కీచకుని ఆగమనం5

                 తిక్కనగారి శైలి కూడా అటువంటిదే. ప్రతి పదములో, ప్రతి వాక్యంలో, ప్రతి పద్యంలో కూడా స్వీకరించిన సన్నివేశానికి సంబంధించిన రససాక్షాత్కారాన్ని చేస్తూనే ఉన్నారు. ‘ఇయ్యింతి ప్రాపున నయ్యనంగుఁడు’ - ఈమె తోడు ఉంటే ఆ మన్మథుడు, ‘పార్వతీశు నైనను దక్కనేలకున్నె’ - మన్మథుడికి అన్ని అవస్థలు ఎందుకు? వసంతుడిమీద, మాధవుడి మీద ఆధారపడవలసిన పని లేదు. ఒక పక్కన రతిదేవి, మరొక ప్రక్కన ఈమె ఉంటే చాలు. ‘యిన్నాతి చెలువంబు గన్న శచీప్రియుం డైనను గనుకలి నవియకున్నె’ - ఇంద్రుడికి కూడా చూడగానే మోహం కలుగకుండా ఉంటుందా? ‘యిత్తన్వి కెనలేమి కెదిరి పన్నిదము భాషావిభునితో నైనఁ జఱవరాదె’ - ఈమె ఉంటే బ్రహ్మదేవుడు, ఆయనకు ముఖంలో సరస్వతి ఉంటుంది, ఆయన వచ్చినా కూడా ఎంత మాత్రం లక్ష్యపెట్టవలసిన పనిలేదు. ‘యిత్తలోదరి జీవితేశున కిందిరాపతి నైన మెచ్చక పలుకఁజనదె’ - ఈమె భర్త విష్ణువునైనా ధిక్కరించి పలుకవచ్చు కదా! ‘కుసుమబాణుని బాణముల్ గూడ’ - ఈమెను తయారుచేయడానికి మూల వస్తువు ఏది? ‘నైదు కరఁగి నేరిమి వాటించి’ మన్మథుని పంచ బాణాలు తీసుకున్నాడు. ఏవి? అశోకము, చూతము, అరవిందము, నీలోత్పలము, నవమల్లిక. అన్నీ పుష్పాలే, కోమలమైనవి, సుగంధం వెదజల్లేవి. అవి మన్మథునికి పంచ బాణాలు. ఆ మన్మథుని ఐదు బాణాలు తీసుకుని, కరిగించి, ‘నేరిమి పాటించి’ మళ్ళీ దాని మీద మరింత కళాసాధన. ఇదీ విదగ్ధత. దుర్విదగ్ధత కాదు. ‘నేరిమి పాటించి కరువు గట్టి’ - దాని సారమంతా తీసుకుని, ‘పోసి చేసి చైతన్యసంపుటము దగ ఘటించెన్’ - చైతన్య స్వరూపంగా తీర్చిదిద్దాడు.

            ద్రౌపది శరీరసౌందర్య లావణ్యమునుగురించి కవిబ్రహ్మ తిక్కన సోమయాజి గారు చేసిన ఈ అపూర్వ అద్భుతవర్ణనము ఆంధ్ర కవితా పితామహుడైన అల్లసాని పెద్దన గారికి ఒరవడి అయింది. ఎక్కడ?

            కాముకుడైన కీచకుడు అతిలోక సుందరి ద్రౌపది తనూరేఖాసౌందర్యవైభవాన్ని ఈ విధంగా ఊహిస్తే, అక్కడ మనుచరిత్రలో వరూధిని ‘యక్ష తనయేందు జయంత వసంత కంతులం జక్కదనంబునన్ గెలువజాలెడు మేని సొగసు’ కల ప్రవరాఖ్యుణ్ణి చూసి వర్ణిస్తూ అతని శరీరంలో ప్రస్ఫుటమవుతున్న ఆ కాంతి, శోభ ఎలా వచ్చిందంటే, ‘నేరెటేటి యసల్ తెచ్చి’ ఆకాశగంగ దగ్గర ఉన్న అతి సుకుమారమైన మెత్తని అడుసును తీసుకుని వచ్చి, ‘నేరెటేటి యసల్ తెచ్చి నీరజాప్తు సానబట్టిన’ - నీరజాప్తుడు చంద్రుడిని సానబట్టిన పుప్పొడి చల్లి, ‘మెదిపి పదను సుధ నిడి చేసెనో పద్మ భవుడు’ అమృతం కలిపి బ్రహ్మ దేవుడు చేశాడు. ‘వీని కాకున్న కలదె యీ మేనికాంతి?’ ఆ శరీరంలో ఆ మెరుపు రావాలంటే మరేవిధంగా అవుతుంది? పెద్దనగారి ఈ పద్యానికి వరవడి కవిబ్రహ్మ తిక్కన గారి పద్యమే. అసలు పెద్దన గారికే ఎందుకు? తర్వాతి కాలంలో విచ్చలవిడిగా చెలరేగిన శృంగార ప్రబంధాల లో పెచ్చుమీరిన వర్ణనా వైశద్యం విశేషాలకన్నిటికీ మార్గ దర్శకమైనది తిక్కనగారి కీచకుని సీసపద్యాలే అనటం సత్య దూరం కాదు.

కీచకుని ఉన్మాదావస్థ...

            ‘ఈ నెలఁతఁగన్న మన్మథుఁ డైనన్’ - సాక్షాత్తుగా మన్మథుడే వచ్చినా, ‘చిగురు గొడుగుఁ పువ్వుటమ్ముల పొదులున్’ ఆయన దగ్గర ఏముంటాయి, ఒక చిగురు గొడుగు, చెరకు విల్లు, పూబాణాలు ఇవే ఉంటాయి. వాటితో ‘లోనుగ సెజ్జలు సేయన్’ - వాటితో వెంటనే పాన్పు తయారు చేస్తాడట. ‘తా నియమింపండె విరహతాపము పేర్మిన్’ ఎన్ని ఆలోచనలో! అందరినీ తలచు కుంటున్నాడు. బ్రహ్మదేవుణ్ణి, ఈశ్వరుణ్ణి, విష్ణువుని, అందర్నీ తన మోహావేశంలో భాగస్వాములను చేస్తున్నాడు.

              ‘దీని జన్మంబునఁ దేజంబు నొందిన యింతియుఁ బతియును నెవ్వరొక్కొ’ - ఈమెను కన్న ఆ దంపతులెవరో? ‘దీని నామాకృతిగా నోచి పడసిన యింపగు వర్ణంబు లెవ్వి యొక్కొ’ - ఈమె పేరుగా మారిన ఆ అక్షరాలేవో? ఇది తొలి చూపు వల్ల కలిగిన ప్రేమ కాదు. ఒక విధమైన వికారం. ‘దీని వల్లభుఁడనఁగా నిల సొబగు సొంపెసఁగ వర్తిల్లు వాఁ డెవ్వఁ డొక్కొ’ - ఈమె భర్తగా ఈ భూమిపై వెలుగొందే భాగ్యవంతుడెవడో? ‘దీని వసించుటఁ దా నొప్పి పెంపున నేపారు మందిరం బెద్ది యొక్కొ’ - ఈమె నివసించే ప్రదేశం ఏదో? ‘దీనిఁ బొందఁ గాంచు తెఱఁగు నా కెయ్యది యొక్కొ’.

                 ఇప్పుడు విషయానికి వచ్చాడు. ఈమెను పొందే మార్గమేదో? ‘యిట్టి పనికి నూఱడిల్లి తోడుకొనఁగ నిచట నీడగు చుట్టంబుఁ దడవి యెట్టు లొక్కొ పడయువాఁడ’ - ఈ కార్యం నడపడానికి ఇక్కడ నాకు సహాయపడే వారెవరో? సైంధవుడి విషయంలో కూడా ఇదే పరిస్థితి. అయితే అతని ప్రక్కన అతని చెలికాడున్నాడు. సైంధవుడి మోహావేశం కూడా ఇటువంటిదే! ‘భవదీయ జనకత్వమున సముజ్జ్వలితుడైన పుణ్యుడు ఏ వంశమున వాడు? నీదు జీవితేశ్వరుడగు సుఖజీవితాత్ము డెవ్వ డబల? నీ నామమై యింపు మిగులు శబ్ద మెయ్యది?’ ఇన్ని ఆలోచించేటప్పటికి శృంగారవికారదశావస్థాచేష్టలన్నీ బయట పడ్డాయి.

                 అవే సాత్త్వికభావాలు అన్నారు. సాత్త్వికము అంటే వేదాంతార్థంలో ఉండే సత్త్వరజ స్తమో గుణాలలోని సాత్త్వికం కాదు. సత్త్వము అంటే తనయొక్క స్వభావం. స్వాభావికంగా వ్యక్తిలో కలిగే భావోద్రేకాలను బహిర్గతం చేసే అవస్థలను సాత్త్విక భావాలు అన్నారు. అతిసహజంగా ఎవరికైనా కలిగే భావాలివి. నవ్వు వస్తే నవ్వుతాము. కుతూహలం   కలిగితే ఉత్సాహంగా చూస్తాము. కోపం వస్తే కళ్ళు ఎర్రగా చేస్తాము. ఇవన్నీ అందరికీ కలిగే భావాలు. ఈ సాత్త్విక భావాలను ఎనిమిది ప్రధానభావాలుగా విభజించి, విశ్లేషించి చెప్పారు. ‘స్తంభః స్వేదః రోమాంచః స్వరభంగః వేపథుః వైవర్ణ్యం అశ్రుః ప్రళయమ్ ఇతి అష్టౌ సాత్త్వికా స్మృతాః’ - స్తంభః - నిశ్చేష్టత, స్వేదః - చెమట పట్టటం, రోమాంచః - గగుర్పాటు, స్వర భంగః - గొంతు గద్గదం కావడం, వేపథుః - శరీరంలో వణుకు పుట్టటం, వైవర్ణ్యం - వివర్ణత పొందడం అంటే కళ తప్పిపోవటం, అశ్రుః - కళ్ళలో నీళ్ళురావటం, ప్రళయమ్ - అంటే సముద్రాలు పొంగిపోవటమని కాదు, ఆ భావతీవ్రతను అతని వ్యక్తిత్వం పోయి సంపూర్ణంగా వివశత్వం చెందటం. ఇవీ ఎనిమిది సాత్త్విక భావాలు అని భరతముని నాట్యశాస్త్రంలో చెప్పాడు.

                 ఈ సాత్త్విక భావాలు ఏ భావోద్వేగానికైనా ఉంటాయి.  స్తంభం - కోపం వల్ల, ఆశ్చర్యంవల్ల, అద్భుతంవల్ల, బీభత్సంవల్ల ఇలా ఏ రసస్థితిలోనైనా కలుగవచ్చు. మనిషి భావప్రకటన ఈ భావాలను దాటిపోలేదు. వీటిలో మళ్ళీ ముప్పైమూడు సంచారి భావాలు ఉన్నాయి. ఈ భావాలు మనకు అనుభవైకవేద్యమే అయినా మనం ప్రత్యేకంగా వీటిని గమనించకపోయి ఉండవచ్చు. ఆ ముప్పై మూడు భావాలను ఒక చిన్న పద్యంలో చెప్తారు.

Player
>>