ద్రౌపది పరాభవం9

చెప్పవలెనో ఆవిధంగా చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది.

         ధర్మరాజుకు ద్రౌపదిని ఏవిధంగా సంబోధించి చెప్పాలో ఆవిధంగా మాట్లాడితే వెంటనే ఆ పరిస్థితిలో ఔచిత్యం చెడిపోతుంది. సేవా ధర్మంలో ఉండేవారితో ఒక ధర్మాధికారి హోదాలో ఉన్న ధర్మరాజు, రాజుకు సన్నిహితుడై, రెండవ పురోహితుడి స్థానంలో ఉన్న కంకభట్టుగా ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా చెప్పాడు. ‘పలు పోకలపోవుచు విచ్చలవిడి నాట్యంబు చూపు చాడ్పున ఇచటన్ కులసతుల గఱువ చందము దొలఁగఁగ నిట్లునికితగునె తోయజవదనా’,– ‘ఏమనుకుంటున్నావు నీవు? జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. అతను వెళ్ళిపోయాడు. నిన్ను నీ స్థానానికి వెళ్ళమంటే వెళ్ళకుండా ఇంకా నిలబడి మాట్లాడవలసిన అవసరం ఏమిటి?’,  -‘పలుపోకల పోవుచు’ - నువ్వు నిలబడిన తీరు, పలికిన తీరు చూస్తుంటే, -‘నాట్యంబు సల్పు’ - ‘నర్తకులు హావభావప్రకటనలు చేస్తున్న విధంగా ఉన్నది. కులసతులు మర్యాదతో మెలగాలి కదా! నాట్యరంగంమీద నర్తించే ఒక నటివలె నీవు ప్రవర్తించవలసిన అవసరం ఏముంది?’ అని అనగానే ద్రౌపది, ‘అనిన పాంచాలి సాభిప్రాయంబుగ నిట్లనియె’.

       ఆ మాటను అర్థం చేసుకుని తన అభిప్రాయం తెల్లమయ్యేట్లుగా, ‘నాదు వల్లభుండు నటుడు’– ‘నిజమే నా భర్త నటుడే!’, -’ఇంత నిక్కంబు’–, ‘ఇది నిజమే’. ఏ భర్త నటుడు ఇక్కడ? అర్జునుడు నటుడు. నర్తనశాలలో అందరికీ నాట్యం నేర్పిస్తున్న ఆ భర్త నటుడే గదా! ధర్మరాజును గురించి కాదు. నా భర్త అర్జునుడు నాట్యం నేర్పిస్తున్నాడు కనుక నటుడు. ‘పెద్దవారి యట్ల పిన్నవారు గాన’- ‘వాళ్ళు నా భర్తలు కాబట్టి భర్తలని అనుసరించాలి కదా!’, ‘పతుల విధమ కాక’  ‘నేను కూడా ఆ రీతిలోనే’, -‘ఏను శైలూషిఁ గాననంగ రాదు కంకభట్ట’ – ‘నా భర్త నటుడైనప్పుడు భర్తలను అనుసరించిపోవాలి కాబట్టి నేను కూడా నన్ను శైలూషిని - నటిని అనుకోవడానికి అభ్యంతరం లేదు. నా ధర్మాన్ని నేను నెరవేర్చుతున్నాను’. శైలూషి అంటే నటి.’ ‘శైలూషిక’ - నాట్యరంగంలో ఉన్న పాత్రల్ని అభినయించే  స్త్రీ. శైలూషుడు అంటే నటుడు. “నాదు వల్లభుండు నటుడింత నిక్కంబు పెద్దవారి యట్ల పిన్నవారు’ అని, ‘అట్లగుటం జేసి నాకు నాట్యంబును పరిచితంబ’– ‘ఆ విధంగా చూస్తే నాకు నాట్యం పరిచయమే!’

          నృత్తం, నృత్యం, నాట్యం మూడువిధాలు. ‘భావాభినయహీనం తు నృత్త మిత్యభిధీయతే’ - అని నాట్యశాస్త్రంలో చెప్పిన లక్షణము. భావము, అభినయం లేకుండా అవయవాల కదలికలచేత ప్రదర్శించేది ‘నృత్తం’ అవుతుంది. శుద్ధ నృత్తం. ఒక గీతాన్ని తీసుకుని ఆ నాదానికి అనుగుణంగా శరీరచలనంతో అందులోని భావాన్ని అభినయించి చూపేది ‘నృత్యం’ అవుతుంది. లోకంలో ప్రసిద్ధమైన ఇతివృత్తాన్ని ఒక పాత్రద్వారా ప్రదర్శింపచేసేది ‘నాట్యం’ అవుతుంది. నాట్యం - నాటకం. కాబట్టి ఈమె ‘నాట్యంతో ఏపాత్రను ఎలా అభినయించాలో నాకు తెలుసు’ అంది.

         మనుచరిత్రలో ఒకానొక సందర్భంలో, ఇందీవరాక్షుడు అనే గంధర్వుడు ఒక గురువు దగ్గర చేరి తనకు ఆయుర్వేదవిద్య నేర్పించమని అడుగుతాడు. ‘నీవు ఎవ్వడవు?’ అని గురువు అడిగితే తాను ఫలానా గంధర్వుడనని చెప్పుకుంటాడు. గంధర్వులు విలాసాలలో మునిగితేలుతూ ఉంటారు. ‘నటవిట గాయక గణికా కుటిలవచశ్శీధురసము గ్రోలెడు చెవికిన్ గటువీ శాస్త్రము’ – ‘నీవు ఎప్పుడూ నాట్యం వగైరాలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ, సంగీతాన్ని వింటూ ఉంటావు కాబట్టి ఈ ఆయుర్వేద శాస్త్రము అనేది నీ చెవికి కటువుగా వినిపిస్తుంది’. ‘వలదిచ్చట నిన్ను చదివింపకున్న జరుగదె మాకున్’ – ‘నిన్ను చదివించకపోతే మాకు గడవదా?’ అని పంపివేస్తాడు. నటవిట గాయక గణికాదులకు సభ్య సమాజంలో చిన్నచూపు. ఆ విధమైన స్థానం ఉంది. 

         ధర్మరాజు గూఢార్థప్రతిపాదకమైన మందలింపుకు సమాధానమిస్తూ అదే విధంగా ద్రౌపది, -‘మత్పతి శైలూషుండ గాడు’ – ‘నా భర్త కేవలము నటుడే కాదు, -‘కితవుండును’ – జూదరికూడా.  ‘కావున జూదరి ఆలికి గఱవచందం బెక్కడిది’,– ‘ఏదో కులసతులు అన్నావు గదా! నా భర్త నటుడు మాత్రమే కాక జూదరి కూడా. కనుక జూదరి భార్యకు ఉచితమైన ప్రవర్తన ఎలా ఉంటుంది’ అంటూ అక్కడినుండి వెళ్ళిపోయింది. 

Player
>>