కీచకుని ఆగమనం12
ద్రౌపది హెచ్చరిక...
వీడెప్పుడైతే ఈ విధంగా అన్నాడో, ‘కోపమున గదిరి నీచు గావున జంకించినఁ గాని మెత్తపడిపోడని మనమునఁ దలఁచి’ - వీడిని భయపెడితే కాని పోడు అనుకొని. ‘యిట్టు లనియె.’ ఇలా అంటున్నది. ఒక్కసారి అణచుకొన్న అసహ్యత, కోపము, అసహాయత, కీచకుడి నైచ్యము అన్నీ ఒక్కసారిగా ముప్పిరిగొని ద్రౌపదికి కోపం కలిగించాయి.
శా. దుర్వారోద్యమ బాహు విక్రమరసాస్తోక ప్రతాపస్ఫుర
ద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్
గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసం గిట్టి గం
ధర్వుల్ మానముఁ బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిం గీచకా! (విరాట. 2-55)
‘దుర్వారోద్యమ బాహు విక్రమరసాస్తోక ప్రతాపస్ఫురద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతుల్’ - పరాక్రమవంతులు, గీర్వాణాకృతులు అయిన గంధర్వులు నా భర్తలు. ‘ఏవురు’ అయిదుగురు. ఇప్పుడు ఇక్కడ ‘దోర్లీలన్ వెసన్ గిట్టి మానముఁ బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిం గీచకా !’ కీచకుడు అంటే అర్థ మేమిటి? కీచకము అంటే వెదురుబొంగు, ఎందుకంటే వాయు తాడనం, ప్రసారం చేత కీచుమని ధ్వనినిస్తుంది కాబట్టి. అరణ్యవాస సందర్భంలో సైంధవుడికి కూడా ఇదే చెప్పింది ద్రౌపది.
ఉ. శాతనఖాగ్ర ఖండితలసన్మద కుంజర కుంభియుక్తము
క్తాతత శైల కంధర గృహాంతర సుప్త మృగేంద్ర కేసర
వ్రాతము వేడ్క సూచికొన వారక చేరుట కాదె క్రోధ ని
ర్ఘాత మహోగ్రు భీముఁ జెనకం దల పోయుట నీకు సైంధవా! (అరణ్యపర్వం)
ఒక్కసారిగా ద్రౌపది ఇలా చెప్పేటప్పటికి కీచకుడి ఒళ్ళు జలదరించింది. పలుకు పలుకదేమో అనుకున్నాను, ఇదేమిటి, ఒక్కొక్క మాటతో శరీరానికి మనసుకు ఇక్కడా అక్కడా అనకుండా అన్ని చోట్ల తగిలేటట్లు తీవ్రంగా చెప్పింది. కానీ తేరుకున్నాడు.
తే. అనుడు నతఁ డిట్టులనియె ‘నా యతుల బాహు
బలముఁ జెనయంగ భవదీయ పతుల కారు
మూఁడు లోకంబులందు నెవ్వాఁడు లేమి
నిక్కువం బింత నమ్ముము నీరజాక్షి! (విరాట. 2-56)
‘నా యతులబాహుబలముఁ జెనయంగ భవదీయపతుల కారు మూఁడు లోకంబులందు నెవ్వాఁడు లేమి నిక్కువం బింత’ - ‘నా బాహుబలం ముందు నిలువగలిగినవాడు ముల్లోకాలలో ఎవ్వడూ లేడు’. రెండు అర్థాలతో చెప్పాడు, ‘నీ పతులనుగురించి భయపడుతున్నావేమో భయపడవద్దు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు నన్ను భయపెట్టాలని అనుకుంటున్నా వేమో అదీ వీలు కాదు’.
వ. అనిన విని సైరంధ్రి సైరణ దక్కి, ధిక్కరించి యిట్లనియె. (విరాట. 2-57)
ఇంక ఆమెలో ఓర్పు నశించింది. ‘ధిక్కరించి యిట్లనియె’ - అతనిని లెక్కచేయక ఇలా పలికింది.
క. ‘చనుఁ జనదని చూడక యం
దని మ్రాఁకుల పండ్లు కోయఁ దలఁచుట హితమే?’
మును చెడిన రావణాదుల
విని యెఱుఁగవె యెన్నఁడును వివేక విహీనా! (విరాట. 2-58)
‘హు! నువ్వెక్కడ? నేనెక్కడ?’. నేను ‘అందని మ్రాకుల పండ్ల’ వంటి దానను. అలాంటి నన్ను ఆశించటం నీకు తగునా? ‘మును చెడిన రావణాదుల విని యెఱుఁగవె యెన్నఁడును వివేక విహీనా!’ - పరస్త్రీవ్యామోహంతో నశించిపోయిన రావణాదుల గురించి వినలేదా? నీవు బుద్ధిహీనుడవై నన్ను కోరుతున్నావు.
తే. ఇవ్విధంబునఁ బలికిన యింతి పలుకు
గాన నేరక తమ యప్పకడకు మగుడ
నరిగె నెవ్వగ మనమునఁ బిరిగొనంగఁ
చిన్నఁబోయిన మొగముతో సింహబలుఁడు. (విరాట. 2-59)
ఈ విధంగా చివాట్లు పెట్టించుకుని, ‘మదనాగ్నిజ్వాలలు’ కాల్చివేస్తుంటే వేడి నిట్టూర్పులు వదులుతూ అక్క దగ్గరకి వెళ్ళి సూటిగా చెప్పాడు.