కీచకుని ఆగమనం13

సుదేష్ణ ఉద్వేగం...

            ‘ఏ నప్పుడు నీకుం జూపి అన్వయ నామధేయంబు లడిగిన యప్పొలఁతివలనం జిక్కి చిత్తం బుత్తల పడుచున్న యది’ - నేను అప్పుడు నీకు చూపించి వంశమును, పేరును అడిగిన ఆమెమీద నా మనస్సు లగ్నమై కలవరపడుతున్నది. ‘ఇకమీద నీవ యెఱుంగుదు’- ఇక నేనేం చేస్తానో? ఆపై నీదే బాధ్యత. ‘అయ్యింతి యింతసేపు నీ చేరువనుండి యిప్పుడెట మెలఁగె? నని యడిగిన’ ఒక్కసారి నన్ను ఆ విధంగా తిట్టేటప్పటికి గగుర్పాటు కలిగింది. తేరుకుని చూసేటప్పటికి మళ్ళీ కనపడలేదు. ఎక్కడికి పోయింది? ‘విని, యతని వేగిరపాటు చూచి శిరఃకంపంబు సేయుచు సుదేష్ణ నిజాంతర్గతంబున శిరఃకంపంబు సేయుచు సుదేష్ణ నిజాంతర్గతంబున’-అంతా విని సుదేష్ణ తల ఊపింది. ఈ వ్యవహారం ఎక్కడికి పరిణమిస్తుందో అని ఆమెకు మనసులో కొంచెం కలవరం కలిగింది.

తే.         రాగరసమగ్నుడయ్యె సైరంధ్రిఁ జూచి

            యకట! దీన నింకేమి యపాయమగునొ?
            వలదు తగదన్న నుడిగెడు వాఁడె వీఁడు?
            మాయదైవమ! యే నేమి సేయుదాన?                          (విరాట. 2-62)

            వీడు ఆమెను పొందడానికి ఉపాయాన్ని అడిగితే ఆమె అపాయాన్ని శంకించింది. ‘వలదు తగదన్న నుడిగెడు వాఁడె వీఁడు’ - వద్దు అంటే వినేవాడేనా? ‘మాయదైవమ! ఏనేమి సేయుదాన?’- ‘ఇప్పుడు నేనేం చేయగలను?’ సైరంధ్రి వచ్చినప్పుడే ఈమె చెప్పింది. ‘నిను గర్కటిగర్భము ధరియించునట్లు’ - నిన్ను నేను ఎలా పనిలో పెట్టుకుంటాను?’ ఆమె భర్తను దృష్టిలో పెట్టుకుని చెప్పింది కాని ఇది ఊహించలేదు. ఇప్పుడు ఈ విధమైన పరిస్థితి వచ్చింది. ‘అయినను నా నేర్చుకొలంది తగిన తెఱంగున వారించి’ - ఇప్పుడేం చెయ్యాలి? బుద్ధిచెప్పాలి అనుకుని, కీచకునితో ‘నీవెవరవు? కేకయరాజ్యానికి రాజువు. ఇక్కడ మత్స్యదేశానికి దండనాథుడివి. ఎవ్వరైనా నీపేరు చెప్తే కలలోనైనా భయంతో విహ్వలులైపోతారు.

            నీ పరాక్రమంతో గెలిచినట్టి సంపద ఎటువంటిది?  నీవు ఎక్కడికి వెళ్ళినా నీకు జయజయధ్వానాలతో స్వాగతం పలుకుతారు, నువ్వు క్రీగంట చూసినంతనే సమస్తం నీ దగ్గర వాలిపోతాయి, ‘లలితంబు లగు మట్టియల చప్పు డింపార, అంచకైవడి నడ నల్ల వచ్చి’ నీ అంతఃపురంలోనే సుకుమారంగా నడిచి వచ్చి ‘యెడ మేని నెత్తావి సుడియంగఁ బయ్యెద సగము దూలించి’ - వయ్యారాలు ఒలికించే స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. ‘పై మగుడఁ దిగిచి, సోలెడు నెలతీఁగె తీగ గ్రాలుచు వింత చెలువంబు దలకొనఁ జేరి నిలిచి తెలి గన్నుఁగవకు నెచ్చెలియైన’ - కళ్ళల్లో ఉండే కాంతికి నెచ్చెలియైన స్నేహభావంతో ఉండే వారు ‘లేఁత నవ్వొలయంగ సరసంపుఁ బలుకు పలికి, మెఱయు చెయ్వుల రాగంబు మెయికొనంగ నెడఁద సొగయించు మాటల నెలమి మిగుల నిన్ను ననురక్తిఁ గొలుచు న న్నెలఁతలుండ’ - అటువంటి స్త్రీలు ఉండగా ‘నీరసాకార సైరంధ్రిఁ గోరఁ దగునె?’ - ఈ సైరంధ్రిని కోరటం ఉచితమా? అనిన నప్పలుకుల దెస ననాదరంబు సేయుచు నచ్చేడియం జూచి కీచకుం డిట్లనియె.

క.         నా కొలువు వార కా ర
            న్నాకేశుం గొలుచు నంగనలలో నైనన్
            లేకునికి నాకుఁ దెల్లం
            బా కొమ్మకు నీడు వోల్పనయ్యెడు సుదతుల్.                    (విరాట. 2-66)

            నా కొలువు వారు కారు. ‘అ న్నాకేశుం గొలుచు అంగనలలోనైనన్ లేకునికి నాకు తెల్లంబు’ - ఆ  ఇంద్రుని కొలిచే అప్సరసలు కూడా ఈమెకు సాటిరారు. నీకేం తెలుసు? నువ్వు ఆడదానివి కాబట్టి నీకు తెలీదు. నాకు ఆ వ్యవహారం తెలుసు. ‘ఆ కొమ్మకు ఈడు వోల్పనయ్యెడు సుదతుల్’ - అక్కడ కూడా లేరు, మొదలుపెట్టాడు మళ్ళీ దండకం.

            ‘గండుమీలకుఁ బుట్టి కాముబాణములతో’ - ఏవేవో చెప్తున్నాడు. ‘కావున నా యెలనాఁగ నేమి ఉపాయంబున నైన నన్ను జేర్పవైతేని కందర్ప దర్పంబున నలందురి వందుదు ననిన నవ్వెలంది వెండియు యిట్లనియె’ - ఎన్ని రకాలుగా చెప్పినా మళ్ళీ మొదటికే వచ్చాడు. 

తే.         ‘ఆయురైశ్వర్య కీర్తుల నపహరించుఁ
             బరసతీ సంగమము, ధర్మ పథము నందుఁ
             బరఁగు వారలు పరిహరింపగఁ గనియు
             వినియుఁ దెలియవె యిది దుర్వివేక మగుట’.                  (విరాట. 2-69)

పరసతీసంగమం వల్ల నాశం పొందుతారని వినలేదా? అయినా తెలుసుకోలేక పోతున్నావు.

            ‘పతి యెఱింగినఁ దన ప్రాణంబుపై వచ్చు నను భయంబున నుల్ల మదరుచుండ, జనులు గాంచిన మానుషము దూలుఁ దన కను పుయిలోటమున మోము పుల్లగిలఁగ’ ఇటువంటి జారవ్యవహారంలో తలదూర్చిన స్త్రీ మనస్స్థితి ఏ విధంగా ఉంటుందంటే, ‘పతి యెఱింగిన తన ప్రాణంబుపై వచ్చు నను భయంబున ఉల్లము’ - భర్తకు తెలిస్తే తన ప్రాణంమీదకి వస్తుందని భయపడుతూ ఉంటుంది. ఎవరైనా చూస్తే అప్పుడు ఏమౌతుందో అనే భయంతో ముఖంలో కాంతి తరిగిపోతుంది. ‘బోటికి దోఁచిన బొలియుఁ దేకువ యను వెగడున చెయ్వులు వీడుపడగ’ - ఏ పని చేస్తున్నా మనసు భయంతో ఉలికిపడుతూ ఉంటుంది. ఒక పద్ధతిలో నిలువలేదు. ‘బంధుల కగపడ్డఁ బాయు నన్వయము’ - ఒకవేళ బంధువులకు తెలిస్తే వంశకీర్తికి కళంకం వస్తుందనే భయంతో ఉంటుంది. ‘క్రీడ దెస కౌతుకంబు కొనియాడ’ - ‘అటువంటివారితో నీకేం సుఖం నాయనా!’ ‘అది యునుం గాక’ - సరే ఈ విషయం అలా ఉండనీ! ఒక్కసారిగా ఆమెకు గుర్తుకు వచ్చింది. ‘బలవిక్రమ సంపన్నులు కల రేవులు దాని పతులు గంధర్వులు’ - దానికి అయిదుమంది గంధర్వులు భర్తలు. ‘వారల దలచిన నా చిత్తము తలకెడును; అది యేల నీకు తమ్ముడ! చెపుమీ’ - అది నీకెందుకయ్యా! దాని భర్తలను తలచుకుంటేనే నాకు మనసు భయంతో మనసు వణికిపోతోంది. ‘కాని తెరువునఁ బోయినఁ గలుగునయ్య!’ - కాని మార్గంలో మనం ఎందుకు పోవాలి? ‘బ్రతుకు చవి యెంతయైన అపథ్యములకు వేడ్క సేయుదురయ్య వివేకులు ఎవ్విధమున!’ - ‘పథి’ అంటే మార్గం. ‘అపథ్యము’ అంటే వెళ్ళకూడని మార్గంలో, చేయకూడని పనులకు నువ్వు ఎందుకు వెళ్తావు? ‘నా బుద్ధి వినవయ్య !’ - బ్రతిమాలుకుంటోంది పాపం. ‘కాని తెరువున పోయిన కరుగునయ్యా, బ్రతుకు చవి ఎంతయైన అపధ్యములకు వేడ్క సేయురదయ్య వివేకు లెవ్విధమున నా బుద్ధి వినవయ్య!’ - నాయనా! బుజ్జీ! బంగారుకొండ! విను నా మాట తండ్రీ! అని బ్రతిమాలుతోంది. ఎందుకంటే ఆమెకు ద్రౌపది చెప్పిన విషయం గుర్తుంది.

 

Player
>>