ద్రౌపది పరాభవం7

త.   కులపవిత్ర సితేతరోత్పల కోమలామలవర్ణయు        

      త్పల సుగంధి లసన్మహోత్పలపత్రనేత్ర యరాళకుం 

      తల విభాసిని, దివ్యతేజము దాల్చి ఒక్క కుమారి త 

      జ్ఞ్వలన కుండమునందు బుట్టె ప్రసన్నమూర్తి ముదంబుతోన్    (ఆది. 7-20)

     యజ్ఞకుండము అనలేదు, ‘జ్వలనకుండము’ అన్నారు. మూడుసార్లు ఉత్పలం అంటే ఎన్నిసార్లు అవమానాలు కలిగినా ‘ఊర్ద్వం పతతి గచ్ఛతి ఇతి ఉత్పలః’ ‘పల’గతౌ ధాతువు అర్థం. ఇది పైకి లేస్తూ ఉంటుంది కాబట్టి ఉత్పలం అయింది. ఈమె కూడా మూడు సార్లు పరాభవింపబడింది. దుశ్శాసనునివలన కురుసభలో, సైంధవునివలన అరణ్యంలో, కీచకునివలన ఇక్కడ విరాటనగరంలో. తరువాత ఆమెకు పరాభవంలేదు. ఋషి కల్పుడు, విద్యాదయితుడు, నన్నయగారి వాణి అలా ఎందుకు పలికిందో మూడుసార్లు ఉత్పలం అని అందుకు తగినట్లుగా జరిగింది.

       కనుక ‘అవ్విధంబున నొప్పి’- ఆవిధంగా నేను జన్మించినా, -‘ఆ స్వయంవరమునాడు అఖిల భూపతులచే అట్లు చూడబడి పాండవుల ధర్మపత్నినై’,- ఆనాడు స్వయంవరంలో వచ్చిన రాజులందరి సమక్షంలో అప్రతిమాన ధనుర్విద్యాసామర్థ్యంగల అర్జునునిచే అనితరసాధ్యమైన మత్స్యయంత్ర భేదనంతో వరింపబడి మన్ననలనొంది పాండవులకు ధర్మపత్నినైన నేను, తరువాత ధర్మజుడు చేసిన  రాజసూయయాగంలో అవభృథస్నానం చేసి పవిత్రనై సన్మాన సత్కారములను గ్రహించిన నేను,–‘గోవిందు చెలియలినై’,–శ్రీకృష్ణుడికి చెల్లెలినై,-‘వీని చేత ఇట్లు పరిభూతనగుచు’,–  ఇంత ఖ్యాతిచెందిన నేను ఈ దుశ్శాసనునిచేత పరాభవింపబడి’, -‘సభామధ్యమున మహీపతులచే చూడంగ బడితి’– ఈనాడు ఈ సభామధ్యంలో ఈవిధంగా చూడబడ్డాను. –‘ఇంత వడుదునె ఇపుడు నాపలుకులకు ఎవ్వరు ప్రతివచనంబు ఏల పలుకరైరి’. నన్నయగారిది సమాసభూయిష్ఠమైన రచన అనుకోవడానికి వీలులేదు. ఆయన సహజమైన భాషలోనే వ్రాస్తారు.

         అదే విధంగా ద్రౌపది ఇక్కడా విరాటరాజు సభలో అడిగింది. ‘కొందరికైన కృపకుం దఱి కాదటె ఏమి చెప్పుదున్’. ‘అనుడు విరాటు డుల్లమున నక్కటికం బొలయంగ అంగనం గనుంగొని’ - విరాటుడికి సైరంధ్రిగా వున్న ద్రౌపది దయనీయమైన స్థితి జాలి కలిగించింది. అయినా ‘కీచకున్ గినియగాఁ దగు సత్వము లేమి చేసి’ - కీచకుని దండించే ధైర్యం లేకపోవటంతో, -‘సాంత్వనములు పల్కి రోషభరితస్థితిఁ గంపితమూర్తి యైన ఆతని మది కుందు వాపిన అతండును పోయె నివాస భూమికిన్’ - ఇంత దురాకృతం చేస్తే రాజు ఊరికే ఉన్నాడు. అని ప్రజలు తనను నిందిస్తారనే భయంతో విరాటుడు ఏదైనా సమాధానం చెప్పాలి కనుక,ఆమెతో సాంత్వనవచనములు పలికి, కీచకునితో, ‘నువ్వు కొంచెం తగ్గు. నేను రాజును కదా! కొంచెం ఏదో నాకు మర్యాద ఇవ్వు. సభామర్యాద ఉంటుంది వెళ్ళు’ అని మెల్లిగా అనునయించి కీచకుని పంపించాడు.

ధర్మజుని ఆదేశం

                 ‘అట్టి అవసరంబున’ అతను వెళ్ళిపోయిన తరువాత ‘శుభలక్షణాంగి ఈ సుందరి సైరంధ్రి యగు టెట్లొకో! యని వగచువారు’ - సభలో అందరూ ఆమె అసహాయస్థితిని చూసి జాలిపడ్డారు. ‘ఇమ్మేని కక్కట ఇట్టిదె సేసెనే మాయదైవంబని మఱగువారు’ - ఎటువంటి పరిస్థితి వచ్చింది మాయదైవమా! ఏమిటి ఈమె చేసిన పాపం? ఏమిటి ఈ దుర్గతి? ‘ఇంత కీడొనరించెనే రాజుచూడ ఈ దుష్టాత్మకుండని దూఱువారు’ - రాజు చూస్తూండగానే ఆ సేనాని ఇంత పనిచేసిపోతాడా! ‘దేవి యుపేక్షయ చూవె ఈయమకు నిప్పాటు వచ్చుట యని ప్రందువారు’ - ‘ఓహో ఈమెకు ఈ స్థితి రావడానికి కారణం మహారాణి సుధేష్ణా దేవే. కనుక ఆమెనే తప్పుపట్టాలి. దేవి ఉపేక్ష చేసింది. లేకపోతే ఈమెను అలా పంపించకూడదు కదా! తమ రక్షణలో ఉన్నవాళ్ళను, పరివారాన్ని ఇటువంటి అవమానాల పాలు చేయాలంటే ఆమెకెంత ఉపేక్ష ఉండాలి?’ అని అందరు అనుకుంటూ ఉండగా, -’అప్పుడు ధర్మసూతి హృదయంబు కలంగ’- చూస్తున్న ధర్మరాజు నిస్సహాయ పరిస్థితిలో ఉన్న ద్రౌపదిని ఉద్దేశించి 

Player
>>