సుధేష్ణ ఓదార్పు1

సుదేష్ణ ఓదార్పు

               ‘నన్నిటులా దురాత్ము సదనంబునకుం జనుమన్న జంతకు’- ‘నేను ఎంత చెప్తున్నా వినకుండా నన్ను దుష్టుడైన కీచకుని ఇంటికి పంపించిన ఆ సుదేష్ణ దగ్గరికి పోయి’, -’ఈ బన్నము లన్నియుం దెలిపి ప్రయ్యిడనే’ - ‘జరిగిన పరాభవాన్నంతా చెప్పి నాకెందుకు ఇటువంటి స్థితి కల్పించావు అని ఆమెను నిలదీస్తాను’. అనుకుని ద్రౌపది దుమ్ము కొట్టుకున్న శరీరంతో, విషణ్ణ వదనంతో, వీడిపోయిన కేశభరంతో, దైన్యానికి ప్రతిరూపంగా సుదేష్ణ వద్దకు బయలుదేరింది. ‘చనిన న య్యెలనాగయు,’– ద్రౌపదిని చూచి సుదేష్ణ ఏం తెలియనట్లుగా, -’సంభ్రమంబు దెచ్చుకొని,’- ఆశ్చర్యం తెచ్చుకొని, స్వయంగా కలిగిన ఆశ్చర్యం కాదు, తెచ్చిపెట్టుకున్న ఆశ్చర్యంతో ‘తా నెఱుంగని తెఱగుఁ దాల్చి’- తనకేమీ తెలియదనే అమాయికత్వాన్ని ప్రదర్శిస్తూ, -’శాఠ్యమున నుమ్మలించి’,- కపటమైన దుఃఖాన్ని తెచ్చి పెట్టుకుని ‘ఉమ్మలించి పాంచాలి తోడ ఎలుగు వేరొక భంగిగా ఇట్టులనియె’- డగ్గుత్తిక చెందిన స్వరంతో సైరంధ్రితో ఇలా అన్నది.

               ‘ధరణీ పరాగంబు వొరసి ధూసరితమై చేడియ నీ మేను చెన్ను దఱిఁగెఁ’- నీ శరీరం అంతా దుమ్ము కొట్టుకుపోయింది, ‘ఏది కారణమున ఎవ్వ రెచ్చోట నీ కేమి కీ డొనర్చిరి’- ఏకారణంగా నీకింత కీడు ఎవరు తలపెట్టారు?, -‘వారిఁ జంపుదు నొంపుదు భంగపఱుతు నిడుమ పఱతు చెఱుతు’- సాంత్వనవాక్యాలు పలుకుతున్న సుదేష్ణను ద్రౌపది తీక్ష్ణంగా చూసిందేమో! సుదేష్ణ పదాలన్నీ తడబడ్డాయి. ‘చంపుదు నొంపుదు భంగపఱుతు నిడుమ పఱతు చెఱుతు’ అన్ని ప్రతిక్రియలూ గబగబా చెప్పింది. అని ‘ఇత్తెఱంగు నాకుం జెప్పుమనిన’ - జరిగిన విషయాన్ని తనకు చెప్పమని అడుగుతున్న సుదేష్ణను ద్రౌపది మౌనంగా ఒక చూపు చూసి, ‘నీ వెఱింగియు నెఱుగమి భావించిన ఇంక నేమని పలుకం గలదాన,’- నీకు అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్లు నటిస్తే నేను ఏమని చెప్పగలను?’, -’అయినను వినుము’- అయినా వినాలనుకుంటున్నావు కాబట్టి చెప్తాను విను.’ అని సైరంధ్రి యిట్లనియె.’

               ‘నను నీవప్పుడు సూతుమందిరమున న్మద్యంబుఁ దెమ్మన్న,’- ‘నీవు ఆ కీచకుని మందిరంలో మద్యం తెమ్మని పంపినప్పుడు,’ ‘పోయిన ఆతం డవినీతి చేసినను’- ‘అతడు నన్ను అవమానించబోతే నేను,’ ’చేయీక’- అవకాశాన్ని ఇవ్వక, ‘మత్స్యావనీశునాస్థానము దిక్కు వే చనిన’ - కీచకుని బారినుండి తప్పించుకోబోతూ విరాటమహారాజుకొలువువైపు వెళ్ళాను.’ ‘అచ్చో’ -అచ్చట, ‘తీవ్రకోపంబున న్వెనుకన్ గూడఁగ ముట్టి’ - కీచకుడు నన్ను తరుముతూ నా వెనుకనే వచ్చి ఉచితానుచితాలు మరచి, ‘పట్టికొని తన్నెం బల్కు లిం కేటికిన్’- నన్ను పట్టుకుని క్రిందపడవేసి తన్నాడు. ఇంతకంటే నేనేం చెప్పగలను’. అని, ‘ఏర్పడం బలికిన’. ద్రౌపది మాటలకు సుదేష్ణ సమాధానం చెప్పాలి కదా! ‘ఖేదముదక్కు,’- ‘నీవు దుఃఖాన్ని విడిచిపెట్టు.’ ‘ఈ క్షణమ ఆ కీచకు దండితుఁ జేసి నీకు ఆహ్లాదమొనర్తు నేనని నయంబున కేకయ రాజపుత్రి అత్యాదర వృత్తితో అనునయం బొనరించిన,’- ‘అలాగా? నీవు బాధ పడవద్దు. ఇప్పుడే ఆ కీచకుడిని నేను దండించి ఉచితమైనరీతిలో శిక్షించి నీకు సంతోషాన్ని కలిగింపచేస్తాను’.

అని సుదేష్ణ పలికిన మాటలను విని ‘పాండుసుతవల్లభ ఆలముచేసి ఇట్లనున్’.ద్రౌపది ‘నువ్వు అతడిని ఏమి చేయగలవు’ అని నిర్లక్ష్యంగా చూసి, ‘నీవింత యలుగ నేటికి’, -”ఓ సుదేష్ణాదేవీ! నువ్వింతగా కోపించనక్కరలేదు’. ‘నా వంతయుఁ బౌరజనమనః ఖేదము’ - నాదే కాదు అక్కడ సభలో ఉన్న పౌరజనుల ముఖకవళికలల్లో గోచరించిన వారి మనోభావాలను నేను గమనించాను. వాళ్ళందరి ఖేదము, నా దుఃఖానికి’, ‘ఒక్కావంత ద్రిక్కకుండఁ గళావంతులు మత్పతులు కలరు పగదీర్పన్,’- ‘నా భర్తలు ఉన్నారు. వారు తగిన రీతిలో ప్రతీకారం తప్పక తీర్చుకుంటారు. నువ్వింతగా శ్రమ పడనక్కరలేదు.’ -’అనిన సుదేష్ణయుఁ దత్పరిజనములు వెఱఁ బొంది,’- ద్రౌపది అన్న మాటలకు ఆమె గుండెల్లో రాయి పడింది. ‘ఎన్ని సాంత్వనములు సెప్పినఁ దేఱద మజ్జన భోజనములకుం జొఱద ద్రుపదసంభవ యెట్లున్’- సుదేష్ణ ఎన్ని విధాలుగా నచ్చచెప్పినా వినక, భోజనం చేయక కోపంతో వెడలిపోయింది.

Player
>>