కీచకుని ఆగమనం6

శా.        నిర్వేదశ్రమ దైన్యజాడ్యములు గ్లానిత్రాస శంకార్తి రు
            డ్గర్వావేగ ధృతిస్మృతుల్ చపలతో గ్రత్వావహిత్థాత్రపాం
            తర్వైక్లబ్య మదోత్సుకత్వ మతినిద్రామోహ బోధాంతము
            త్సర్వాలస్యవితర్కసుప్త్యసహతాధ్యానభ్రమాపస్మృతుల్’                                                                                       (భట్టుమూర్తి-కావ్యాలంకారసంగ్రహం)

            విద్యానాథుడు వ్రాసిన ప్రతాపరుద్రయశోభూషణాన్ని ఆధారంగా తీసుకుని రామరాజ భూషణుడు స్వతంత్రగ్రంథంగా కావ్యాలంకారసంగ్రహం వ్రాశాడు. అద్భుతమైన రీతిలో ప్రవర్తిల్లిన మన అలంకారసాహిత్యచరిత్రలో మౌలికమైన సిద్ధాంతాలను ప్రవేశపెట్టిన ఆలంకారికులు కొందరున్నారు. భరతమహర్షి ఆ విశ్లేషణకు  ప్రాతిపదికగా వేస్తే, దాని మీద విచారం చేసి ధ్వనియే కావ్యానికి చాలా ముఖ్యమన్నాడు ఆనందవర్ధనుడు. కాదు ఔచిత్యమన్నాడు క్షేమేంద్రుడు. ఇలా ఓ పదమూడు పద్నాలుగుమంది ప్రధానమైన ఆలంకారికులు వ్రాసిన గ్రంథాలు వాదగ్రంధాలయినాయి. అంటే మూలసిద్ధాంతం వారిది. తరువాత వచ్చిన అలంకారశాస్త్ర గ్రంధాలన్నీ కూడా వాటికి వివరణగా లేక విశ్లేషణగానే ఉన్నాయి. కాని ఆ పై రెండువేలసంవత్సరాల చరిత్రలో కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారెవ్వరూ లేరు. మమ్మటుడు వ్రాసిన ‘కావ్యప్రకాశం’ అనే గ్రంథానికి డెబ్భైరెండు వ్యాఖ్యానాలు ఉన్నాయి. అంటే ఎంతగా విస్తరించిందో తెలుస్తున్నది. అంతగా విస్తరించిన శాస్త్రంలో సూక్ష్మాతిసూక్షమైన మానసికఉద్వేగభావాల్ని కూడా వదలిపెట్టక అన్నీ జీర్ణింపచేసుకున్నాడు కాబట్టే మహాకవి, కవి బ్రహ్మ అయ్యాడు తిక్కన.

            ఆ ‘స్తంభము’ మొదలైన భావాలు కలిగినప్పుడు కీచకుడు, ‘అని యని యుగ్గడించు ధృతి యల్లలనాడిన ‘ - ధైర్యం పోయింది, ‘తల్లడించు’ - ‘వేపథుః’, ‘పైకొను తలపోఁత నించు, మది గోర్కులు పేర్చిన నప్పళించు’ - చేయడానికేమీ లేదు. కాని కోరిక కలుగుతున్నది. అక్కడ తీర్చుకోవడానికి అనువు లేదు దానితో ‘ఫ్రస్ట్రేషన్’ - ఒక విధమైన నిస్సహాయతకు లోనయి, ‘నెట్టన తెగ నగ్గలించు నచటన్ జనులం బరికించు’ - ఏం చేయాలా అని ఆలోచిస్తూ అక్కడ ఉన్న జనాలను చూస్తున్నాడు. ‘బుద్ధి దూలిన వెస నెంతయుం గళవళించు మనోజ వికార మగ్నుఁడై’. ‘మాసిన చందముఁ దనుఁ గని ‘మన్మథబాధను అనుభవిస్తూ కలవరపడుతున్నాడు. వాడి ముఖంలో గాంభీర్యం అనే రాజకళ తగ్గిపోయి, ‘భుజంగత్వం’ లోనికి వెళ్ళిపోయాడు.

భుజంగత్వం-ఒక చమత్కారం...

            ఒకసారి బాణభట్టు భోజరాజు ఆస్థానానికి వెళుతున్నాడు. ఆయన కాదంబరి అనే గద్య కావ్యాన్ని రచించాడు. ‘గద్యం కవీనాం నికషం వదంతి’ - గద్యం కవుల ప్రతిభకు గీటురాయి అని అర్థం. ఆ గద్యకావ్యాలలో ప్రప్రథమమైన స్థానంలో నిలిచేది కాదంబరి. అటువంటి కావ్యాన్ని రచించిన బాణభట్టు విశృంఖలమైన ప్రవర్తన కలవాడని ప్రతీతి. అతను ఒకసారి రాజాస్థానానికి వెళితే అక్కడ ఉన్న కవిపండితులు ‘అదిగో బాణుడు వచ్చాడు’ అనుకుంటూ రాజువైపు చూసి ‘అదిగో భుజంగుడు వచ్చా’డని చెప్పారుట. భుజంగం అంటే పాము, భుజంగుడు అంటే ఒక విధమైన కాముక ప్రవర్తన కలవాడు, కాముకుడు అని అర్థం. అంటే ఎప్పుడూ దారిలో తుమ్మల్లో దూరుతూ ఉండేవాడు – వేశ్యా లంపటుడు అనేది సరియైనమాట. అది విని ఒకటే సమాధానమిచ్చాడు బాణుడు. ‘కా మే భుజంగతా’ కా - ఎక్కడ, ‘మే’ - నాయందు, ‘భుజంగతా’ - విట లక్షణం. ‘ఆ విట లక్షణం నాలో ఎక్కడ ఉన్నది? నేను పండితుడిని, కవిని కదా! నన్ను పట్టుకుని విటునితో పోలుస్తారే!’. అంతవరకు చెప్తే బాణుడు ఎందుకవుతాడు? ‘నేను కవీశ్వరుడిని, నేను కాముకుడిని కాదు. భుజంగత్వమని విట లక్షణం మీరేదైతే చెప్తున్నారో అది ఎక్కడుంటుందంటే ‘కామే’ - కాముకుడిలో, ‘భుజంగతా’ - ఆ భుజంగత్వం ఉంటుంది కాని నాలో కాదు, ‘కామే భుజంగతా’ అని, మళ్ళీ వెనుతిరిగి చూసుకుని చెప్పాడు, ‘కా మే భుజం గతా’ ఎవ్వరూ లేరు ఒక్కడనే వచ్చాను కదా! ‘కా’ - ఆ స్త్రీ, ‘మే’ - నా యొక్క, ‘భుజం’ - భుజాన్ని. ‘గతా’ - అనుసరించి వచ్చినది. ‘నా వెనుక వచ్చిన ఆ స్త్రీ ఎవరు? సరస్వతీదేవి మాత్రమే నాతోపాటుగ ఉండేది’. అదీ బాణుడి విశేషం.

            కాముకుడు, ఈ కీచకుడిలో కూడా ఈ వికారాలన్నీ బయటపడి ఏం చేస్తున్నాడు? ‘బిట్టేసిన మదనునిచే ధృతి వాసిన బెగడొందు సింహబలుఁడట్టి యెడన్’ - తనను దెబ్బతీసిన మదనునివల్ల ధైర్యాన్ని కోల్పోయినవాడై కీచకుడు, ‘మాసిన చందముఁ దనుఁగని రోసిన డెందంబు గల తరుణి నెఱుఁగడ’ - కాముకుడు తన పరిసరాల్ని గుర్తించలేడు. సిగ్గు ఎగ్గు వదలివేస్తాడు. అక్కడ ఉన్నవాళ్ళు గమనిస్తున్నారా లేదా అనే విషయం ఆ వ్యక్తికి తోచదు. తన ప్రవర్తనపై ఏవగింపు కలిగిన ద్రౌపది మనసు గ్రహించే వివేకం కీచకుడికి లేకపోయింది. ఎవరైనా మనలను తీక్షణంగా చూస్తూ ఉంటే ఎవరో చూస్తున్నారని తెలుస్తుంది కదా! ద్రౌపది కూడా ఒక్కసారి కీచకుడు తనవైపు అలా చూసేటప్పటికి కలవరపడింది.

               ‘వెఱవక ననుఁజూచె వీఁడని యెదఁ గలుషించిన నొండొండ చెమట వొడమ ‘ - వెరపు లేక తనను చూస్తున్నాడని భయంతో చెమట పట్టగా, ఇంతకాలం ఆమె ఏ మాత్రమూ సంకోచం లేకుండా, అంతఃపురంలో స్వేచ్ఛగా తిరుగుతోంది. భయమనేది లేదు. శీలసంరక్షణకు ఆటుపోటు లేకుండా చాలా నిర్భయంగా గడుపుకుంటున్నది. ఒక్కసారి వీడి చూపులు పడేటప్పటికి, ఆ చూపుల వెనక ఉన్న భావం ఆమెకు ములుకుల్లాగ గుచ్చుకుని మెలకువ కలిగిస్తే చూచింది. ‘వెఱవక’ ఇద్దరిలో కలిగిన భావాలను కలిపి, తిక్కనగారు చేసిన అత్యద్భుతమైన సృష్టి ఈ పద్యం.  కావ్యదృష్ట్యా భాషకు రెండు ప్రధానమైన ప్రాణాలు. ఒకటి బహిఃప్రాణం, రెండవది అంతఃప్రాణం. బహిఃప్రాణమంటే బయటకు కనపడే ప్రాణం - వ్యాకరణం. ఈ శబ్దానికి ఈ అర్థము అన్నట్లుగా బయట కనపడుతూ ఉంటుంది. కాని ఈ శబ్దం వెనుక ఉన్న అర్థం ఏదో అది అంతఃప్రాణం. సాహిత్యం చదువుకున్నవాడికే ‘కా మే భుజంగతా’ లో ఉండే సొగసు అర్థం అవుతుంది.

            శబ్దం ఒక అర్థాన్ని సూచిస్తున్నా, అసలు దానిలోనుండి ధ్వనించే అర్థం ఇంకొకటి. దాన్నే ధ్వనిసిద్ధాంతంగా ఆనందవర్ధనులవారు ధ్వన్యాలోకంలో చెప్తే, ‘అందరికి ధ్వని వినపడుతుంది కాని కనపడదు కదా!’ అని ధ్వన్యాలోకానికి వ్యాఖ్యానం వ్రాశారు మహానుభావుడైన అభినవగుప్తాచార్యులవారు. ఆయన ఆ వ్యాఖ్యానానికి పెట్టిన పేరు లోచనము. కనపడని ధ్వనిసిద్ధాంతాన్ని ప్రత్యక్షం చేయటంవల్ల అది ‘లోచనం’ అయ్యింది. 

Player
>>