కీచకుని ఆగమనం9

                ‘అనవుడు నయ్యంగన యితఁడనంగశరదళిత హృదయుఁడయ్యె’ - వీడి మనసు మన్మథ బాణాల తాకిడికి గురయ్యింది. ‘అకటా యీతని చిత్తవృత్తి మరలుప ననురూపంబగు ఉపాయ మెయ్యదియో’ - వీడు అసలే మూర్ఖుడు. దుర్విదగ్ధుడు. ఆమెకు తన తమ్ముని విషయం తెలుసు కనుక, వాని మనసు మరల్చటానికి తగిన ఉపాయం ఏది, ‘అని తలంచుచుఁ గీచకుని మాటలు గీటునంబుచ్చి’ - అని సుదేష్ణ ఆలోచిస్తూ కీచకుడు ఏదో చెపుతున్నా విననట్లుగా నటిస్తూ మాట దాటెయ్యడానికి ప్రయత్నించింది. తిక్కనగారికి చాలా ఇష్టమైన రచనావిధానం ఇది. గీటున పుచ్చడం - ‘ఆ విషయమలా ఉండనీ, ఇక్కడకు రా, ఇది చెప్పు ముందు’ అని. ‘ఒండు పలుకులు జరపిన’ ఏదో చెప్పటానికి, అడగటానికి ప్రయత్నిస్తోంది. ‘గీటునం బుచ్చి యొండు పలుకులు జరపిన అతండును సత్త్వహీనుండు గావున సత్వరుండై’ - విషయం గ్రహించుకోగల సామర్ధ్యం ఎక్కడుంది? ఓర్పు లేదే! ‘క్రమ్మఱి ద్రౌపది యున్న యెడకుం జని’ - ఇక ఈ అక్కగారితో లాభం లేదని మళ్ళీ ద్రౌపది దగ్గరకు చేరాడు. ‘అఱ్ఱాడుచు నమ్మానవతితో నిట్లనియె’.

క.         ఇ వ్వసుమతి నే పొలఁతుల
            కివ్విధమునఁ జెలువు గలదె యెన్నండును? నీ
            వెవ్వరి తనయవు? నీ పతి
            యెవ్వఁడు? పేరేమి? సెప్పు మిందునిభాస్యా!                   (విరాట. 2-43)

            వాళ్ళని వీళ్ళని ఎందుకు, నేరుగా ఈమెనే అడిగితే పోలా? అని ఆమెనే ఆరాతీశాడు.

ద్రౌపది గాంభీర్యం...

            ‘అనిన నప్పలుకులు వినియు వినమి భావించి ‘ - ఆ మాటలు విని కూడా ద్రౌపది విననట్లుగా భావించి, ఏం చెప్పాలి? ఈ పరిస్థితి చూడండి. మహాభారతం ఇంత పెద్దగా రూపుదిద్దుకోవడానికి ఇంత విలక్షణమైన కథావస్తువు ఉండడమే కారణం. మహారాజవైభోగంతో ఉండే వాళ్ళు ఎటువంటి  జీవితాన్ని అనుభవించి ఈ స్థితికి వచ్చారు? మాట కోసం కదా! అజ్ఞాతవాసం గడపవలసి వచ్చినప్పుడు రక్షణలేని స్త్రీగా ఆమె అవస్థపడుతుంటే, అధికారమదంతో ఉన్న వీడు పలకరిస్తే, వాడి మాటలు పైకి, ‘ఏం బాగున్నారా?’ అని ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్నా ఆ మాటలవెనుక ధ్వనించే విషయం వేరు.  మాటలలో కాని, చూపులలో కాని, ప్రవర్తనలో కాని, నిలచిన తీరులో కాని, హస్తచాలనంలో కాని ప్రతి విషయంలోనూ వాడి దుష్టస్వభావమే కనపడుతున్నది.

            కనుకనే ‘వినియు వినమి భావించి యప్పాంచాలి నిర్వికారయై’ - ఏ భావం ప్రదర్శించకుండా ఆమె పని ఆమె చేసుకుంటూ వెళుతున్నది. ‘ఊరకున్న నచ్చపలుండు’ - చపలుడు, సత్త్వహీనుడు కదా అందుకని ‘వెండియు నిట్లనియె’.

            ‘తెలి గన్నుఁగవ కాంతి పొలుపార నించుక కనువిచ్చి చూచినఁ గాదె’ - ఆమెను చూశాడు, ఆమె ధవళాక్షి - తెల్లని కన్నులు కలది. ‘నీకింత చక్కటి అందమైన కళ్ళు ఉన్నాయి. వాటి ప్రయోజన మేమిటి? తెరచి చూస్తే అవి సార్థకమవుతాయి కదా!’ ‘చెలువంపు నెమ్మోము నెలమి సొం పినుమడిగా నల్ల నవ్వినఁ గాదె’ - ‘ఊరికే ముఖం అలా పెట్టుకుంటే ఎలా? ఏదో కొంచెం చిరునవ్వు నవ్వు’. ‘దంతమౌక్తికరుచి దలకొన’ - ‘అవి దంతాలా? నువ్వు కొంచెం పెదవి కదిల్చినప్పుడు తళుక్కుమని ముత్యాలవలె మెరిసాయి’. ‘దంతమౌక్తికరుచి దలకొన మఱుమాట వలికినఁ గాదె’ - ‘ఏదీ కొంచెం పలికితే ఆ ముత్యాలేమైనా రాలిపోతాయా?’ ‘ఉల్లంబు సరసత దెల్లంబుగా లీలఁ గైకొన్నఁ గాదె పంకరుహవదన!’ - ‘మనసులోని సరసత తెలిసేట్లుగా పలుకవచ్చు కదా!’ ఆమెకు కూడా కంపము, స్వేదము కలిగినవి కదా! అవన్నీ చూశాడు, అన్వయించుకుంటున్నాడు. ‘అనుచుఁ జూచుఁ జేరుఁ నమ్ముగ్ధ పలుకులు వినఁగఁ గోరు, గేలు తనదు కేలఁ గీలుకొలుపఁ దలచు’ - ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ చేయి కలపాలని ప్రయత్నిస్తున్నాడు.

            ‘అని ఇట్లు దాన తమకంబున వడిగొనుచు, నప్పు డయ్యంగన యింగితం బూహింప వెరవుమాలి’ - ఆమె మనసులో ఏముందో అతని ఊహకు కూడా అందడం లేదు. ఆమె మనసును అర్థం చేసుకోలేకపోతున్నాడు. ‘సుదతి! నీమై చక్కఁజూచుట కోడెదఁ గనుఁబాటు వొరయునో యని తలంచి’ - ‘నీ శరీరసౌందర్యాన్ని సూటిగా చూడాలంటే అనుమానం వేస్తోంది. రెప్పపాటు కలిగి, ఆ కాస్త కాలం కూడా నిన్ను చూడలేకపోతానేమో! ఇంకో భయం. నీకు దృష్టి దోషం తగులుతుందేమో!’, ‘మదిఁ బొనర్చిన మాట మగువ! నీ పెంపునఁ గుదిసి నా నాలుక తుదికి రాదు’ - ‘ఎంతో చెప్పాలని ఉన్నది కాని ఈ ఉద్వేగంచేత నాలుక చివరకు మాట రావటం లేదు’. ‘పడఁతి! నీ కరములు పట్టంగఁ దివిరి శంకించి వడంకెడుఁ గేలు సూడు’ - ‘నీ చేయి పట్టుకోవాలని అనుకుంటే, చూడు నా చేయి వణికి పోతోంది’. ‘నెఱి నిట్టిదని యింతి! నీ నెమ్మనం బెన్నిభంగుల నరసినఁ బట్టు వడదు’ - నీ నెఱి - నీ సౌందర్యం. ఇంతకు ముందే అనుకున్నాడు కదా, ఈమెను అంత కోమలంగా, సుందరంగా రమణీయంగా బ్రహ్మదేవుడు సృష్టించడానికి కుసుమబాణుని అయిదు బాణాలను తీసుకుని కరిగించి అని ఏమో ఏమో అనుకున్నాడు. “బాగుంది కాని, నీ మనసు మాత్రం నాకు తెలియటం లేదు.” 

Player
>>