ద్రౌపది పరాభవం8

విరాటమహారాజు ఏమన్నా చెప్తాడేమో అని చూశాడు.

       ఏమీ జరగలేదు. ‘లలాటభాగమున్ కప్పగ ఘర్మవారి’ - నుదుటిమీద స్వేదబిందువులు కమ్ముకున్నాయి. ‘అధికంబగు రోషము నొంది యుండియుం దప్పగ ద్రోచికొంచు తన ధైర్యము పెంపున నిర్వికారుడై’ - ధైర్యము అంటే అచలమైన స్థితి, చెదరనిస్థితి ధైర్యం. కాబట్టి చలించని మనస్సుతో ‘ఎప్పుడు తాను పల్కు యెలుగేర్పడ ద్రౌపదితోడ నిట్లనున్’ – చాలా జాగ్రత్తగా గమనించుకోవలసిన మాట - ఒక ప్రయోగం. ‘ఎప్పుడు తాను పల్కు ఎలుగు ఏర్పడ’ అరణ్యపర్వంలో ఎట్టి విపత్కరపరిస్థితులలోనూ ఆవేశానికి లోనుకాకుండా పలికిన అదే స్వరంతో, అదే శాంతమనస్కతతో ద్రౌపది తోడ ఇలా అన్నాడు. అందరు చల్లబడ్డారు. కీచకుడు వెళ్ళి పోయాడు. ఒక ఐదునిముషాలకు సభ శాంతించింది.

       ఎంత కోపాన్ని అణచుకున్నా తరువాత జరిగే పరిణామాలకు ఎవరో ఒకరు జవాబు చెప్పాలి కదా! అందుకని ఆ స్థితిలో ఉన్న ధర్మరాజు ద్రౌపదితో ‘జననాయకుండు ఈ సభవారు నీదగు ఈ తెరగెల్ల నెరిగిరి’, – ‘చాలు! అందరూ చూశారు’. ఇది ఊరికే చెప్తున్నదా? లేకపోతే కుమిలి, రగిలి పోయిన మనస్సుతో బాధతో వచ్చిన పదమా? ‘తెఱవ యింక మానక ఈ పలుమాట లాడఁగ నేల’, – ‘ఇక చాలు! ఇన్ని మాటలు ఎందుకు? జరగవలసినది ఏదో జరిగిపోయింది’. ‘చనుము నీవు సుదేష్ణసదనమునకు,’ – ‘నీవు సుదేష్ణాదేవి మందిరంలోని సైరంధ్రీవృత్తిలో ఉన్నదానవని అందరికీ తెలుసు. ఇక అంతఃపురమునకు వెళ్ళుము’. –‘నీపరాభవమున కోపింపనేరరే’,– నీ పరాభవం నీభర్తలకి కోపం కలిగించదా?, -‘గంధర్వులకుఁ దఱి గాదుగాక’– ఇది సరైన సమయం కాదేమో! నీభర్తలు నిన్ను రక్షించలేదే అని వాపోతున్నావు కాని వాళ్ళు నిన్ను రక్షించడానికి అనుకూలమైన సమయం కుదరాలి కదా!’, -‘సమయ మెయ్యదియేనిఁ దమకును నీకును మును గల్గినట్లైనఁ గినియ రిచట’, –‘నీకు ఏవిధమైన కష్టం కలిగిందో వాళ్ళు కూడా అట్టి స్థితిలోనే ఉండి ఉంటారు కదా! వాళ్ళు కూడా సమయాన్నిబట్టి నడచుకోవాలి కదా!’. ఇక్కడ ‘సమయం’ చాలా అర్థస్ఫూర్తితో ప్రయోగించిన పదం. ‘సమయం’, కాలము, మరొకటి పాండవులకున్న ‘ప్రతిజ్ఞ’. అందుకే  ‘సమయ మెయ్యదియేనిఁ దమకును నీకును మును గల్గినట్లైనఁ’,- ‘కాన నాథుల దూరఁగ గాదు వినుము’ – వాళ్ళకు వీలైతే ప్రతిక్రియ ఎందుకు చేయరు కాబట్టి వారిని నిందించవద్దు. –‘సతికిఁ దానెంత వడియును సభలోన దడవుగా నిల్చి యిట్టు లుదగ్రవృత్తి శంక చెడి ధిక్కరింపంగఁ జనునె చెపుమ,’ – ఎక్కడైనా స్త్రీలు ఎంత పరాభవం పొందినప్పటికీ ఈ విధంగా సభలో నిలిచి మాటలాడడం సభ్యతేనా? మర్యాదగా ఉంటుందా చెప్పు. నీ భర్తలు మంచివాళ్ళే. వాళ్ళకూ కోపం వచ్చే ఉంటుంది. కాని ఏదో ఒక నిస్సహాయమైన పరిస్థితిలో ఉండిఉండవచ్చు. సమయపాలనా బద్ధులై ఉండిఉండవచ్చు. కాబట్టి ఈ విధంగా ఇక్కడ నిలవవద్దు’.

ద్రౌపది నర్మభాషణం

          ‘అని ఇట్లు సెప్పిన ధర్మతనయుని పలుకులు విని’- ఇవి ఆమెకు అలవాటు అయిపోయింది. పన్నెండేళ్ళ అరణ్యవాసంలో ఆమె ఎగదోయడం, ఈయన చల్లపరచడం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ‘ఎప్పుడు తాను పల్కు నెలు గేర్పడ’ - సరే! ఎప్పుడు ఈయన ఇలాగే శాంత సాంత్వన వచనాలు చెప్తుంటాడు., -‘వెండియు సైరంధ్రి’-, కాని మనస్సులో ఉన్న ఆ పరాభవజనితకోపానలము ఎలా చల్లారుతుంది? అనుభవించింది ధర్మరాజు కాదు, ఆమె కదా! ఒక సానుభూతి వాక్యానికైనా నోచుకోకుండా ఆమె అంతగా అడిగితే ఎవ్వరైనా ధర్మం చెప్పవచ్చు కదా! అవేమీ ధర్మరాజు అనకుండా ‘నువ్వు ఇంక వెళ్ళు’ అని అంటే బాధ కలిగి సైరంధ్రి, -‘ఆచోటు కదలక నిలిచి యెద్ది యేనియున్ పలకదలచినన్’- ఆమె వెళ్ళలేదు. ధర్మరాజు చెప్పిన దానికి సమాధానం చెప్పాలనే సంసిద్ధతతో కనపడింది.    ‘తలంచినన్ జూచి యతండు మఱియు నిట్లనియె’- ధర్మరాజు ముందు సూక్ష్మంగా ‘నీవు సుదేష్ణ పాలి కరుగుము’ అని చెప్పాడు. ఆమె ఇంకా నిబ్బరించుకుని ఏదో చెప్పాలనుకుంటున్నది. ఈ చెప్పడంలో మర్యాదాతిక్రమణం జరిగితే ఏ విధంగా ఉంటుంది? కనుక ఆమెకు చెప్పవలసిన విషయాన్ని ఒక ఉన్నతవంశస్థురాలైన స్త్రీకి చెప్పవలసిన భాషలో చెప్పరాదు. ఎందుకంటే అమె సైరంధ్రీవృత్తిలో ఉన్నది. కాబట్టి ఏ విధంగా 

Player
>>