కీచకుని ఆగమనం3

           చిత్తచాంచల్యుడు కాబట్టి ‘మృగ మత్తఱి నుదిలగొనుచుఁ గాముఁడను బల్లిదపు వేఁటకాని’ - ఎవడయ్యా! ఈ ఉరి తగిలించింది అంటే కాముడు. మన్మథుడు కాచుకుని ఉన్నాడు. అనంగుడు - శరీరం లేని వాడు, మన్మథుడు. ‘బారిఁ బడుటకెంతయు నా సింహబలుడు తలరి’. ‘నిజార్గతంబున’ - కీచకుడు తన మనసులో అనుకుంటున్నాడు. ఏమని?

            ‘ఎందును నిట్టి రూపు నరులెవ్వరుఁ గాంచిరె?’ - ‘నా విషయం వదిలేయండి.  ఇంకెవరైనా చూసుంటారా’ అని అనుమానం. ‘నాక కాదు సంక్రందనసూతికిం దగిలి కన్గొనఁ జాలదె! దీన నిందిరా నందను నాజ్ఞ యేచి భువనంబులఁ బ్రబ్బదె!’ – ఇందిరానందనుడు అంటే మన్మథుడే. ‘ఇత్తలోదరిం జెందఁగఁ గాన్పు గాదె ఫలసిద్ధి పురాతన పుణ్యబుద్ధికిన్’- జన్మ ఎత్తినందుకు ఫలము కాన్పు అవుతుంది. అప్పుడే పుట్టడం.  ‘ఫలసిద్ధికి కాన్పు’- జన్మ ఎత్తినదానికి ఇది కదా ఫలము అన్నది ‘కాన్పు’ - ప్రత్యక్షం అవుతుందట! కాన్పు అనే పదం ఎంత చక్కగా వాడాడో తిక్కన. ఇదే వికారం అరణ్యపర్వంలో కూడా కనిపిస్తుంది. ఎక్కడ? ద్రౌపది విషయంలోనే! 

            నన్నయ తిక్కనలను అధ్యయనం చేసి ఆరాధించినవాడు కాబట్టి, ప్రబంధపరమేశ్వరుడు ఎఱ్ఱన ఆ ధోరణిని అనుసంధానించుకుని సైంధవుడు ద్రౌపదిని చూసినప్పుడు ‘ఈ కమలాక్షి నాకు హృదయేశ్వరి యైనఁ ద్రిలోక రాజ్యముం జేకుఱ నేలినట్లు విలసిల్లనె’ - ‘ఈ కమలాక్షి నాకు హృదయేశ్వరి అయితే ముల్లోకాలను ఏలినంత ఫలం కదా!’ అనుకున్నాడు. ఇప్పుడు కీచకుడు ఏమంటున్నాడు? ‘కాన్పు గాదె ఫలసిద్ధి పురాతన పుణ్యబుద్ధికిన్’. ‘ఇయ్యింతి ప్రాపున.’ అతనిలో కలిగే భావాల తాకిడికి ఊహలోకంలోకి వెళ్ళిపోయాడు. ఎన్ని తలపులు వస్తున్నాయో!

కవిబ్రహ్మ కవితా వైశిష్ట్యం...

         ఇక్కడ తిక్కనగారు చేసిన అత్యద్భుతమైన విశేషం - ఉచితమైన స్థలాలలో, ఉచితమైన ఛందస్సును, ఉచితమైన పదబంధవిశిష్టంగా ప్రయోగించడం, రసాభ్యుచితబంధంగా మలచడం. ఈ చిన్న కథలో ఆయన విరివిగా వాడుకున్నవి సీస పద్యాలు. చెప్పదల్చుకున్నది సూటిగా చెప్పాల్సినప్పుడు కంద పద్యాలు వాడతారు. మన ఛందస్సులలో కంద పద్యం చాలా అల్పకుక్షి. అల్పకుక్షి అంటే చాల తక్కువ స్థలం పడుతుంది. చిన్నది. దానిలో పెద్ద భావం చెప్పాలంటే ఎలా కుదురుతుంది? చెప్పదల్చుకున్న భావం పూర్తిగా చెప్పాలన్నా, ఏ విషయాన్నైనా బ్రహ్మాండంగా చెప్పాలన్నా కష్టం. సీస పద్యం చాలా పెద్దది. తెలుగు భాషలో ఉన్న ఛందస్సులలో సీసపద్యం చాలా పెద్దదనుకోవచ్చు. స్రగ్ధర, మహాస్రగ్ధరలు తెలుగులో అంత ప్రాచుర్యంలో లేవు. ఉన్నా కూడా వాటికన్నా పెద్దది, ఎందుకంటే సీసానికి పైన ఒక ఎత్తుగీతి కూడా ఉంటుంది. పెద్దవి అయిన నాలుగు పాదాలు తరువాత, మళ్ళీ దాని కింద తేటగీతో, ఆటవెలదో ఏదో ఒకటి ఉండాలి. అయితే సీస పద్యంలో ఉన్న చమత్కార మేమిటంటే, ఒక వస్తువును వర్ణించవలసినప్పుడు సీసపద్యం ఒదిగినంతగా వేరే ఛందస్సు ఒదిగి పోదు. పదాలను, గణాలను, ఛందస్సును, భాషను ప్రయోగించడానికి ఉన్న సౌలభ్యం వల్ల కాని, సౌకర్యం వల్ల కాని అనుకూలమైన ఛందస్సు సీసపద్యమే. మళ్ళీ దానిలో శయ్య. అదీ ఎన్నో విధాలుగా ఉంటుంది, శబ్దాలంకారాలతో, అర్థాలంకారాలతో, చిత్రవిచిత్ర గమనాని కనుకూలమైన పద విక్షేపంతో. ఉదాహరణకు, ‘మా పాలి దేవుడా మమ్ము కాపాడవే’ అంటే సీస పద్యపాదమైపోతుంది. మన సినిమా పాటలలో కూడా ‘ఆరేసుకో బోయి పారేసుకున్నాను. కోకెత్తుకెళ్ళింది కొండ గాలి’ అనేది కూడా సలక్షణమైన సీస పద్య పాదం. ఆ సీసపద్యంలో విచిత్రమైన గమనాలు చూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు.

అవధాన విశేషం....      

          ఒకసారి తిరుపతి వేంకటకవులు వినుకొండలో అష్టావధానం చేస్తున్నారు. కవికి, అవధాని ప్రతిభకు గీటురాయి శతావధానం కాదు, అష్టావధానమే! శతావధానంలో ధారణం ఉంటే దాటుకుని వెళ్ళవచ్చు. అష్టావధానంలో అవధాని మనఃస్థిరత్వానికి, ఏకాగ్రతకు భంగం కలిగించే విధంగా ఎనిమిది విభిన్నమైన అంశాలు ఆడుగడుగునా అడ్డుపడుతూ, చికాకుపరుస్తూ ఉంటాయి. కాబట్టి అష్టావధానం కష్టతరమైనది. వినుకొండలో జరుగుతున్న అష్టావధానంలో తిరుపతి వేంకటకవులను వర్ణన అనే ఒక అంశంలో భాగంగా ఒకాయన అడిగాడు, ‘అయ్యా, దశావతారాలను గురించి వర్ణించండి’. పది అవతారాలు. అలాగే దానికేం? వీళ్ళు ఏ ఉత్పలమాలో, చంపకమాలో లేకపోతే సీసపద్యంలో చెప్పుకోవచ్చు కదా అని మొదలు పెట్టాలనుకున్నారు. ఎందుకు? నాలుగు నాలుగు ఎనిమిది పాదాలు కదా! ‘అయ్యా! అయితే ఒక చిన్న విన్నపం. కంద పద్యంలో చెప్పాలి’ అన్నారు. దశావతారాలు ఒకొటొకటి చెప్పుకుంటూ లెక్కపెట్టుకుంటేనే కందానికి ఎన్ని అక్షరాలు కావాలో ఆ అక్షరాలను దాటిపోతుంది.

           తిరుపతి శాస్త్రిగారు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారి వైపు చూశారు. ఇద్దరూ జంట కవులు. జంట కవులంటే ఏమిటి? ఒకరు ఒక పాదం చెప్తే దానిలో ఈయన ఏం భావం చెప్పాడో గుర్తు పెట్టుకుని రెండవ ఆయన రెండవ పాదాన్ని మొదటి దానితో అనుసంధానం చేసుకుని మరీ చెప్పాలి. మళ్ళీ మొదటివాళ్ళు మూడవపాదం చెప్పాలి. మళ్ళీ రెండవవారు నాలుగోపాదం చెప్పాలి. పద్యం ఒకరు రాసినట్లే ఉంటుంది. ఇద్దరూ గుర్తుపెట్టుకోవాలి.  తిరుపతి శాస్త్రిగారు చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారి వైపు చూశారు.

               ఆ సభకు అగ్రాసనాధిపతిగా ఉన్నవారు పరబ్రహ్మశాస్త్రి గారు. ఆయన, ఆకారంలోనూ గురుమూర్తే. భమిడిపాటి కామేశ్వరరావు గారు తన సహోద్యోగినో మరొకరినో ‘ఈయన గురుపాదులు’ అనేవారు. ‘అదెలాగండీ ఆయన మీ కన్నా వయసులో చిన్నగా కనబడుతున్నారు’ అంటే, ఆయన సమాధానం, ‘అదేం విశేషం కాదు. ఆయన పాదాలు చూడండి. ఎంత పెద్దవో! అందుకే గురుపాదులు, పెద్ద పాదాలు కలవాడు’.

Player
>>