఉత్సాహం వచ్చింది. ‘వనితకు నిట్లనియె గారవంపుఁ బలుకులన్’.

Player
>>