కీచకుని ఆగమనం4

             సరే. వెంకటశాస్త్రి గారు ‘జలచర ఢులి కిరి’ మొదలుపెట్టారు. ‘జలచర ఢులి కిరి నరహరి’ ఒక పాదం అయిపోయింది. పృచ్ఛకుడు ఆపాడు. ‘ఏమండోయ్ నా కోరిక ఇంకా మీరు పూర్తిగా వినలే’ దన్నాడు. ‘అయ్యా! దశావతారాలు కందపద్యంలో చెప్తున్నాము కదా, జలచర ఢులి కిరి నరహరి అర్థం చెప్తాము’ అంటే, ‘అయ్యా! ఆగండి. ఆ పద్యంలో మా అధ్యక్షుడు పరబ్రహ్మ శాస్త్రిగారి పేరు కూడా ఉండాలండి’ చెప్పాడు పృచ్ఛకుడు. మళ్ళీ ఇదేం మెలిక అనుకుంటూ ‘ఏం పర్వాలేదులే చెప్పుకుందాం’ అనుకున్నారు.

                  జలచర ఢులి కిరి నరహరి
                  కలిత వటు త్రివిధ రామ..

            మూడు రామావతారాల గురించి ‘త్రివిధ రామ’ అని వచ్చింది. అరే వీళ్ళు దాటేసుకుంటున్నారే అనిపించింది పృచ్ఛకుడికి. జలచరం - మీనావతారం, ఢులి - తాబేలు కూర్మావతారం, కిరి - వరాహావతారం. నరహరి - నృసింహావతారం, నాలుగు అవతారాలను మొదటి పాదంలో పెట్టేశారు. మూడు గణాలలో. రెండవ పాదంలోకి వచ్చేటప్పటికి కలిత వటు, ఆయన ఎవరు? వామనావతారం. త్రివిధ రామః - రామో రామశ్చ రామశ్చ - పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు. మూడు రామావతారాలను ‘త్రివిధరామ’లో ఇరికించారు. ‘అయ్యా! మాట’ అన్నాడు పృచ్ఛకుడు, మళ్ళీ చెయ్యెత్తి. మరి పరబ్రహ్మ శాస్త్రిగారిని పెట్టాలి కదా! ఆయనసలే భారీకాయుడు కొంచెం అటు ఇటైతే ఇబ్బంది కలుగుతుందేమో, ఛందస్సు అల్ప కుక్షి కందం కదా!

            పరబ్రహ్మశాస్త్రిగారు నమస్కారం పెట్టి ‘మీరు ఏ విధంగా వెనకా ముందు చేసినా మీ కందంలో నాకు కొంచెం చోటిస్తే,  ఇరికిస్తే చాలండీ’ అన్నాడు. ‘సరే వస్తారు లెండి, ఇంతవరకు వచ్చాక’ అంటూ ఉండగా, ‘కాదండీ అది మాత్రమే కాదు, దాన్లో మీ ఇద్దరి పేర్లు కూడా ఉండాలి’. సరే మళ్ళీ కానిద్దామని జలచర ఢులి కిరి నరహరి, కలిత వటు త్రివిధ రామ కల్కి, బుద్ధుడు - కల్క్యవతారం, బుద్ధుడు. అయిపోయాయి పదవతారాలు! రెండు పాదాలు మిగిలాయి వాళ్ళ దగ్గర.

క.         జలచర ఢులి కిరి నరహరి
            కలిత వటు త్రివిధ రామ కల్కులు బుద్ధుం
            డిల తిరుపతి వేంకటశా
            స్త్రులను పరబ్రహ్మశాస్త్రిఁ జూతురు పేర్మిన్.
                                      (తిరుపతి వెంట కవులు - వినుకొండ అవధానము)

            బ్రహ్మాండం! ఆ సామర్ధ్యం ఉంటే ఏదైనా చెప్పొచ్చు కాని అన్ని విషయాలు అలా సమకూరవు. వాళ్ళు సరస్వతీ వరపుత్రులు. మరి సీస పద్యం విషయం, దానిలో ఓ ఇబ్బంది ఉంది. చెప్పదల్చుకున్న భావం రెండు పాదాల్లో అయిపోతే మిగతా పాదాల్ని నింపుకోవడం ఎలా? నరసరావు పేట శతావధానంలో వీళ్ళనే అడిగారు. ‘ఏమండీ మాకు చిల్లపెంకు మీద పద్యం కావాలి’ అని. ‘ఏదైనా సూర్యుడి అస్తమయమో, దేవీ వర్ణనమో చెప్తే బాగుంటుంది కాని చిల్లపెంకేంటి? సరే! చిల్ల పెంకు మీద ఏ వృత్తంలో కావాలి?’ ‘సీస పద్యం కావాలి’. చెప్పేది చిల్లపెంకు మీద, సీసపద్యంలో కావాలి. మరి ఎలా చెప్పారు?

సీ.         ఎద్ది తానీటిలో ఎగుర వైచిన యంత కప్ప గంతులు వైచు గుప్పుచుండు
            ఎద్ది తావీధిలో ఏగుచో కాలిలోపల గుచ్చుకొని బాధపడగ చేయు
            ఎద్దాని తొక్కుచో ఎగిరి తిట్టుచు ముసలమ్మలు మడినీళ్ళ గుమ్మరింతు
            రెద్దాని బాలురెంతే త్రొక్కు డుం బిళ్ళ యాటలో ఉపయోగమనుచు గొండ్రు
తే.         అట్టి చిల్లపెంకు దరిని పుట్టి బీర
            పాదు చేదు బీరను పేర పరగుచుండు
            దాని వర్ణించుచును కవితను రచించు
            వారి కవనంబు చేదుగా వరలునేమొ        (తిరుపతి వెంకట కవులు)

            ‘ఎద్ది తానీటిలో ఎగుర వైచిన యంత కప్ప గంతులు వైచు గుప్పుచుండు’ - ఆ చిల్లపెంకును నీళ్లలో వేస్తే కప్ప గెంతులు వేస్తుంది. ‘ఎద్ది తావీధిలో ఏగుచో కాలిలోపల గుచ్చుకొని బాధపడగ చేయు’- వీధిలో వెళ్తుంటే కాలిలో గ్రుచ్చుకుని నొప్పి కలిగిస్తుంది, ‘ఎద్దాని తొక్కుచో ఎగిరి తిట్టుచు ముసలమ్మలు మడినీళ్ళ గ్రుమ్మరింతురు’- దాన్ని త్రొక్కితే ముసలమ్మల మడి పాడయిపోతుంది. అది 1890, 1910 -ఆ ప్రాంతంలో కదా! ‘ఎద్దానిని బాలురు ఎంతే త్రొక్కుడుబిళ్ళ యాటలో ఉపయోగ మనుచు కొండ్రు’ -తొక్కుడుబిళ్ళగా పనికి వస్తుంది కదా. నాలుగు పాదాలు! మరి ఈ ప్రతిభ ఎక్కడిది?

            ‘అట్టి చిల్లపెంకు దరిని పుట్టి బీర పాదు చేదు బీర యను పేర పరగుచుండు’ - అటువంటి చిల్లపెంకు దగ్గర్లో ఉంటే, ఆ పెంకులు పడిన చోట బీర పాదు వేస్తే, చేదు అవుతుందట! ‘దాని వర్ణించుచును కవితను రచించు వారి కవనంబు చేదుగా వరలునేమొ’ అని వాళ్ళే అన్నారు. ఇది వర్ణనా విషయం.  

            సామర్ధ్యం ఉన్న కవికి అసాధ్యమైనది లేదు. ‘అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతిః’ అన్నాడు ధ్వని సిద్ధాంతంలో ఆనంద వర్ధనుడు. కావ్యం అనే సంసారం అపారమైనది. కావ్య రసాస్వాదనంలో సృష్టికర్త కవే. ‘యథాస్మై రోచతే విశ్వం తథైవ పరివర్తతే’ అతను ఎలా అనుకుంటే అలా తన కవిత్వంలో దాన్ని ప్రతిబింబింపజేయగలిగిన సామర్ధ్యం ఉంటుంది. ‘శృంగారీ చేత్కవిః’ - కవిలో ఆ రసికత అనేది ఉంటే, శృంగారం అంటే సరసత ఉండాలి. ఆ సరసత ఉంటే ‘జాతం రసమయం జగత్’ - జగత్తు రసమయం అవుతుంది. ‘స ఏవ వీతరాగశ్చేత్’ - ఒక్కసారి అతనిలో ఆ అనురాగం, రసహృదయం నశించిపోయిందంటే ‘నీరసమ్ జాత మేవ తత్’ - రసం నీరసం అవుతుంది.          

Player
>>