కీచకుని ఆగమనం2

       ఒక్కసారి చూసిన అతనిలో ప్రేరేపింపబడిన అంతర్గతంగా ఉన్న పరమకాముకత్వ స్వభావలక్షణాలైన చేష్టలన్నీ ప్రదర్శిస్తున్నాడు. ‘ఊరక నిల్చెఁ గాము చేఁజిక్కిన నెమ్మనంబుఁ గడుఁ జేడ్పడు మానము’ - ఒక్క క్షణంలోనే అతని మనోభావమంతా మారిపోయింది. అక్కడకు వస్తున్న పని వేరు. ఈమెని చూసేటప్పటికి ఒక విధమైన విద్యుదాఘాతం కొడితే ఎలా దద్దరిల్లి పోతాడో అలా నిలబడిపోయాడు. ‘చేడ్పడు మానము’ తన స్థితేమిటి? ఎక్కడున్నాడు? ఎవరితో వచ్చాడు? ఎవరిని చూస్తున్నాడు? లెక్కలేదు. అది దుర్విదగ్ధత. విదగ్ధత ఉంటే నేరుగా వెళ్ళేవాడు. లేదు కనుకే అలాగే చూస్తున్నాడు. ‘చేడ్పడు మానముఁ జేష్టితంబులం దక్కిన యంగమున్’ - నిశ్చేష్టుడయ్యాడు. చేష్టలు లేని శరీరంతో, ‘తలకు ధైర్యమునై’ - ‘తలకు’ - చెదరిన ధైర్యమున్నవాడు ‘యతఁడప్పు డయ్యెడన్’ - వాడి అవస్థ ఆ మాదిరిగా మారింది. అంత గంభీరంగా వస్తున్నవాడు భావోద్వేగానికి లోనై అలా నిలిచి పోయాడు.

కీచకుని భావోద్వేగం - ఆలంకారిక వివేచన...

            ఒకొక్కరికి ఒకొక్క భావం కలుగుతుంటుంది. సాహిత్యవేత్తలైన మనవారు ఒక కావ్యంలో ఒక వస్తువును కాని, ఒక నాయకుణ్ణి కాని, ప్రతి నాయకుణ్ణి కాని వర్ణించేటప్పుడు చాలా గాఢంగా విమర్శించుకుని, విశ్లేషించుకుని చేశారు. అన్నిటికీ మూలప్రాతిపదిక నాట్యశాస్త్రం. నాట్యశాస్త్రంలో రస దృష్టితో చేసే వివేచనకు తదనుగుణంగా అభినయం ఉండాలి. కాబట్టి రసస్పర్శ చేస్తూ భరతమహర్షి చెప్పిన తరువాత వచ్చిన సిద్ధాంతాలలో ఆలంకారికశాస్త్రమతం విస్తారంగా ఉంది. మన అలంకార శాస్త్రం - ఒక సాహిత్యాధ్యయన శాస్త్రమన్నది పక్కన బెడితే, అది ఒక గాఢమైన మానసిక విశ్లేషణ. (It’s an absolute psychological deep analysis). అది స్త్రీకి కాని, పురుషుడికి కాని, వ్యక్తికి కాని, ఉన్న మానసిక స్వభావ విశ్లేషణము, ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కో వ్యక్తి ఒక్కో మానసికస్థితిలో ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు అనే విషయాన్ని విశ్లేషించి, దానిని నిక్షేపించి కావ్యరూపంలో పెట్టాలి అని చెప్పింది.

            అందులోని అవస్థలు తీసుకుంటే, సహజస్వభావమైన శృంగారము, చక్కిలిగింతలు పెడితే నవ్వు - హాస్యం, వీరం, రౌద్రం, కరుణ, భయం, బీభత్సం. ఇవన్నీ భావాలు. ఒక విషయాన్ని చూస్తే జుగుప్స కలుగుతుంది. ఆ జుగుప్స కలిగించే వస్తువును చూస్తే ఎవరూ చెప్పనక్కరలేదు. ఆ ముఖంలో, ఆ శరీర విన్యాసంలో తెలిసిపోతుంది. అలాగే ఏదో జరుగుతున్నది అని కుతూహలం. ఈ భావాలన్నీ తీసుకుని విశ్లేషిస్తే, మానవుడు ఉద్వేగానికి లోనయ్యే వస్తువిచార ధారను ఎనిమిది ప్రధానమైన విభాగాలుగా విభజించవచ్చని అన్నారు భరత మహర్షి. దాన్ని ఆధారంగా చేసుకుని నవరసాలు కాదండీ ఎనిమిది రసాలే అంటూ అష్టరససిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

                 అయ్యా! దీన్ని రసమని అనడమెందుకు? రసానికి దీనికి సంబంధం ఏమిటి? ఆ రసము అనే స్థితిని సహజంగానే మనము అనుభవిస్తూ ఉంటాము. ‘విభావై రనుభావైశ్చ సాత్త్వికై ర్వ్యభిచారిభిః, ఆనీయమానః స్వాదుత్వం స్థాయీ భావో రసః స్మృతః’,- అని ‘దశరూపక’ కర్త ధనంజయుడు. స్థాయి అంటే చెదరక స్థిరంగా ఉండే అనుభూతి. మరి భావ మంటే? ‘వికారో మానసో భావః’,- మనో వికారమే భావం. ఇంకా చూస్తే, ‘నిర్వికారాత్మకే చిత్తే భావః ప్రథమ విక్రియాః’’ - ఏ వికారమూ లేక నిశ్చల స్థితిలో ఉన్న మనస్సులో కలిగే మొదటి వికారమే భావము. ‘భావయతి జ్ఞాపయతి హృదయగత మితి భావః,’ అని వ్యుత్పత్తి. వాక్కుచేత కాని, సంగీతంచేత కాని, ప్రదర్శనచేత కాని, నాట్యంచేత కాని, నటనచేత కాని వ్యక్తి విశేషానుగతమైన శరీరస్పందనచేత కాని, ఎవరైనా ఒక భావాన్ని ప్రదర్శిస్తుంటే ఆ అనుభూతిని మనకు ఆవిష్కరింపజేసే ప్రయోగసిద్ధికి ‘రసం’ అని పేరు. దాని నిర్వచనం కూడా ‘రసో వై సః’ రసము అంటే. అదే! అదంటే ఏది? కవి కావ్యం రాస్తూ దాన్లో ఉన్న శృంగారరసాన్ని పోషిస్తున్నాడు అంటే, ఆ శృంగారరసాన్ని తీసుకుని ‘ఆహా!’ అని అస్వాదించ గలిగితే ఆ కవిమనసుకు సమీపంగా వెళ్ళినట్టు. అందుకని అతని హృదయాన్ని ఆశించి వెళ్ళడమే సహృదయత్వము అన్నారు. ఆయన వ్రాస్తున్నది, చెప్తున్నది మనం ఆయన దృష్టితో చూసి విమర్శ చేస్తే అది సహృదయత్వమవుతుంది.

              రసాలన్నిటిలో శృంగారం ప్రధానం అన్నారు. ‘శృంగి రివ వర్తతే ఇతి శృంగారః’ - రసరాజము అని శృంగారరసానికి ఉన్నపేరు. భోజుడు ‘శృంగార ఏవ ఏకో రసః’ - శృంగారమొక్కటే రసము, ఇతరములన్నీ దాని ననుసరించుకుని జనించేవే అని తన ‘సరస్వతీకంఠాభరణము’లో సిద్ధాంతీకరించినాడు. ఆ శృంగారం అందరికీ అనుభవైక వేద్యమైన విషయమే కాని ప్రత్యేకంగా గుర్తించం. కాని ఆ స్థితిలో ఉన్నప్పుడు వచ్చే భావాలు కాని, శరీరప్రకంపనలు కాని విభిన్నంగా ఉంటాయి. ఆ శృంగార రసానుభవంలో దశావస్థలు - దర్శన, స్పర్శన, సంభాషణాదులను గురించి వివరిస్తూ స్థాయిభావం అంటే ముగింపుగా రతిని గురించి వివరించారు.

             ఇప్పుడు ఈ శృంగారానికి సంబంధించిన దశావస్థావిశేషాల్లో ప్రథమమైన ‘దర్శనం’ అనే అవస్థకు లోనై సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని చూడగానే మ్రాన్పడిపోయాడు ఈ కీచకుడు. ఈ సందర్భంలో కీచకుడికి కలిగిన అవస్థలు ‘స్తంభ స్వేదోఽథ రోమాంచః, స్వరభంగోఽథ వేపథుః’ (నాట్యశాస్త్రము-6-22) వీడికి అన్ని అవస్థలూ కలుగుతున్నాయి. ఇతనికి ‘స్తంభం’ - స్తంభించి పోయాడు, అవాక్కయినాడు. ఇటువంటి స్త్రీని నేను ఎక్కడా చూడలేదనుకున్నాడు. ఆత్మకు గాలమేసి లాగినట్లయింది. ఎక్కడున్నాడు? అన్న విషయం కూడా మరచిపోయి, ‘ద్రౌపదీ రూపమను నురిఁ దగిలి’ - ఆత్మ వ్రేగయింది కనుక ద్రౌపది రూపం ఉరి అయింది.

             వీడు రూపాభిమాని కదా! రూపాన్ని అభిమానించేవాడు. రూప + అభిమాని అనే పదాన్ని విశ్లేషించి, విడగొట్టి అర్థం చెప్పుకుంటే రూపము అనేది ఒకటి ఉంటే ‘అభి’ దానికి ఎదురుగా, ఎక్కడ రూపముంటుందో దానికి ఎదురుగా ‘మానం’ వాడి మానాన్ని-గౌరవాన్ని- పణంగా పెట్టడానికి సిద్ధం అన్నమాట, అంటే ఉన్న స్థితికంటే దిగజారడం. ఆ రూపాభిమాని ద్రౌపదీ రూపము అనే ‘ఉరి తగిలి తనదు హృదయమను మృగము’ - ఆ ఉరిలో చిక్కుకున్నది మృగం. అంటే మృగము ఒక చోట స్థిరంగా ఉండదు ఎప్పుడూ గంతులేస్తూ పరిగెత్తుతూ ఉంటుంది. వీడి మనసు కూడా అంత చాంచల్యమైనది.

Player
>>