కీచకుని ఆగమనం14

               ద్రౌపది కొలువులోనికి వచ్చినప్పుడే సుదేష్ణ, ‘నువ్వు ఇంత సౌందర్యవతివి. నిన్ను చూసిన తరువాత ఎవడైనా, రాజు కాని ఇంకొకళ్ళు కాని, మనసు పడితే ఏది దారి?’ అని అడిగినపుడు ‘నీచమతి నన్ను నెవ్వడు సూచిన ఆరాత్రిలోనఁ జూతురు దెగఁ దారా చపలు ‘ - ‘నీకా భయం అక్కరలేదు. నావైపు దురాలోచనతో ఎవరు చూసినా ‘తారు’ - నా భర్తలు, ‘ఆ చపలు’ - ఆ చపల చిత్తుడిని, ‘తెగఁ జూతురు’ - ‘అంతమొందిస్తారు’. ‘ఆ చపలు హరిహరాదులు కాచిన బలవిక్రము లఖర్వములైనన్’ - ‘అట్టి చపలుడు ఎంత బలపరాక్రమవంతుడైనా, హరిహరాదుల రక్షణలో ఉన్నా లాభం ఉండదు’. ఈ సుదేష్ణకు వణుకు పుట్టించడానికి ఇంకొక పద్యం ఎక్కువ చెప్పాడు తిక్కన.

క.         ‘బంధు శతంబులు శౌర్య మ            
             దాంధములై శక్తి సంపదాభీలములై
             సింధుర సదృశత నున్నను  
             సంధుల సంధు లెడలించి చంపుదు రతనిన్.             (విరాట. 1-325)

            ‘బంధుసేనాదులతో పరివేష్టితుడై ఉన్నప్పటికి నన్ను ఎవడైతే నీచమైన దృష్టితో చూసి అవమానించదలుచుకుంటాడో వాడిని సంధుల సంధులు ఎడలించి చంపుతా’రని చెప్పింది. ఆమెకి అది గుర్తుకు వచ్చింది. ఆ మాటలు చెప్పగా.

క.         ‘అనవుడు అమ్మాటలు దన

            మనమునకు సహింపరామి మల్లడిగొనుచున్
            మనసిజ పరతంత్రత ని      
            ట్లని పల్కె సుదేష్ణ తోడ నతఁ డుద్ధతుఁడై.                  (విరాట. 2-74)

            వింటాడా? పోయేకాలం వచ్చినపుడు హితం కలిగించే మాటలను ఎవడు వింటాడు? ‘వనితా! నీవు ఇన్ని మాటలు మాట్లాడవద్దు’ అని అక్కగారికి చెప్తున్నాడు.

మ.       ‘వనితా ! యేనొక పల్కు పల్కెదఁ జతుర్వారాశి మధ్యంబునన్
            ఘన బాహాబలమొప్ప నన్ను నెదురంగా నొక్కఁడున్ లేమి యె
            వ్వనికిం దెల్లము గాదె! దాని మగలన్ వజ్రాహతిం గూలు శై
            ల నికాయంబన మద్భుజాసమదలీలన్ గీ టడంగించెదన్’    (విరాట. 2-75)

            ‘వనితా! యేనొక పల్కు పల్కెదఁ జతుర్వారాశి మధ్యంబునన్ ఘన బాహాబలమొప్ప నన్ను నెదురంగా నొక్కఁడున్ లేమి యెవ్వనికిం దెల్లము గాదె!’ - ‘నీకీ రోజు మత్స్యదేశ సామ్రాజ్యం అంతా ఎక్కడ నుంచి వచ్చింది? నేను సంపాదించిపెట్టినదే కదా!’. ‘వజ్రాహతిం గూలు శైల నికాయంబన మద్భుజా సమదలీలన్ గీటడంగించెదన్’ - ‘నన్ను గురించి తక్కువగా అంచనా వేస్తున్నావు. ఎవరైనా రానీ.’ ‘బుద్ధులు చెప్పుటెల్ల అటు పో విడుము’ - ‘నాకేం బుద్ధులు చెప్పవద్దు.’ ‘ఎమ్మెయినైన సౌఖ్య సంసిద్ధి యొనర్పు నాకు నెడజేసిన తాపము రూపు మాపు’ - ‘నా మీద నిజంగా నీకేమైనా అనురాగం ఉంటే ఈ పని చేసిపెట్టి నాకు సుఖం కలిగించు.’ ‘తాపము రూపు మాపు’ - విరహంతో బాధ పడుతున్నాను, నువ్వు కాకపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు? ‘నా వృద్ధియ కోరుదేని అవివేకివి నీవు అని నన్ను ఇట్లు అసంబద్ధములైన వాక్యములు’ - ‘నన్ను అవివేకి అని తిట్టవద్దు.’ ‘పల్కక వే పిలిపింపు’ - ‘నా మంచిని కోరితే వెంటనే ఆమెను పిలిపించు.’

తే.         ‘అనుచు దైన్యంబు నొందెడు ఆననంబు
            తోడ దిగ్గన లేచి యత్తోయజాక్షి
            చరణపీఠంబు కడఁ జక్కఁ జాఁగి మ్రొక్కి
            యున్న యద్దేవిఁ గనుఁగొని చిన్నఁబోయి’                      (విరాట. 2-77)

Player
>>