కీచకుని ఆగమనం7

ద్రౌపది భయసంభ్రమం...

ద్రౌపదికీ, కీచకునికీ ఇద్దరికీ విరుద్ధభావాలు కలిగాయి. చెదరిన మనస్సుచేత కలిగిన భావోద్వేగంవల్ల కలిగిన శరీరపరిణామాలు కీచకుడివైతే, ఒకానొక పురుషుడు తనను ఈ విధమైన దృష్టితో చూస్తున్నాడు అనే ఆలోచన వలన వచ్చిన మార్పు ద్రౌపదిది. ఆమెకు రక్షణ లేదు. భర్తలు ఎక్కడో ఉన్నారు. తాను ఇక్కడ ఉన్నది. వీడేమైనా చేస్తే? ‘వెఱవక ననుఁజూచె వీఁడని యెదఁ గలుషించిన నొండొండ చెమట వొడమ’ - ఆమెకు చెమట పట్టింది. ‘స్వేదం’ వీడు ఆ స్వేదాన్ని ఎలా అర్థం చేసుకున్నాడు? ఓహో! అనుకున్నాడు. ఏదైనా తీవ్రమైన భావోద్వేగం కలిగినా చెమట పట్టుతుంది.  ‘అనుచిత కృత్యంబు లాచరించు విధాతృ బలిమికి నివ్వెఱపాటు దోఁప’ దైవవిధికి నిశ్చేష్టురాలైతే, ఆహా! నన్ను చూసి ఈమె కూడా మన్మథావస్థలకు లోనవుతోందే! అని కీచకుడు అనుకుంటున్నాడు. అమె నిజానికి భయపడుతున్నది. ‘ఇచ్చట దిక్కులే రెవ్వరు నా కను భయమున మేనఁ గంపంబు వుట్ట’ సాత్త్వికభావాల్లో కంపం ఉన్నది. ఆమెలోని భయంతో కూడిన కంపం చూసి అనుకూలమైన శరీర స్పందన అనుకున్నాడు. ‘చేయంగ నేమి యుపాయంబు లేమి నాననమున వెల్లఁదనంబు గదుర’ - ఎలా తప్పించుకోవాలో తెలీక తెల్లబోయింది. అదే కదా వైవర్ణ్యం. ‘ఉన్న పాంచాలిఁ గనుఁగొని’ ఈ విధంగా భయార్త అయిన ఆమెను చూసి, ప్రకంపనలు - చెమటపట్టటం, నివ్వెరపాటు, తెల్లబోవడం, వణుకు, ఇవన్నీ భయంవల్ల కలిగితే వీడు వానిని సాత్త్వికభావాలు అనుకుని శృంగారానికి అన్వయించుకుని, ‘ఉన్న పాంచాలిఁ గనుఁగొని య న్నరాధముఁడు వివేక విహీనుఁడై ముదితుఁ డగుచు మదన వికృతియ కాఁ దన మదిఁ దలంచి’ - ఇలా ఆమె తనకు అనుకూలమే అని అనుకున్నాడు. ‘రాగసాగర పూర నిర్మగ్నుఁ డయ్యె’ - రాగము అనే సముద్రంలో పూర్తిగా మునిగి పోయాడు. ‘అయ్యవసరంబున’ - ఆ సమయంలో

చ.         ‘పొలఁతుక కాంతి యింత పొలివోవఁగ నీ కెసలారఁ దార ని
            శ్చలతఁ గడంగి క్రోలికొనఁ జాలుటఁ గీచక ముఖ్యు లోచనం
            బులు ‘నయనం ప్రధాన’ మను పూర్వ వచస్స్థితి తప్పకుండఁగా
            నెలమి వహించెఁ దక్కు గల యింద్రియ వర్గము ధిక్కరించుచున్’   (విరాట. 2-35)

            ‘పొలఁతుక కాంతి యింత పొలివోవఁగ నీ కెసలారఁ దార నిశ్చలతఁ గడంగి క్రోలికొనఁ జాలుటఁ గీచక ముఖ్యు లోచనంబులు’ తక్కిన అవయవాలను ధిక్కరిస్తూ ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్న ఆ సిద్ధాంతం వెనక ఉన్న సార్థకతను నిరూపించడానికే అన్నట్లుగా ఆమెపై నిలిచిన దృష్టి ఎక్కడికీ పోవడం లేదు.

క.         అప్పయుఁ బరిజనములుఁ దనుఁ
            దప్పక కనుఁగొనుచునుండఁ దగవేది కరం
            బొప్పని తమకము చిత్తముఁ
            గప్పికొనుట నుత్తలంబు గదురఁగ నచ్చోన్                     (విరాట. 2-36)

            ‘అప్పయుఁ బరిజనములుఁ దనుఁ దప్పక కనుఁగొనుచునుండఁ’ - అక్కగారు, పరిజనులు అందరూ తననే గమనిస్తున్నారు - ‘దగవేది కరంబొప్పని తమకము చిత్తముఁ గప్పికొనుట నుత్తలంబు గదురఁగ’ - అయినా కూడా తమకాన్ని ఆపుకోలేక ఆమెనుంచి దృష్టి మరల్చలేకపోతున్నాడు.

సీ.        ‘తన్వంగి మవ్వంపుఁదనులత నెసఁగెడు నునుఁగాంతి వెల్లువ మునుఁగఁబాఱఁ
            గిసలయహస్త కెంగేల నేపారు క్రొ మ్మిం చను లేయెండ మిగులబర్వ  
            గమలాస్య ముద్దుమొగంబు లే మెఱుఁగుల మొత్తంబుపరి చుట్టుముట్టి కొనఁగ
            ధవళాక్షి తొంగలి తఱచు ఱెప్పల చెన్ను కప్పను చీఁకటి గవియుదేర,

తే.         బెగ్గలం బంత కంతకు నగ్గలింప
            నొదవు చెమటతోఁ జిత్తంబు చెదరి యెందు
            మెలఁగఁ దలపేది యా సింహబలుఁడనంగు

            పట్టి యాడెడు జంత్రంబు పగిది నుండె’                         (విరాట. 2-37)

            ఇక వరసగా ఇవే భావాలు!

Player
>>