కీచకుని మోహం5

క.            ‘దేవి తృష దీర్పఁ బూనితి 
               వా వెలఁది సహోదరుండ నగు నా తృష లీ
               లావతి! నీదు సరస సం 
               భావన మెయిఁ దీర్పకునికి పాడియె చెపుమా!                  (విరాట. 2-106)

               నీ దేవి దప్పిక తీరుస్తున్నావు సరే! మరి ఆమె సోదరుడనైన నా దాహం తీర్చకుండుట న్యాయమా?!

సీ.           కాంతి దళ్కొత్తు నీ కడకంటి చూడ్కితోఁ బొందఁ గానని మేను పొగులుటయును,
              దీపారు నీ పల్కుఁ దెల్లంబుగా వినఁ గానని వీనులు గందుటయును
              నింపగు నీ చెయ్వు లెలమిమైఁ గొనియాడఁ గానని కోర్కులు గలఁగుటయును
              సొగయించు నీ కేళిఁ దగిలి యానందంబుఁ బొందఁ గానని మది దుటయును.
 తే.          బాయ నాదగు జన్మంబు ఫలము నొంద
              భావజన్ముని పూనిక పారమెయ్ద
              నన్ను బంటుగా నేలుము నలినవదన! 

              యింక నీ సిగ్గుదెర యోల మేల నీకు?’                       (విరాట. 2-118)

               నీయందలి విరహంతో ప్రాణాలు వదిలే స్థితిలో ఉన్నాను. ‘బాయ నాదగు జన్మంబు ఫలము నొంద భావజన్ముని పూనిక పారమెయ్ద నన్ను బంటుగా నేలుము’ - ఈ సేవంతా నువ్వే ఎందుకు చేయడం? నేనే నీకు దాసుడిని అవుతాను.

తే.           చెలువ యప్పలుకులు పెడ చెవులఁ బెట్టి
               ధీర గావున విగతవికార యగుచు
               మదిర వోయింపుఁ డద్దేవి యెదురు చూచు
               నలుగుఁ దడవైన మగుడఁ బోవలయు ననిన.                  (విరాట. 2-120)

               ‘చెలువ యప్పలుకులు పెడ చెవులఁ బెట్టి’ - ఆమె ఆ మాటలు విననే లేదు. నీ గొడవ నీదే కాని, నా విషయం నాదే అనుకుని స్థిరంగా అక్కడే నిలచి, ‘ధీర గావున విగత వికార యగుచు మదిర వోయింపుఁ డద్దేవి యెదురు చూచు నలుగుఁ దడవైన’ - ధైర్యవంతురాలు కాబట్టి ఇలా చెప్పింది. మదిర పోయించండి, నేను పోవడం ఆలస్యమైతే దేవిగారికి కోపం వస్తుంది. ‘నలుగుఁ దడవైన మగుడఁ బోవలయు ననిన’ - నేను వెంటనే వెళ్ళిపోవాలి అని చెప్పింది. 

చ.         మదిర సుదేష్ణ పాలి కొకమాత్రన పుచ్చెద నొడ్ల చేత; నిం
            పొదవెడు నట్టి దీని చవి యుల్లము సొక్కఁగ నాను మీవు; నీ
            వదన సరోజ సౌరభమవారణ నన్నును గ్రోల నిమ్ము; బె
            ట్టిదుఁ డగు కాము తూపులఁ దొడింబడకుండఁగఁ గావు మిత్తఱిన్(విరాట. 2-121)

               ‘మదిర సుదేష్ణ పాలి కొకమాత్రన పుచ్చెద నొడ్లచేత’ - ఆమెకు కావలసినది మదిరే కదా! నువ్వు కాదు. నేను వెంటనే మరొకరిచేత పంపుతాను. ‘ఇంపొదవెడు నట్టి దీని చవి యుల్లము సొక్కఁగ నాను మీవు’ - ఆమెకి పంపించే మదిర ఎలా ఉంటుందో నువ్వు రుచి చూడు. ‘వదన సరోజ సౌరభమవారణ నన్నును గ్రోల నిమ్ము’ - నీ ముఖమునుంచి వస్తున్న సువాసనల సౌరభ్యాన్ని ఆస్వాదించే అవకాశం నాకు కల్పించు. ‘బెట్టిదుఁ డగు కాము తూపులఁ దొడంబడకుండఁగఁ’ - బలవంతుడైన ఆ మన్మథుని బాణాలకు గురికాకుండా నన్ను రక్షించు అని అన్నాడు కీచకుడు.

క.            కరితురగ రథ సమితిఁ బొం 
               పిరివోయెడు నాదు లక్ష్మి పెంపున కెల్లన్
               సరసిరుహవదన! నీవ కు
               దురుగా నొనరించెదం గుతూహల మెసఁగన్.                  (విరాట. 2-122)

‘కరితురగ రథ సమితిఁ బొం పిరివోయెడు నాదు’ - నా సామ్రాజ్యానికి నిన్నే అధికారిణిగా  పట్టాభిషేకం చేస్తాను.

క.            నా కులకాంతల నెల్లను
               నీకుం బనిసేయఁ బనిచి నెయ్యంబున నే
               నీ కనుసన్నల మెలఁగెద 
               నే కార్యంబైన నడుపు మీవ తగంగన్.                           (విరాట. 2-124)

               ‘నా కులకాంతలనెల్లను నీకుం బనిసేయఁ బనిచి’- నా భార్యలందరిచేత నీకు సేవలు చేయిస్తాను. ‘అనుచు సింహబలుండు తన యంతరంగంబున’ - అని ఆ కీచకుడు తన మనస్సులో ఉన్నది చెప్తుంటే.

క.            తనుఁ గాచి వెనుక వచ్చిన 
               దనుజు మహాబలము తనదు తనువొందిన, నా
               తని చే విదిల్చి రభసం 
               బునఁ దన్మందిరము ద్రుపద పుత్రిక వెడలెన్.                   (విరాట. 2-126)

               ‘తనుఁ గాచి వెనుక వచ్చిన దనుజు మహాబలము తనదు’ - తమకంబున వాడు అంటున్నాడు కానీ ఈమె అభిమానవంతురాలు కనుక వాడు చేస్తున్న స్తుతి ఆమెకు హేయమై వినడానికి ఇష్టం లేకపోయింది.

శ్లో.            క్షుత్ క్షామోఽపి, జరాకృశోఽపి, శిధిల ప్రాయోఽపి, కష్టా దశా
               మాపన్నోఽపి, విపన్నదీధితి రపి, ప్రాణేషు నశ్యత్యపి
               మత్తేభేంద్ర విభిన్న కుంభ పిశితగ్రాసైక బద్ధస్పృహః
               కిం జీర్ణం తృణమత్తి? మానమహతా మగ్రేసరః కేసరీ         (భర్తృహరి సుభాషితం)

               భర్తృహరి శ్లోకం - ‘క్షుత్ క్షామోఽపి జరాకృశోఽపి’ - అభిజాత్యంతో ఉన్న వాడి శీలం ఈ విధంగా ఉంటుంది. ‘క్షుత్ క్షామోఽపి’ - ఆకలితో ఉన్నప్పటికీ, ఆహారం లేక శరీరం శుష్కించినప్పటికీ ‘శిధిల ప్రాయోఽపి’ - శిధిలావస్థలో ఉన్నప్పటికీ ‘కష్టాం దశాం ఆపన్నోఽపి’ - విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పటికీ ‘విపన్న దీధితిత రపి ప్రాణేషు నశ్యత్స్యపి’ - కాంతి తరిగిపోయినప్పటికీ, ప్రాణాలు కడ గంటిపోతున్నప్పటికీ, ‘మత్తేభేంద్ర విభిన్నకుంభ పిశిత గ్రాసైక బద్ధస్పృహః కిం జీర్ణం తృణ మత్తి?’ -  సింహం, మదించిన ఏనుగు కుంభస్థలములోని మాంసాన్ని ఆస్వాదిస్తుందే కాని ఎండిన గడ్డి తింటుందా? 

Player
>>