కీచకుని మోహం1

కీచకుని మోహం

సుదేష్ణ ద్రౌపదిని మదిరకై ఆదేశించుట...

         ‘అక్కడ పాంచాలి రావించి సుదేష్ణ’ - సుదేష్ణ ఈమెను కీచకుని వద్దకు పంపించాలి కదా! ద్రౌపదికి అసలు ఈ విషయం తెలీదు, ఊహించను కూడా ఊహించ లేదు. ‘సుదేష్ణ తృష్ణ భావించుచు’ - ఆమెకు దప్పిక అయినట్లు నటిస్తూ, ‘తృష్ణ’ - దప్పిక - మంచినీరు తాగితే తీరే దప్పిక కాదు, మదిర తాగితేనే ఉపశమిస్తుంది, ‘ఇట్లనియె’ ద్రౌపదిని పిలిపించి చెప్పింది.

క.         ఒదవెడు తృష పెల్లిదమున
            వదనము వఱువట్లు వట్టె వాసితరాజ
            న్మదిరారస మానఁగ నా
            హృదయంబున వేడ్క యెసక మెసఁగెడుఁ దరుణీ!               (విరాట. 2-88)

           ‘ఒదవెడు తృష పెల్లిదమున వదనము వఱువట్ల వట్టె’ - ‘గొంతు తడి ఆరిపోయింది. ‘వాసిత రాజన్మదిరారస మానఁగ నా హృదయంబున వేడ్క యెసక మెసఁగెడుఁ దరుణీ!’ - నాకు చక్కని మదిర - ద్రాక్షాసవం సేవించాలనే కోరిక కలిగింది.

క.         కీచకుని యింట నెప్పుడు

            వాచవి యగు బహువిధముల వారుణి గలుగున్
            వే చని యిచటికిఁ గొని ర

            మ్మా చూతముగాని నీ గమన వేగంబున్.             (విరాట. 2-89)

           ‘కీచకుని యింట నెప్పుడు వాచవి యగు బహువిధముల వారుణి గలుగున్’ - ‘కీచకుని ఇంట ఎల్లప్పుడూ మంచి రుచిగల ‘వాచవి యగు బహువిధముల వారుణి గలుగున్’ - సవములు చాలా ఉంటాయి. ‘వేచని’ - త్వరగా వెళ్ళి, ప్రాసకోసం వేసింది మాత్రమే కాదు ఆయాసం వల్ల కూడా ఆమె అలా మాట్లాడుతుందని అర్థం చేసుకోవాలి. త్వరగా వెళ్ళమనాలి కదా! ఆ ‘వేగ చని’ అనేటప్పుడు ‘గ’ అంటే ఒక అక్షరం ఆలస్యం అవుతుంది కదా అని ‘వేచని’ త్వరగా వెళ్ళు. నీవు వేగంగా వెళ్ళి ‘ఇచటికి గొని రమ్మా’ - తీసుకుని రా! ‘చూతముగాని నీ గమన వేగంబున్’ - ఎంత వేగంగా వస్తావో చూస్తాను. త్వరగా వచ్చేయ్. ఎక్కడా ఒక్క నిమిషం కూడా ఆగకు.’ అక్కడకు వెళితే వేగంగా వచ్చే పరిస్థితి ఉందా? లేదు! ‘అనవుడు’

ఉ.           ఉల్లము దల్లడిల్లఁ దను వుద్గత ఘర్మజలంబు దాల్చుచున్
               డిల్లపడంగ ‘నా కిది కడింది విచారము పుట్టె; నందుఁ బో
               నొల్ల ననంగ రా, దచటి కూరక పోవను రాదు, నేర్పు సం
               ధిల్లఁగ దీనిఁ బాపికొను దీమస మెట్టిది యొక్కొ దైవమా!    (విరాట. 2-91)

               ‘ఉల్లము తల్లడిల్ల’ - ద్రౌపదికి పరిస్థితి అర్థమైపోయింది. మనస్సు బెదరిపోయింది. ‘కీచకుని ఇంట్లో’ అని చెప్పగానే అంతా అర్థమైపోయింది. ‘ఉల్లము తల్లడిల్ల తనువు ఉద్గత ఘర్మజలంబు తాల్చుచున్’ - ఎప్పుడూ ఊహించను కూడా లేదు, ఈ విధంగా సుదేష్ణ చెప్తుందని అనుకోలేదు. భయంతో శరీరంపై చెమట పడుతూ ఉండగా ‘డిల్ల పడంగ నాకిది కడింది విచారము పుట్టె’ - నాకు చాలా దుఃఖం కలుగుతున్నది. ఆలోచన చేయాల్సిన విషయం. ‘నందుఁ బో నొల్ల ననంగ రాదు’ అక్కడికి నేను వెళ్ళను అని చెప్పడానికి వీలులేదు. ‘అచటి కూరక పోవను రాదు’ అలా అని ధైర్యంగా వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఉండలేను, వెళ్ళలేను, వెళ్ళను అని చెప్పలేను. కాని పోక తప్పించుకునే మార్గం కూడా కనిపించటం లేదు. ‘నేర్పు సంధిల్లఁగ దీనిఁ బాపికొను దీమస మెట్టిది యొక్కొ దైవమా!’ - దీనిని ఉపాయంతో తప్పించుకునే మార్గం ఏది?‘అని తలంచుచు డోలాందోళితమానస యగుచు నమ్మానిని సుదేష్ణ కిట్లనియె’.

ఉ.           ఉత్పలగంధి! నన్నుడుగు మొడ్లను బంపుము కల్లు దేర; నే
               సత్పథవృత్తి నీ కడన సంతతమున్ బహుమానపాత్రమై
               తత్పరతం జరించి యుచితంపుఁ బనుల్ దగఁ జేయఁ గాక దు
               ష్యత్పరివారయోగ్య పరిచారముమైఁ జను నట్టి దాననే?      (విరాట. 2-93)

‘నేను నిన్ను సేవించడానికి వచ్చినప్పుడే కొన్ని షరతులు చెప్పాను ‘నన్నొడుగుము’ - నన్ను వదిలిపెట్టు, ‘ఒడ్లను బంపుము’ - వేరేవాళ్ళని పంపించు’. నీచమైన పనులను చేయను అని నేను అప్పుడే చెప్పాను కదా! ‘సైరంధ్రీ పరవేశ్మస్థా స్వతంత్రా’ - సైరంధ్రీ వృత్తిలోనివారు స్వతంత్రులు కాబట్టి నా స్వాతంత్ర్యం నాది. 

Player
>>