కీచకుని ఆగమనం16

సీ.         కేలిమై నొక్కట లీలఁ గ్రేళ్ళుఱికెడు వాలుగు సోగల నేలుదెంచి
            కరువలి సుడియమిఁ గందక చెన్నొందు నెఱవిరితమ్ముల నుఱక తెగడి
            బెడఁగొంద దుడిచి మైఁ దొడసిన వలరాజు వాలిక తూపులఁ దూలఁ దోలి
            పొలపంబు మెఱసి దిక్కులఁ గాంతి పూరించు క్రొక్కారు మెఱుఁగుల నుక్కడంచి.

తే.         తన విలోచనములు నాదు మనము నాఁచి         
         
            కొనఁగ నయ్యింతి ననుఁ గనుగొనియె, నాత్మఁ
            గైకొనియె రాగ రసమునఁ గడలుకొనియె 
            మదన వికృతి బయల్పడ నుదిలకొనియె.              (విరాట. 2-83)

             ‘కేలిమై నొక్కట లీలఁ గ్రేళ్ళుఱికెడు వాలుగు సోగల నేలుదెంచి’ ఆమెను గురించి అనేక విధములుగా ఊహించుకుంటూ ‘అయ్యింతి నన్ను కనుగొనియె, ఆత్మ గైకొనియె, రాగరసమున కడలుకొనియె’. తన ఊహలకు రూపచిత్రణం చేసుకుంటూ ఆమె తనను చూసినట్లు, మనసు పడినట్లు, ప్రేమభావంలో మునిగిపోయినట్లు భావించుకుంటున్నాడు.  

ఉ.         చిత్తము మెచ్చి నా వలనఁ జిక్కగ వెండియు నా లతాంగి య
            చ్చొత్తిన యట్లు నాకుఁ దన యుల్లము దెల్లము సేయకున్కిఁ దా
            నత్తఱిఁ గ్రొత్తకాన్పగుట నడ్డము సొచ్చిన సిగ్గుపెంపు త
            న్ను త్తలమందఁ జేయుటకునో తలపోసి యెఱుంగ నయ్యెడున్. (విరాట. 2-84)

            ‘చిత్తము మెచ్చి నా వలనఁ జిక్కగ వెండియు నా లతాంగి యచ్చొత్తిన యట్లు నాకుఁ దన యుల్లము దెల్లము సేయకున్కిఁ దానత్తఱిఁ గ్రొత్తకాన్పగుట నడ్డము సొచ్చిన సిగ్గుపెంపు’ - ఓహో!! మా అక్కగారు రేపు పంపిస్తానని చెప్పింది కాబట్టి నా పట్ల ఆ సైరంధ్రికీ అభిప్రాయమే ఉండి ఉండవచ్చు. మరి నాకు అప్పుడు సమాధానం ఎందుకు చెప్పలేదు? ఓఁ! ఎవరూ పలకరించకూడని ప్రదేశంలో నాలాంటివాడు అడిగితే ‘అత్తఱి క్రొత్త కాన్పగుట’. ‘కనుట’ చూచుట, ‘కాన్పు’ చూపు - క్రొత్త కాన్పు - తొలిచూపు. ‘కొత్త కాన్పగుట అడ్డము జొచ్చిన సిగ్గు పెంపు తన్నుత్తలమందఁ జేయుటకునో తలపోసి యెఱుంగ నయ్యెడున్’ - తొలిచూపులోనే అంగీకరించడానికి సిగ్గు అడ్డు వచ్చి ఉంటుంది.

తే.         అనుచుఁ గొందలపడు కోర్కె లగ్గలించి           
            చిర్రుముర్రాడుచుండ నచ్చెలువ చెలువు
            తగిలి తన యిచ్చఁబాఱు చిత్తంబు పజ్జ
          
            నరిగి యిట్లను నక్కీచకాధముండు.                         (విరాట. 2-85)

           ‘అనుచుఁ గొందలపడు కోర్కె లగ్గలించి చిర్రుముర్రాడుచుండ’ - కీచకుడికి తన మనసులోని కోరికలు విజృంభించటంవల్ల అసహనం కలుగుతున్నది. ‘అచ్చెలువ చెలువు తగిలి తన యిచ్చఁబాఱు చిత్తంబు పజ్జ నరిగి యిట్లను న క్కీచకాధముండు’. ‘కీచకాధముండు’ అంటే నూరుమంది సోదరులలో అధముడు, ‘అధమాగ్రేసరచక్రవర్తి’ అని చెప్పుకోవచ్చు. ‘లీల నా ముంగట ఆ లేమ వొలసినఁ జూడ్కికి’ - ‘ఇంక ఆమె వచ్చి చిరునవ్వుతో నాతో తీయగా మాటలాడి, ఆనందింపచేస్తే నా జన్మ తరించినట్లే కదా!’ అనుకున్నాడు.

            ‘మఱియు ననేక భంగుల ననంగ విభ్రమంబుల కనురూపంబులైన బహువిధ ప్రలాపంబులం బ్రొద్దు గడుపు’  ‘ఈ రోజే కదా నా జీవితసార్థక్యం కలిగేది!’ అనుకుంటూ ఎవరైనా ఆ పరిసరాలలో కనపడితే, ‘నీవు అక్కడనుంచి వెళ్ళు. నీకు ఇక్కడేం పని లేదు వెళిపో’ అని ఆమె రాక కొఱకు ‘ఎదురు చూచుచుండె’ ఎదురు చూస్తున్నాడు.

 

Player
>>