కీచకుని ఆగమనం8

కీచకుని ఆరాటం...

            ‘ఇట్లు కందర్పదర్ప గోచరుండైన కీచకుండు నిజసహోదరి వలన’, కీచకునికి ఆ స్త్రీ వివరాలు చెప్పాలంటే ఎవరున్నారు? ఈ అంతఃపురానికి మహారాణి ఎవరు? ఈయన సోదరియే! కాబట్టి అక్కగారిని అడుగుతాను. అనుకుని, ‘అక్కోమలి కలరూపు తెలియదలంచి దాని దెసం దగిలిన దృష్టి యెట్టకేలకుం దిగిచికొని చని యద్దేవికిం బ్రణమిల్లిన’-ఆమెపై ప్రసరించిన చూపును ఎట్టకేలకు త్రిప్పుకుని అక్కగారికి నమస్కరించాడు.

క.         ‘కాంచన పీఠము వెట్టఁగఁ
            బంచి ప్రియము చూడ్కి ముసుఁగువడఁదను సంభా
            వించునెడ నాతఁడప్పకుఁ
            బాంచాలిం జూపి వేగపడి యిట్లనియెన్’                         (విరాట. 2-39)

            ‘కాంచన పీఠము వెట్టఁగఁబంచి’ - కూర్చో నాయనా! అని బంగారుపీఠాన్ని చూపింది. ‘ప్రియము చూడ్కి ముసుఁగువడ’ - ఆమె ఎప్పుడూ ఆప్యాయంగా పలకరించే ప్రేమతో కూడిన చూపు ముసుగు పడిపోయింది. ‘తను సంభావించునెడ నాతఁ డప్పకుఁ బాంచాలిం జూపి’ ఆమె ఎంతో ఆదరంతో కీచకుడిని పలకరిస్తే, అతను పట్టించుకొనక పాంచాలిని చూపి ‘వేగపడి యిట్లనియెన్’ ఆలస్యం చేయకుండా ఇలా అడుగుతున్నాడు. 

ఉ.         ‘ఇయ్యరవిందగంధి కులమేమి? చరిత్రము చందమెట్లు? పే
            రెయ్యది? నాథుఁడెవ్వఁ? డిది యెచ్చట నెప్పుడు నుండు? నిప్డు దా
            నియ్యెడ కేఁగుదేవలయు టేపని సేయఁగఁ బూని? దీనిపై
            నెయ్యము కల్మి యేకొలఁది నీ మది? కింతయు నాకుఁ జెప్పుమా!’(విరాట. 2-40)

            ‘ఇయ్యరవిందగంధి కులమేమి?’ - ఈమె కులమేమిటి? మొదలుపెట్టాడు. ‘చరిత్రము చందమెట్లు?’ - నడవడిక ఎటువంటిది? సులభంగా వశమయ్యే నడవడిక, శీలం గలదా? 

            ఆటవెలది అంటే అవధానికి ఇష్టమెందుకు? శ్లేషలో చెప్పాలి. నెల్లూరులోతిరుపతి వేంకట కవుల శతతమజయంతిలో శతావధానం చేసినప్పుడు సుబ్బన్న శతావధాని గారి కిచ్చిన ప్రశ్న. ఆటవెలది అంటే అందరికీ తెలుసు. ఒకటి రోవెలఁది. మరొకటి అందరూ సులువుగా చెప్పే పద్యం. ‘విశ్వదాభిరామ! వినుర వేమ!’ అన్నట్టు. సరే

ఆ.         ఆటవెలది అన్న అవధానికిష్టమౌ
            సులభగమ్య యౌట సూరి వర్య!
            విశ్రుత పద నియమ వృత్తాఢ్య సంగతి
            అంత తేలికైన దగునె ఎందు?

               ఆటవెలది - ఛందస్సు పరంగా పద్యం సులువుగా చెప్పుకోవచ్చు. మరో అర్థం. ఆటవెలది- రో వెలఁది, భోగపు కాంత - అంటే సులభ గమ్య, సులభంగా అందివచ్చే వనిత. ‘సులభ గమ్య యౌట సూరివర్య!’ - సూరివర్య - పృచ్ఛకుడిని సంబోధించి . ఏమయ్యా! పెద్ద పండితుడివే! ఈ మాత్రం తెలీదా? మరి, ‘విశ్రుత పదనియమ వృత్తాఢ్య సంగతి’ - శార్దూలమో, మత్తేభమో, స్రగ్ధరో, మహాస్రగ్ధరో ఇటువంటి వృత్తాలని తీసుకోవాలంటే ఛందస్సులో విశ్రుతపదనియమం, యతులు, గణాలు, ప్రాసలు, వీటన్నిటినీ సాధించి పద్యం నిర్మించటం, అంత తేలికైన దగునె యెందు. ఇది ఛందస్సుకు సంబంధించినదైతే, అదే సుశీలయైన ‘విశ్రుతపదనియమ వృత్తాఢ్య’ - మంచి నడవడిక, చక్కని శీల వంతురాలైన గుణోజ్జ్వలసంభరిత అయిన స్త్రీ విషయం - అది సామాన్యమైన విషయం కాదు.

                ‘పేరెయ్యది? నాథుఁ డెవ్వఁడు? ఇది యెచ్చట నెప్పుడు నుండు?’ అదీ కావలసినది. ‘ఇప్పుడు తా నియ్యెడ కేఁగుదేవలయు టేపని సేయఁగఁ బూని?’ ఎందుకోసం ఆమె ఇక్కడికి వచ్చింది?  ‘దీని పై నెయ్యము కల్మి యేకొలఁది?’ దీని మీద నీకెంత ప్రేమ? అందరి పరిచారికల మీదకంటే నువు చూసే చూపు వేరుగా ఉంది. ఏమిటి ఈమె ప్రత్యేకత? ‘ఇంతయు నాకుఁ జెప్పుమా!’ ‘అనవుడు అయ్యంగన’ - సుదేష్ణ చూసింది. వ్యవహారం గమనించింది. అక్కడ్నుంచి వస్తున్నప్పుడే గమనిస్తోంది. ఆమె గుండె గుభిల్లుమంది. ఎందుకంటే ద్రౌపది ముందే హెచ్చరించింది.

Player
>>