కీచకుని మోహం3

ద్రౌపది కీచకునింటికి మదిర దేరంబోవుట...

చ.        మన మురియాడుచుండ ననుమానము తోన సుధేష్ణఁ జూచి నీ
           వనయముఁ గోరినట్టి పని యర్థి మెయిం జని చేయుదానఁ గా’
           కను తన మాట కప్పొలఁతి హర్షముఁ బొందుచు నందియిచ్చు కాం
           చన చషకంబు పుచ్చుకొని చారు విలోచన యార్తమూర్తియై    (విరాట. 2-102)

     ‘మనమురియాడుచుండ’- సందిగ్ధావస్థలో మనసు డోలాయమానమైంది. ‘అనుమానముతోన సుదేష్ణఁ జూచి నీ వనయముఁ గోరినట్టి పని యర్థిమెయిం జని చేయుదానఁ’ - ‘నీవు అడిగిన పని ఏదీ నేను కాదనలేదు. ఈ పని కూడా నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇది కూడా తప్పక చేస్తాను.’ అనగానే, ‘అప్పొలఁతి హర్షముఁ బొందుచు’ - సుదేష్ణ ఎంతో పొంగిపోయింది. ‘అందియిచ్చు కాంచన చషకంబు పుచ్చుకొని’ - ఆమె అందించిన బంగారుపాత్ర తీసుకున్నది. ‘చారువిలోచన’ -సుందరమైన విశాలనేత్రములుగల ఆ ద్రౌపది, ఆమె చారువిలోచన ఎందుకు కావాలి? ఏ దిక్కునుంచి ఆపద ఏ పాము రూపంలో వస్తుందో అని కళ్ళు విప్పదీసి చూస్తోంది, ‘యార్తమూర్తియై’ - కాని ఆమె ప్రకృతి ఏమో ఆర్తమూర్తి. ఆ ఆర్తితో.

చ.  అలమటఁ బొంది మాయ విధియా! యని దైవము దూఱు, నిత్తఱిం
     గలరొకొ నాకు దిక్కను మొగంబున నశ్రులు వెల్లిగొల్పుఁ దొ
     ట్రిలఁబడు, జల్లనం జెదరు డెందముఁ గూడఁగఁ దెచ్చి నన్నుఁ గే
     వలమున ముట్ట నెవ్వరికి వచ్చుననుం, గలఁగున్, వెనుంబడున్ (విరాట. 2-104)

               ‘అలమటఁ బొంది మాయవిధియా! యని దైవము దూఱు’ - ‘ఇటువంటి అవస్థ కలిగించావా అని దైవాన్ని నిందించుకుంటూ, ‘నిత్తఱిం గలరొకొ నాకు దిక్కను మొగంబున నశ్రులు వెల్లిగొల్పుఁ దొట్రిలఁబడు, జల్లనం జెదరు డెందముఁ గూడఁగఁ దెచ్చి నన్నుఁ గేవలమున ముట్ట నెవ్వరికి వచ్చు ననుం, గలఁగున్, వెనుంబడున్’ - నాకు ఇప్పుడు దిక్కు ఎవరు?’ కళ్ళలో నీరు తిరుగుతుండగా, చెదిరిపోతున్న మనసు కుదుటపెట్టుకుంటూ, ‘నన్ను ఎవడు తాకగలడులే!’ అని అటూ ఇటూ చూసుకుంటూ, తడబడుతూ, తొట్రుపాటు పడుతూ నడుస్తున్నది. ‘అట్టియెడ’ - కీచకుని దగ్గర ఇంతకు ముందు కలిగిన అవస్థలన్నీ కళ్ళ ముందు మెదులుతున్నాయి.

సీ.           దైన్యంబు తలపోఁత తలకొన్నఁ జెలువ కా ననమున వెల్లఁదనంబు గదిరె;        
              భయరసవేగంబు పైకొని ముట్టినఁ గాంతకుఁ దనులతఁ గంప మడరె;
              బెగ డంతకంతకు మిగిలిన నింతికిఁ బదముల నటఁ దొట్రుపాటు బెరసెఁ;
              దల్లడం బొందినఁ దన్వికి నవయవంబుల నెల్ల ఘర్మాంబు కళిక లెసఁగెఁ;
ఆ.          దలఁకు పుట్టెఁ గొంకు కొలఁదికి మీఱెవె
              న్బాటు దోఁచె ముట్టుపాటు దొడరె
              వెఱగుపాటు దనికె, నెఱ నాడె నొవ్వు నె
              వ్వగలు వగల నీనె, దిగులు వొదివె.                        (విరాట. 2-106)

               ‘దైన్యంబు తలపోఁత తలకొన్నఁ జెలువ కా ననమున వెల్లఁదనంబు గదిరె’ - అప్పటి భావాలు భయంతో మళ్ళీ వచ్చాయి. ‘భయరసవేగంబు పైకొని ముట్టినఁ గాంతకుఁ దనులతఁ గంప మడరె బెగ డంతకంతకు మిగిలిన నింతికిఁ బదముల నటఁ దొట్రుపాటు బెరసెఁ’ - స్థిరత్వం పోయేసరికి అడుగుల్లో తొట్రుపాటు వచ్చింది. ‘దల్లడం బొందినఁ దన్వికి నవయవంబుల నెల్ల ఘర్మాంబుకళిక లెసఁగెఁ’ - శరీరమంతా చెమట పట్టింది. కీచకుడి దగ్గరకి వెళ్ళేటప్పడు ఆమె పరిస్థితి ఇది.                                     

           ద్రౌపది మనసులో ఎంత ఉద్వేగం ఉందో, ఎంత కలవరపాటు ఉందో, అనేకములైన భయ సందేహాలతో తొట్రుబాటుతో వెళుతున్న ద్రౌపది పద పదంలో, - అడుగడుగులో ఉన్న తడబాటు ఎలాగైతే ఉందో, కవిబ్రహ్మ కల్పించిన ఈ పదాలలోనే స్పష్టంగా ఆవిష్కృతమౌతోంది. ఇవ్విధంబున ద్రుపదపుత్రి దురవస్థం బొందుచు ‘మహాపదలకుం బరిహరణంబు హరి స్మరణంబ’యని-ఆమెకి ఎంత కష్టం కలిగినా ఆమెకు ఎప్పుడూ తోడుగా ఉండేవాడు ఒకడు ఉన్నాడు. ‘తన హృదయ పుండరీకంబునం బుండరీకాక్షు నిక్షేపించుకొని’ - ఆ శ్రీకృష్ణుణ్ణి తన మనసులో నిలుపుకున్నది. ‘సుదేష్ణ మందిరంబు వెలువడి దినకరుం గనుంగొని’ - ఆమె భవనంనుంచి ఆరు బయటికి వచ్చేటప్పటికి సూర్యుడు కనిపించాడు. కీచకుడి భవనానికి వెళ్ళాలి. ఆ సూర్యభగవానుడిని చూసి ‘వినయ వినమితోత్తమాంగయై నిజాంతర్గతంబున’ - వినయవిధేయతలతో మనసులోనే సూర్యునికి నమస్కారం చేసింది. ‘నీవు కర్మ సాక్షివి. జగచ్చక్షువవు. కనుక నువ్వే నన్ను రక్షించాలి’ అని.

Player
>>