ద్రౌపది పరాభవం4

విపత్కరమైన పరిస్థితి ఏర్పడుతుందని చెబుతూ, ‘ఫలితంబై వరశాఖ లొప్పగ అనల్పప్రీతి సంధించుచున్ విలసచ్ఛాయ నుపాశ్రితప్రతతికిన్ విశ్రాంతి గావింపఁగా’ – పైకి, ఫల సంపద కలిగి నలుగురికీ నీడ నిచ్చే చెట్టును కూల్చడమెందుకని అర్థం, కాని గూఢార్థం - విరాటుడిని ఆశ్రయించుకుని ఎంతోమంది జీవిస్తున్నారు. అతను తమకు నీడనిస్తున్న వృక్షంవంటి వాడు. అతనిపై కోపం పెంచుకోవటం అవివేకమని. ‘ఈ భూజము వంటకట్టియలకై ఖండింపగా నేటికి’ - అందరికీ ఉపయోగపడే వృక్షమిది, నీ వంట కట్టెల కొరకు ఉపయోగపడేవి ఎన్నోఉండగా దీనిని నరికివేయటమెందుకు? ‘అని నిగూఢభాషణముల అ య్యజాతశత్రుడు అనిలజు కోపరసంబు పేర్మి చెఱిచె’ – అని ధర్మరాజు నిగూఢంగా హెచ్చరించగానే భీముడు తనను తాను నిగ్రహించుకున్నాడు.

               ‘అయ్యన్నదమ్ముల చేష్టితములు’ - పరాభూతయై, పరమ దయనీయస్థితిలో ఉన్న ద్రౌపది ఒక్కసారి ధర్మజుని కనుసైగను గమనించింది, భీముడు తనను తాను నిగ్రహించుకోవడం చూసింది, విరాటుడి అసహాయతను గ్రహించింది.  ‘చేష్టితములు తెల్లముగ నప్డు సూచుచు అల్ల లేచి’ - వారి మనోభావము ఆమెకు అర్థమయ్యింది. ‘నాకింక రక్షణ లేదు’ అనుకుంది.

ద్రౌపది భంగపాటు

               ‘ఎలదీగఁ గప్పిన లలిత పరాగంబు క్రియ మేన మేదినీరేణు వొప్ప’ - అక్కడ ఆ రాజ సభామందిరప్రాంగణంలో పడినప్పుడు ఆక్కడున్న ధూళి వల్ల ధూసరితమైన మేను, ‘ఎలదీగఁ గప్పిన లలిత’- ఒక కోమలమైన లతకు పుప్పొడి అంటుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ‘చంపకంబున నవసౌరభం బెసగెడు కరణి నాసిక వేడిగాడ్పు నిగుడ’ – సంపెంగ నుండి సువాసనలు ప్రసరించే విధంగా, శోకంతో, క్రోధంతో, అసహాయతతో, ఒకవిధమైన ఉద్విగ్నభారంతో ఆమె నాసికనుండి వేడి నిట్టూర్పులు వెలువడుతున్నాయి, ‘తోయజదళముల తుది మంచు దొరఁగెడు గతిఁ గన్నుగవ నశ్రుకణము లురుల’ పద్మపత్రాలపై హిమ బిందువులు పరచుకున్నట్లు, దుఃఖాన్ని ఆపుకోలేక కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు కారుతున్నాయి. ‘ఇందుబింబము మీఁది కందు చందంబున గురులు నెమ్మొగమున నెరసియుండ’- కీచకుని చేష్టతో ద్రౌపది ముఖం కళావిహీనమై వసి వాడింది. చంద్రబింబములో వున్న మచ్చ కాంతిని తగ్గించినట్లు కళాహీనమైన ద్రౌపది ముఖంపై ముంగురులు చెదరి కమ్ముకున్నాయి. 

               అయితే ఇక్కడ ఒక చిక్కు వుంది, ఆలంకారిక విమర్శనాదృష్టితో చూస్తే. ‘ఇందుబింబము మీఁది కందు చందంబున గురులు నెమ్మొగమున నెరసియుండ’,-ఎలా? ఇందుబింబం తెల్లగా ఉంటుంది. ద్రౌపది నల్లగా ఉంది. నల్లగా ఉన్న ద్రౌపది ముఖంమీద వ్యాపించిన కురులు కందు లాగ ఎలా ఉంటుంది? చెదరిన ముంగురులు కాంతిమంతమైన ముఖసౌందర్యాన్ని ఇనుమడింప జేసేవే కాని తగ్గించేవిగా కవులు ప్రసిద్ధంగా వాడినట్లు కనపడదు. వెలుగుతున్న నెలరాజు కాంతిని ఆ ‘కందు’, మచ్చ తగ్గించి వుండవచ్చు. కాని ఈ సందర్భంలో పరాభవింపబడిన ద్రౌపది ముఖం కళ తప్పి కాంతి విహీనమై వుంది. ఈ కాంతివిహీనత కీచకుడు చేసిన పరాభవం వల్ల వచ్చింది కాని, ముఖంపై కప్పుకున్న ముంగురులతో కాదు. అలా ముందే కాంతివిహీనమైన ముఖం మీద ‘కందు’ లాగా ‘కురులు’ ఎలా ‘నెరసి(‘నెఱి’ సౌందర్యం) వుంటాయి?

         చంద్రునికి ఉపమానయోగ్యమైన  గుణాలు, చల్లదనం, కాంతి, ప్రసన్నత, ఆహ్లాదం లాంటివి వున్నా, సర్వసామాన్యంగా తెలుపుదనానికి, చంద్రబింబాన్ని ఉపమానంగా చెప్పటం సుప్రసిద్ధమైన కవిసమయం. ‘యా కుందేందుతుషారహారధవళా’, ‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం’, ‘మాహిషం చ శరచ్చంద్రచంద్రికాధవళం దధి’, ఇత్యాది. ఆదిపర్వంలో గరుత్మదుపాఖ్యానంలో, వినత కద్రువలు సముద్ర తీరంలో విహరిస్తూ ఇంద్రుని గుఱ్ఱము, తెల్లని ఉచ్చైశ్రవాన్ని చూచినప్పుడు, కద్రువ వినతతో ‘చూడవె యల్ల యతి ధవళంబైన యశ్వంబునందు సంపూర్ణచంద్రునందు నల్లయుం బోలె వాలప్రదేశంబునందు నల్లయై యున్నది’ అని అంటుంది. ఈ కవిసమయసంప్రదాయాన్ని అనుసరించే తిమ్మన పారిజాతాపహరణంలో శ్రీకృష్ణునితో సత్యభామను ‘ఓ సకలేందునీల శకలోపమ కైశిక’ అని తెల్లని ముఖంపై నల్లని కురులు అన్నాడు. ఇక్కడ సత్యభామ కాంతిమంతమైన ముఖవర్ణనమే కాని కాంతిహీనమైన ముఖం కాదు. 

Player
>>