కీచకుని మోహం2

క.         అతివ! తగునమ్మ నీ గృహ
            మతి నిర్మల చరిత భరితమని ఈ యెడ మ
            త్పతుల యసన్నిధి నైనను
            మతి నూఱడి యున్న చోట మన్నన దప్పన్.                (విరాట. 2-94)

               ‘అతివ! తగునమ్మ నీ గృహ మతి నిర్మల చరిత భరితమని ఈ యెడ మత్పతుల య సన్నిధి నైనను’ - నిర్మలమై ప్రశాంతమైన నీ ఇంట్లో నాకు ఆశ్రయం దొరికిందని ‘మత్పతుల అసన్నిధి’ - నా భర్తలు దూరంగా ఉన్నప్పటికీ ‘మతి ఊఱడి యున్నచోట మన్నన దప్పన్’ - ఎంతో ఊరటతో సంతోషంగా గడుపుతూ ఉంటే ఇప్పుడు నా గౌరవానికి భంగం రానిస్తావా?

ఉ.           సాధులు సేరి నెమ్మిగ నిజస్థిర వృత్తము దుష్టకోటిచే
               బాధలఁ బొందకుండఁ దమపాల వసించినఁ బెద్దవారు ది
               క్కై ధరియించి వారికొక యాపద వుట్టకయుండఁ గాచు టొ
               ప్పై ధర కీర్తి కెక్కదె? యపాయము సేసిన నింద వుట్టదే?    (విరాట. 2-95)

               రాసినది ఉత్పలమాల పద్యమే అయినా ఆ శిల్పం ఎటువంటిది! ‘సాధులు చేరి నెమ్మిగ నిజస్థిర వృత్తము దుష్టకోటిచే బాధలఁ బొందకుండఁ దమపాల వసించినఁ బెద్దవారు దిక్కై ధరియించి వారికొక యాపద వుట్టకయుండఁ గాచు టొప్పై’ - అక్కడ దిక్కై, ఇక్కడ ఒప్పై - సజ్జనులైనవారు తమను ఆశ్రయించిన వారికి పెద్ద దిక్కుగా ఉండి ఆపదలు కలుగకుండా కాచాలి కదా! ‘ధర కీర్తి కెక్కదె? యపాయము సేసిన నింద వుట్టదే?’ అలా కాస్తే కీర్తి, అపాయము తలపెడితే నింద కలుగుతాయి కదా!

ఆ.         ఎవ్వరేని యింటి కెద్దియే నొకటికి

నన్నుఁ బంపదగునె? నిన్ను నాఁడ
కొలుచునెడ ననుజ్ఞ గొననె? నీచములగు

పనుల కేను జాలకునికి సెప్పి.                           (విరాట. 2-96)

      ‘ఎవ్వరేని యింటి కెద్దియే నొకటికి నన్నుఁ బంపదగునె? నిన్ను నాఁడ కొలుచునెడ ననుజ్ఞగొననె?’ - ఎవరింటికైనా, దేనికొఱకైనా నన్ను పంపవచ్చునా? మొదటిరోజే నీచములగు పనులు నేను చెయ్యను అని చెప్పాను కదా! ‘అనిన విని’ - ఆ మాటలు విని సుదేష్ణ నవ్వింది. ద్రౌపది ప్రశ్నించే ఈ సందేహాలన్నీ ఊహించి రాత్రంతా ఎలా నచ్చజెప్పి పంపాలో ఆలోచించుకునే ఉన్నది. ద్రౌపది ఇలా అంటుందని తెలుసు. అందుకనే రేపు పంపుతానని తమ్ముడితో చెప్పింది.

క.         అనిన విని యనుచితంబున
కనయము శంకించియును లతాంగి మదిం ద
మ్ముని వలవంత దలఁచి యి
ట్లనియెం బాంచాలి తోడ సాదర వృత్తిన్.              (విరాట. 2-97)

               సున్నితమైన విపరీత పరిస్థితి. వదలమంటే, పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం, అయినా సానునయంగా ఇలా అన్నది. 

ఉ.           అక్కట ! యేను వేడ్కపడి యానెడు నాసవ మర్థిఁ దేరఁ గా
              నొక్క నికృష్టఁ బంచుటకు నోపక చెప్పిన దీని నీవు గో
              సెక్కఁగఁ జేసి నిన్ను నతిహీన విధాన నియుక్తిఁ జేఁతగా
              నిక్కమ యుమ్మలించి తిది నెయ్యము తియ్యము కల్మియే? సఖీ! (విరాట. 2-98)

               ‘ఇన్ని రోజులలో ఏనాడైనా నాకు ఏమైనా కావాలి తెమ్మని నీకు చెప్పానా? నువ్వు ఇష్టపడి చేస్తున్న పనిని చూస్తున్నాను. ఈ రోజు ‘అక్కట! యేను వేడ్కపడి’ - ఏదో వేడుకతో ‘ఆనెడు నాసవ మర్థిఁ దేర నొండొక్క నికృష్టఁ బంచుటకు నోపక’ - మదిర త్రాగాలనిపించి ఎవరినో పంపటం ఇష్టంలేక నీకు చెప్తే ‘నీవు గోసెక్కఁగఁ జేసి’ - నీకంత అభిమానం ఎందుకు కలిగింది? నేను వేరే వాళ్ళకు చెప్పకుండా నువ్వు నాకు దగ్గరదానివి కదా అని చెబితే ‘అతిహీన విధాన నియుక్తిఁ జేఁతగా నిక్కమ యుమ్మ లించితివి’ - నిన్ను తక్కువ చేసినట్లు అపార్థం చేసుకున్నావు. నిన్ను ఏదో నీచమైన పనికి పంపటం లేదే? ‘నెయ్యము తియ్యము కల్మియే? సఖీ’ - నువ్వు సేవకురాలివి కావు, నాకు సఖివి. ఇదేనా నీ స్నేహం?’

క.         అది లాఁతి యిల్లె? నిను దమ
            హృదయంబుల నెవ్వరేని నెఱుఁగరె? యేఁ జె
            ప్పుదు నీదు పెంపు నినుఁ
            గన్నది మొదలుగ నెల్లవారి కయ్యై భంగిన్.                        (విరాట. 2-99)

               ‘అది లాఁతి యిల్లె?’ - నేను నిన్ను పంపుతున్నది ఎక్కడికి? అది వెళ్ళకూడని ఇల్లు కాదుగా? నీచమైన పనులకు నిన్ను ఎందుకు పంపుతాను? ‘నినుఁ దమ హృదయంబుల నెవ్వరేని నెఱుఁగరె?’ - నువ్వు అందరికీ తెలుసు కదా! ‘యేఁ జెప్పుదు నీదు పెంపు నినుఁ గన్నది మొదలుగ నెల్లవారి కయ్యై భంగిన్’ - ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా నిన్ను చూసి కీచకుడి ఇంటికి ఈమె వెళ్ళి వస్తోంది అంటే వాళ్ళకు నేను తగిన విధంగా సమాధానం చెప్తాను. నీకెందుకు భయం?

క.         అని మఱియుఁ బెక్కు భంగులఁ

            దనుఁ బ్రార్థింపంగ ద్రుపదతనయకుఁ జిత్తం
            బుననింకఁ బెద్ద పెనఁగం

            జన దీయమతోడ’ నను విచారము పుట్టెన్.                  (విరాట. 2-100)

            ఈమెకు ఇంక చెప్పి లాభం లేదు అనుకున్నది ద్రౌపది. 

Player
>>