కీచకుని ఆగమనం15

సుదేష్ణ సాంత్వనం - కీచకుని మానసిక వికారం...

            ‘అద్దేవి కనుగొని’ ఇన్ని చెప్పినా కూడా వినని అతనిని చూసి, ‘ఆవల వచ్చు నాపదల కన్నిటికోర్చి’ - తరువాత వచ్చే పరిణామాలు ఎటువంటివైనా సరే! ఇప్పుడు వచ్చిన ప్రమాదాన్ని దాటెయ్యాలి కదా! ‘కా కీవెడ మాటలన్ మరల డెన్నివిధంబుల చూపి చెప్పినన్, గావలమైన వీడు తగు కార్యము పట్టునె?’ - ఇప్పుడు నేను కనుక ఈ పని చెయ్యకపోతే, గంధర్వులు వచ్చి చంపే విషయం తరువాత ఎప్పుడో జరిగేది, ‘వీని కెమ్మెయిం జావు నిజంబు మన్మథు నిశాతశరంబుల నైన అక్కటా!’ - ఈ సహాయం చేయకపోతే సాష్టాంగనమస్కారం చేసినవాడు మళ్లీ లేస్తాడో లేదో!  వెచ్చగా తగులుతున్న ఆ కరస్పర్శ చల్లగా అవుతుందని ఈమెకు వణుకు పుట్టింది పాపం.

          ‘అని మనమున తలపోయుచు తన తమ్ముని అల్ల నెత్తి దందడి దొరఁగన్ చనుదెంచు అశ్రుపూరము కనుగవలో మ్రింగికొనుచు’ - వాడిని చూసేటప్పటికి ఆమెకు దుఃఖం వస్తోంది. కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. వాటిని ‘కనుగవలో మ్రింగుకొనుచు’ - అక్కడే దాచి పెట్టుకుని, ‘ఇంత తరలనేల’ - ఇంత బాధపడటమెందుకు నువ్వు, ‘ఎమ్మెయి నయినను కొమ్మ నలవరించి కూర్చు టరుదె’ - ఇదేమి పెద్ద పని కాదు నాకు. అని ‘ఉమ్మలంబు తక్కి యూఱటతోడ నీవేగుము’ - ‘ఇప్పటికి నువ్వు నీ మందిరానికి వెళ్ళు, ‘నీవేగుము మసల వలవ దింక నిచట’ - ఇక్కడ ఉండకు. నీకు కావలసింది నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని ‘ఆసవమున కని’ - మదిర కోసమని నేను ఆమెని నీ వద్దకు పంపిస్తాను. కీచకుడు మంచి రసికుడు కాబట్టి,  ఆ రాసిక్యం ఉన్నవారి ఇళ్ళల్లో వివిధములైన మాదక ద్రవ్యాలు ఉంటాయి కాబట్టి ‘అసవమున కని నీదు నివాసమునకు దివములో’ - రేపు ప్రొద్దున ‘అవశ్యంబును నేను ఆ సుదతిన్ బుత్తెంతు నిజాసక్తి ఫలింపఁ గొఱలు మభిమతకేళి’ - ‘నీ దగ్గరకి నేను పంపించగలను. అంతవరకు నేను చేయగలను. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపో. రేపు ఉదయం నేను ఆమెను నీ దగ్గర మదిర కోసం పంపినప్పుడు అక్కడ నువ్వు చూసుకో!’ అని సుదేష్ణ తమ్మునితో చెప్పి పంపింది.

            సుదేష్ణ ఎందుకిలా చెప్పింది? తమ్ముని మీద ఉన్న ప్రేమాభిమానవ్యామోహమా? లేక విరాటనగర సర్వ సేనాధ్యక్షుడు, బలగర్వితుడు, మాటవినని మన్మథమదోన్మత్తుడి బుద్ధి విపరీతమై సకలసామ్రాజ్య సంపదలు హరింప జేస్తాడేమో నన్న భయం చేతనా? ఏమో! మరి అక్కడ వ్యాసమహర్షి భారతంలో సుదేష్ణ ఏమంది? ‘నువ్వు ఏదో ఒక వేడుక ఏర్పాటుచేయి. ఊరికే నీ ఇంటికి పంపించి ఏదైనా తీసుకురమ్మంటే ద్రౌపది వస్తుందా?’

శ్లో.        పర్వణి త్వం సముద్దిశ్య సురా మన్నంచ కారయ
            తత్త్రైనాం ప్రేషయిష్యామి సురాహారీం తవాన్తికమ్
            తత్ర సంప్రేషితా మేనాం విజనే నిరవగ్రహే
            సాన్త్వ యేథా యథాకామం సాన్త్య్వమానా రమేద్యది.          (వ్యాసభారతం)

            ‘పర్వణి త్వం సముద్దిశ్య’ - ‘ఒక సందర్భం కల్పించుకుని ‘సురా మన్నం చ కారయ’ - మంచి సురను తయారుచేయించి పెట్టు. నీ భవనంలో విందు ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించు. ‘తత్త్రైనాం ప్రేషయిష్యామి సురాహారీం తవాన్తికమ్’ - అన్ని ఏర్పాట్లు చేసి నాకు చెప్తే, ‘ఓహో తమ్ముడు నాకొరకేదో చేసిపెట్టాడు కదా!’ అని ఈమెకు పంపడానికి కారణం దొరుకుతుంది. ఉన్నట్లుండి ‘పోయి ఏదో తీసుకురా’ అంటే బాగుండదు. మంచి చక్కటి విందుభోజనాన్ని ఏర్పాటుచేసి, నాకు తెలిపితే ఆ కారణంచేత నేను ఆమెను పంపించగలను. ‘తత్ర సంప్రేషితాం ఏనాం’- ఆమెను పంపిస్తాను కానీ జాగ్రత్త సుమా! ‘విజనే’- జనాలు ఎవ్వరూ లేకుండా ఉండేట్లు చూడు. ‘నిరవగ్రహే’ - నీ తొందరపాటు చూపించవద్దు. ‘సాన్త్వయేథా యథా కామం’ ఆమెకు నచ్చజెప్పు. ఆమె ఒప్పుకుంటే సరే! ‘యథాకామం సాన్త్వ్యమానాం రమేత్ యది’ - ఆమెని అనుకూలంగా మార్చుకోగలిగి ఆమెకు అభిమతమైతే అప్పుడు నీ కోరిక తీర్చుకో! అంతే కాని పౌరుషం చూపించి అఘాయిత్యం చేయబోకు! ఇంత వరకు నేను చేయగలుగుతాను’ అని చెప్పి పంపించింది. 

            ‘అనిన విని కీచకుండు ముదిత హృదయుండయి నిజసదనంబునకుం జని వివిధ మధురసంబు లొనరించి సముచిత ఖాద్యంబులు సమకట్టి’ - అక్కగారి మాటలు విని సంతోషంతో తన ఇంటికి వెళ్ళి చక్కటి పానీయములు, భోజ్యములు చేయించి, ‘తత్ప్రదేశంబు విజనంబు గావించి, యొక్క రమ్యస్థలంబుననుండి పాంచాలివలని తగులు చిత్తంబు నుత్తలపఱుపం దలరి నెవ్వగల కగపడి తలపోఁతలకుం జొచ్చి దుర్విదగ్ధుండు గావున’ - ద్రౌపదిపై మరులుగొన్న తన మనస్సును అదుపు చేసుకుంటూ, ఎన్ని అవస్థలు పోయాడండీ! ‘పాంచాలివలని తగులు చిత్తంబు నుత్తలపఱుపం దలరి’ - ఆ దిగులు పోవడం లేదు కీచకుడికి. మనస్సు వేగిరపడుతోంది. ఇప్పుడు అక్కగారు చెప్పినందువల్ల ఇంకా ద్విగుణీకృతమైంది. ద్విగుణీకృతమో, చతుర్గుణీకృతమో, దశగుణీకృతమో, శతగుణీకృతమో ఉత్సాహం పెరిగి పోయింది. ‘ఆహా! ఇంక ఈ విరహ బాధ రేపటివరకే కదా!’ అనుకుంటూ ‘తలపోఁతలకుం జొచ్చి’ - అనేక విధాలుగా ఊహించుకుంటున్నాడు. ‘దుర్విదగ్ధుండు గావున’ - వీడికి బుద్ధి కుశలత లేదు కాబట్టి ‘నమ్ముగ్ధకుం తన సన్నిధిఁ గామ వికారంబు వుట్ట’ - ఓహో! ఆమె కూడా ఆలోచించుకునే ఉంటుంది. ఆమె అంతఃపురంలో పని చేస్తున్నది కనుక ఆమె సంగతి అక్కగారికి తెలిసే ఉంటుంది. లేకపోతే మా అక్కగారు అలా చెప్పి ఉండదు. 

Player
>>