కీచకుని ఆగమనం11

కీచకుని మదోన్మాదం...

కీచకుడి తత్వం ఎటువంటిదంటే? సుభాషితాల్లో భర్తృహరి అంటాడు,

శ్లో.        అకరుణత్వ మకారణ విగ్రహః
            పరధనే పరయోషితి చ స్పృహా
            సుజన బంధు జనే ష్వసహిష్ణుతా
            ప్రకృతి సిద్ధ మిదం హి దురాత్మనామ్.                 (భర్తృహరి సుభాషితం)

            ‘అకరుణత్వం, అకారణ విగ్రహః, పరధనే, పరయోషితి చ స్పృహా’ - కీచకుడి ఆలోచన ఈ నాలుగు విషయాలలోనే ఉంటుంది. అకరుణత్వం, అకారణమైన విరోధం తెచ్చుకోవడం, ఇతరుల ధనంపై ఆసక్తి, పరస్త్రీలపై వ్యామోహం. ‘సుజన బంధు జనేషు అపి అసహిష్ణుతా’ - తనకు మంచి మాటలు చెప్పే వాళ్ళపై అసహిష్ణత్వం. ‘ప్రకృతిసిద్ధ మిదం’ ఇది స్వాభావికం. స్వభావంతో పుట్టినది, ఎవరికి? ‘దురాత్మనాం’. కీచకుడు దానికి పరిపూర్ణమైన ఉదాహరణ. మళ్ళీ మొదలుపెట్టాడు దండకం.

సీ.         నెత్తమ్మిరేకుల మెత్తఁదనము దెచ్చి యచ్చునఁ బెట్టిన ట్లంద మొంది
            చక్రవాకంబుల చందంబు గొనివచ్చి కుప్పలు సేసిన ట్లొప్పు మెఱసి
            చందురు నునుగాంతి కం దేర్చి కూర్చి బాగునకుఁ దెచ్చిన యట్లు కొమరు మిగిలి
            యళికులంబుల కప్పు గలయంతయును దెచ్చి నారు వోసిన భంగి నవక మెక్కి
తే.         యంఘ్రితలములుఁ గుచములు నాననంబుఁ
            గచభరంబును, నిట్లున్న రుచిరమూర్తి
            యనుపమాన భోగములకు నాస్పదంబు
            కాదె? యీ త్రిప్పులేటికిఁ గమల వదన?                         (విరాట. 2-52)

            ‘నెత్తమ్మిరేకుల మెత్తఁదనము దెచ్చి యచ్చునఁ బెట్టిన ట్లంద మొంది’. తిక్కనగారు ఇన్ని పద్యాలు ద్రౌపదీసౌందర్యవర్ణనతో వ్రాస్తున్నారేమిటని మనం అనుకోవచ్చు. కాని, ఒక స్త్రీప్రాపు పొందాలంటే మనం ఏం చేస్తాము? సందర్భం ఉన్నా, లేకపోయినా శుభా కాంక్షలు, పుష్పగుచ్ఛాలు కానుకలు పంపుతాము. అలాగే కీచకుడు ఎలాగైనా ద్రౌపది మెప్పు సంపాదించుకోవాలి, ఆమెను తనవైపు ఆకర్షించుకోవాలి అని పొగిడితే దారిలోకి వస్తుందేమో నన్న ఆలోచనతో, ‘నెత్తమ్మిరేకుల మెత్తఁదనము దెచ్చి యచ్చునఁ బెట్టిన ట్లంద మొంది’- ‘నీ పాదాలు లేత తామరపూరేకుల మెత్తదనంతో అచ్చు పోసారన్నట్లు ఉన్నాయి’. కావ్యరససిద్ధాంతదృష్టితో చూస్తే, చాలా గొప్పగా ఉండేలా అమె శరీరావయవవర్ణన క్రమాలంకారంలో చేశాడు.

          ‘చక్రవాకంబుల చందంబు గొనివచ్చి కుప్పలు సేసినట్లొప్పు మెఱసి’ - చక్రవాక పక్షులు చాలా వట్రువుగా ఉంటాయి. ‘అటువంటి చక్రవాకముల వలె నీ కుచములు ఒప్పుగా ఉన్నాయి’. యుక్తాయుక్తవిచక్షణ లేక అసహాయురాలైన ఒక స్త్రీని ఈ విధంగా వర్ణిస్తున్నాడు.

తే.         నీవు దుర్జాతిగామికి నీవ సాక్షి
            పరసతీ సంగమున వచ్చు పాపమునకు
            నోరుతును గాని సైరింప నోపఁబచ్చ
            విలుతు తూపుల తాఁకున కలరుబోడి                           (విరాట. 2-53)

             నీవు దుర్జాతిగామికి నీవ సాక్షి, నువ్వా? ఊహు! ఈ శరీరలావణ్యం, కాంతి, నిలబడిన విధానము, దానిలోని రాజసం, ఇవన్నీ నువ్వు హీనజాతికి చెందిన దానివి అని ఎట్లా అంటాను? ‘పరసతీ సంగమున వచ్చు పాపమునకు నోరుతును గాని’ ఏమీ పర్వాలేదు నాకు. పారదారిక దోషం కలిగినా ఇబ్బంది లేదు. ఎందుకంటే కామ శాస్త్రాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేశాడు. వాత్స్యాయన కామసూత్రాల్లో, మహర్షి ‘పారదారికాధికరణ’ మని కొన్ని అధ్యాయాలు వ్రాసినాడు. కీచకుడు ఆ నేర్పులన్నీ చూసుకున్నట్టు ఉన్నాడు. కాబట్టి దానిలో వచ్చిన ‘పాపమునకు ఓర్తును కాని, సైరింప నోపఁ బచ్చవిలుతు తూపుల తాఁకునకు’ ఆ పూవిలుకాడు ఉన్నాడే! వాడి బాణాలకు మాత్రం నేను తట్టుకోలేను.

క.         అను నప్పలుకుల కయ్యం
            గన కోపము గదిరి ‘నీచు గావున జంకిం
            చినఁ గాని మెత్తఁబడి పోఁ
            డని మనమునఁ దలఁచి యిట్టు లనియెం బెలుచన్   (విరాట. 2-54)

            ‘అను నప్పలుకుల కయ్యంగన’ - అణుచుకుంటోంది, అణుచుకుంటోంది, అణుచుకుంటోంది. వీడికి నచ్చజెప్పుకుని వదిలించుకోవచ్చు అనుకున్నది. ‘మీ ఇంట్లో నీకు తోబుట్టువులు లేరా’ అని అడిగింది. ‘నేను ఏవగింపు కలిగించే ఈ స్థితిలో ఉన్నాను. నీకు ఇటువంటి భావమెందుకు కలుగుతున్నది? నువ్వు మహారాజవంశస్థుడవు, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ కావలసిన భోగాన్ని అందించే అనుకూల పరిస్థితులు ఉన్నాయి కదా!’ అని చెప్పింది. అయినప్పటికీ యుక్తాయుక్తవిచక్షణ లేక అంగాంగ వర్ణన చేశాడు. ‘కదులుచున్న దీపకళికవోలె’ హృదయంలో ఉన్న అగ్ని మండుతున్నా అణుచుకుని విరాటుడి రాజ్యానికి వచ్చింది.

Player
>>