ద్రౌపది పరాభవం1

ద్రౌపది పరాభవం

       అనుచు సింహబలుండు తన యంతరంగంబున నంతకంత కగ్గలించు తమకంబునఁ దన్నుఁ దా నెఱుంగక-ఒక్కసారిగా ఆపుకోలేని తమకంతో ఆమె దగ్గరకి వచ్చి, ‘ఎఱుంగక పయింబడి పట్టుకొనిన’ ఆమెని పట్టుకున్నాడు.

క.   తనుఁ గాచి వెనుక వచ్చిన

      దనుజు మహాబలము తనదు తనువొందిన, నా
      తని చే విదిల్చి రభసం

      బునఁ దన్మందిరము ద్రుపద పుత్రిక వెడలెన్                      (విరాట.2-126) 

     ‘తనుఁ గాచి వెనుక వచ్చిన దనుజు మహాబలము’ తన రక్షణకై వచ్చిన రాక్షసుని బలము ‘తనదు  తనువొందిన’ తన శరీరంలో ప్రవేశించగా, కీచకుని హస్తస్పర్శ ఆమె తనువుకు తగిలినంతనే, ‘తను వొందిన నాతని చే విదిల్చి’ - అతని చేయి విదిల్చింది. ‘రభసంబున తన్మందిరము ద్రుపదపుత్రిక వెడలెన్’ - భానుడు రక్షణగా పంపిన రాక్షసుడి బలం ఆమెని ఆవహించిందో లేక ఆమె మనస్థైర్యం ఇచ్చిన బలం చేతనో అలా ఆమె చేయి విదల్చగానే కీచకుడు కింద పడిపోయాడు.

    వెంటనే ఆమె ఆ భవనంనుంచి బయటకి వచ్చింది. ‘ఇట్లు ద్రోచి పోయినం గీచకుండు వెనువెంటం దగిలిన’ - అలా త్రోసి వెళ్ళిపోయినా వాడు వదిలిపెట్టక వెంటపడ్డాడు. ‘నమ్మగువయు మరలి చూచి భయభ్రాంతయై యెవ్వలనికిం బోదునో’ - పులికోరలలోనుంచి బయట పడినట్లు వచ్చేసింది, కానీ అక్కడనుంచి వెళ్ళడానికి మార్గం ఎక్కడా అని తలంచి, ‘దైవ యోగంబున విరాటుం డప్పుడు’ - అక్కడ ఏదో కల కలం వినపడింది. విరాట మహారాజు సభతీరి ఉన్నాడని చూచి ‘తత్సభాభాగంబు దెసకు వెసం బాఱి నన్’ - రాజసభకు పోతే తప్ప తనకు రక్షణ లేదు అనుకొని ‘భయార్త భీతహృదయావేశ చిత్తయయి’ - ఆమె పరిగెత్తుకుని వెళ్ళింది.

        ‘వెసం బాఱిన కామాయత్త చిత్తుండును గర్వోన్మత్తుండును గావున జనసమూహంబు సరకు సేయక’ - ఆమె సభాభవనానికి వెళ్ళేటప్పటికి కీచకుడికి అవమానంగా తోచింది. చెయ్యి పట్టుకుంటే విదిల్చింది. రమ్మంటే రాలేదు. ఏమి చేస్తున్నాను? ఎక్కడ ఉన్నాను? ఏం చేయబోతున్నాను? దీని పరిణామం ఏమిటి? అనే ఆలోచన లేదు కైపెక్కిపోయి ఉన్నాడు. అవమానభారం ఒకటి. అనుకున్న పని నెరవేరకపోవడం మరొకటి. తన మందిరము నుండి వెళ్ళడ మొకటి. ‘సమదవారణము జంగమలత వెనుకొని రభసంబున బట్టఁ జనువిధమున’ - ఈమె జంగమలత - ఒక కదిలే తీగ లాగా వెళుతోంది. దానిని పట్టుకోవాలని వేగంతో వెళుతున్నాడు అతను. ‘క్రూరదానవుడు భూచారి నిర్జరకాంతఁ బొదువ రయమ్మునఁ బోవు భంగి’ - దేవతాస్త్రీని రాక్షసుడు పట్టుకునే విధంగా, ‘ఘోరగృధ్రము సుకుమారనాగాంగన’- అంటే ద్రౌపది నాగుపాము వెళుతున్నట్లుగా వెళుతున్నది. ఆ నాగుపామును ఘోరగృధ్రము - పెద్ద డేగ వచ్చి పట్టుకున్నట్లుగా, ‘ప్రబలబిడాలంబు బాలశారిక’ - శారిక అంటే గోరువంక. గోరువంకను భయంకరమైన గండుపిల్లి వచ్చి పట్టుకున్నట్లుగా, ‘సింహబలుండు అత్యుదగ్రత చిగురుఁబోఁడి పజ్జఁ గడువడి తగిలి కోపంబు గదుర’ - రాజు సభామందిరంలోకి ప్రవేశిస్తుంటే ఆమెను పట్టుకున్నాడు.‘మహోగ్రవృత్తిఁ గొంగు కొసరించుకయు లేక కూల దాఁచె’ - ఆమెని ఒక్కతోపు తోసేటప్పటికి క్రింద పడిపోయింది.

Player
>>