కీచకుని మోహం4

తే.         ‘పాండు పుత్రుల కేను తప్పని మనంబు
             గలుగు దానన యేని నో కమలమిత్ర!
             కీచకుని దెస న న్నొక కీడు తెరువు
             వొరయకుండఁగ రక్షింపు కరుణతోడ.’                      (విరాట. 2-108)

               ‘పాండు పుత్రుల కేను తప్పని మనంబు గలుగు దానన యేని’ - ‘నా మనస్సు  పాండవులపై స్థిరత్వముగలిగి తప్పని మనస్థితి ఉంటే’, ‘ఓ కమలమిత్ర! కీచకుని దెస నన్నొక కీడు తెరువు వొరయకుండఁగ రక్షింపు కరుణతోడ’ - ‘నువ్వే నాకు తోడుగా ఉండు’ అని ప్రార్థించి, అంటే ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్న స్త్రీ మనస్సులోని విహ్వలతాభావోద్వేగంతో ధైర్యం చిక్కబట్టుకుని తనకు సన్నిహితుడైన శ్రీకృష్ణుణ్ణి నిలుపుకుని బయటకు వస్తే, సూర్యుడు కనిపించాడు. ఆమెకు సహాయం చేసే మనుషులు ఎవరూ లేరు. భర్తలు దగ్గర లేరు. వాళ్ళకు వార్త చెప్పడానికి వీలులేదు. 

క.            తరణియు దుఃఖితయగు న
               త్తరుణిం గాచుటకు నత్యుదగ్రభుజావి
               స్ఫురణాఢ్యు నొక్క రక్కసుఁ 
               గరుణార్ద్ర మనస్కుఁడగుచు గ్రక్కునఁ బనిచెన్.                 (విరాట. 2-110)

               ‘తరణియు దుఃఖితయగు అ త్తరుణిం గాచుటకు’ - తరణి సూర్యుడు. అగ్నిలా వెలిగేవాడు  కాబట్టి తరణి. ఆ సూర్యుడు ద్రౌపది పరిస్థితి చూసి, ‘అత్యుదగ్రభుజావి స్ఫురణాఢ్యు నొక్క రక్కసుఁ గరుణార్ధ్ర మనస్కుఁ డగుచు గ్రక్కునఁ బనిచెన్’ - ఆమెపై ఎంతో కరుణతో ఆమె రక్షణకొరకు ఒక రాక్షసుడిని పంపించాడు. రాక్షసుడిని పంపించాడు అనే విషయం కవి వర్ణన అయినా ఒకానొక భయంకర విపత్కర పరిస్థితిలో అసహాయురాలిగా వెళుతున్న ఆమెకు తనలో ఉన్న ఆత్మవిశ్వాసం అంత ధైర్యం ఇచ్చింది.

               ‘వాఁడునుం బనిపూని యంబరతలంబున నదృశ్యాకారుండై’ - అదృశ్యరూపంలో ఆ రాక్షసుడు వచ్చాడని కవి వర్ణన. ఆమె ఆ స్థితిలో తనకున్న ఆత్మవిశ్వాసం, నిశ్చలచిత్తము, స్థైర్యము, శీలము, జన్మము అన్నీ కలగలిపి ధైర్యవంతురాలు అయ్యింది. 

కీచకుని ప్రేలాపన...

ఉ.            అంబురుహాక్షి వచ్చు తెరు వారయఁ గీచకముఖ్యుఁ డప్డు తె
               ల్లంబుగఁ జూచి యుల్లము కలంకయు వారక మేన వెమ్ము తా
               పంబును డిగ్గఁ ద్రావి, గరుపాఱుచు నుత్కట సంభ్రమంబు హ
               ర్షంబుఁ బెనంగొనంగ నతిచంచలభావ పరీత మూర్తియై         (విరాట. 2-113)

               ‘అంబురుహాక్షి వచ్చు తెరు వారయఁ గీచకముఖ్యుఁ డప్డు తెల్లంబుగఁ జూచి’ - ద్రౌపది ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తున్న కీచకుని ఇంటికి సింహం దగ్గరకి పోతున్న లేడిపిల్లవలె సందేహిస్తూ వెళ్ళింది.

క.            చిడిముడి పడుచు నెదురు చనఁ
               గడఁగుచు హారములు సక్కఁగ ద్రోచుచు మ
               ల్లడి గొనుచు దుర్విలాసం
               బొడలికి నొడఁ గూర్చుచుండ నుగ్మలి యంతన్.              (విరాట. 2-114)

               ‘చిడిముడి పడుచు నెదురు చనఁ గడఁగుచు హారములు సక్కఁగఁ ద్రోచుచు మల్లడి గొనుచు’ - ఆమె వచ్చేటప్పటికి కీచకుడు కూర్చుని ఉన్నాడు. ఆమె ఇంకా రాలేదు, ఇంకా రాలేదు అనుకుంటున్నాడు. ఎక్కడో చప్పుడు ఆయ్యింది. చటుక్కున పైకి లేచి చూశాడు.

               ‘చిడిముడి పడుచు నెదురు చనఁ గడఁగుచు హారములు సక్కఁగఁ ద్రోచుచు’ - తొట్రుపాటు పడి తటాలున లేచి ఇంతలో తన అలంకారాలు సరిచూసుకుంటూ ‘మల్లడి గొనుచు దుర్విలాసం బొడలికి నొడఁ గూర్చుచుండ’ - మురిసిపోతూ నిలుచున్నాడు. ‘ఉగ్మలి యంతన్’ - అప్పుడు ద్రౌపది తత్ప్రదేశంబునకుం జని - హేమ పాత్రను పట్టుకుని ఆ ప్రదేశానికి వెళ్ళింది.

తే.         దేవి తృష పుట్టి వారుణి దేరఁ బనుప 
            నరుగుదెంచితిఁ బోయింపుఁ డనిన నింతి
            నెమ్మొగంబున దృష్టులు నిలిపి తమక 
            మడర నిట్లను నా కీచకాధముండు.                      (విరాట. 2-116)

               ‘దేవి తృషపుట్టి వారుణి దేరఁ బనుప నరుగుదెంచితిఁ బోయింపుడు’ - రాణిగారికి ద్రాక్షరసం త్రాగాలనే కోరికతో పంపితే ఇక్కడికి వచ్చాను. ఇదిగో పాత్ర, ఇందులో పోయించండి. ‘అనిన నింతి నెమ్మొగంబున దృష్టులు నిలిపి’ - ఆమె ముఖంపై చూపు సారించి, ‘తమక మడర నిట్లను నా కీచకాధముండు’. 

Player
>>