కీచకవధకు ప్రణాళిక 10
రుధకృచ్చాత్ సుష్వాప రజనీచరం’ - వాడిని సంహరించే వరకు నిద్ర లేదని ‘యైషా నర్తనశాలేహ’ - అదే నర్తనశాలకు తీసుకొని వచ్చారు. ‘ఇహ మత్స్యరాజేన కారితా’ - మత్స్యరాజు ఉత్తర నాట్యశిక్షణకోసం నర్తనశాలను నిర్మించాడు. ఇందులో ‘దివాత్ర కన్యా నృత్యంతి’ - ఉదయము కన్యకలు నాట్యం చేస్తారు. ‘రాత్రౌ యాన్తి యథా గృహమ్’ - రాత్రి వారివారి ఇళ్ళకు వెళ్ళిపోతారు. నిర్మానుష్యంగా ఉంటుంది కనుక, ‘తత్రాస్తి శయనం దివ్యం’ - ఆ ప్రదేశం అనువైనది. తిక్కనగారు దానిని తెలుగు జేయలేదు. ‘తత్ర అస్తి శయనం దివ్యం’అక్కడ వాడిన మాట ఇది. ఆ కీచకుడికి అదే దివ్య శయనం, అంటే వాడిని పైలోకం పంపటానికి అనువైన ప్రదేశం. ఆ నర్తనశాలలో ఉదయమంతా ఈ కన్యలు వచ్చి కేళీవిలాసాలు సలుపుతూ నాట్యవిద్యను అభ్యసించి సాయంత్రము వెళ్ళిపోతారు. నాట్యానికి అనుగుణమై విశ్రాంతి అవసరమైన స్థితిలో శయనమందిరం కూడా ఉన్నది. ఆ శయనం దివ్యమైనది. బ్రహ్మాండమైనది. ‘దివ్యం ధృఢాంగం’ - ఆ శయనం చాలా దృఢంగా వున్నది. ‘సుప్రతిష్ఠితం’ - చక్కగా నిలకడ కలిగినది. అక్కడ ‘తత్రాస్య దర్శయిష్యామి’ ఆ శయనంమీద ‘అత్ర దర్శయిష్యామి’ - వాడికి ‘పూర్వ ప్రేతాన్ పితామహాన్’ - వాడి తాతలను చూపిస్తాను. అక్కడ వ్యాసులవారి హాస్యరేఖ ఇది.ఆ మంచం ఉంది చూశావా ‘దివ్యం’ - వాడు దేవలోకానికే పోవాలి. ‘సుదృఢం’ - వాడికి ఎంత బలమున్నా, ‘సుప్రతిష్ఠితం’ - కదలకుండా ఉండే ఆ మంచంపై ‘తత్ర దర్శయిష్యామి’ - అక్కడ వాడికి వాడి తాతలను చూపిస్తాను. అని చెప్పి జాగ్రత్తగా పంపించాడు. ‘పెనకువ దనిసిన తనువు లొండొంటితోఁ గీలించి నిద్రించి మేలుకాంచి తరుణులుఁ బతులు వాతాయనంబుల’ - ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు.
సీ. నీరజాకరములు నిష్ఠమైఁ జేసిన భవ్యతపంబున ఫల మనంగ
దివసముఖాభినం దితచక్రయుగ్మకం బుల యనురాగంపుఁ బ్రోవనంగ
హరిహరబ్రహ్మమహానుభావంబు లొక్కొటి గాఁగఁ గరఁగిన గుటిక యనఁగ
నతులవేదత్రయ లతికాచయము పెను పొందఁ బుట్టెడుమూల కంద మనఁగ
తే. నఖిలజగముల కన్దెఱ యగుచు జనస
మాజకరపుట హృదయసరోజములకు
ముకుళనంబును జృంభణం బునునొనర్చి
భానుబింబంబు పూర్వాద్రి పై వెలింగె. (విరాట. 2-241)
సూర్యోదయం అయ్యింది. ఆ సూర్యోదయాన్ని తిక్కనగారు బ్రహ్మాండంగా వర్ణించారు. ఈ ప్రభాతవర్ణన మూలంలో లేదు. ఆ వర్ణనను శృంగారరసోద్దీపపరంగా చేశారు తిక్కనగారు. ‘నీరజాకరములు నిష్ఠమైఁ జేసిన భవ్య తపంబున ఫలమనంగ’ - ఈ పద్మాలు తాము చేసుకున్న తపస్సుకు ఫలితమేమో అన్నట్లు సూర్యుడు ఉదయించాడు.
ద్రౌపది కీచకుని నర్తనశాలకు రమ్మని చెప్పుట
‘ఇట్లు సూర్యోదయము అగుటయు సమయ సముచిత కరణీయంబులు వేగిరంబ నడపి వేగిరపాటుతో సింగారంబు సేసికొని సింహబలుండు’ - ఈ రాత్రి ఈమెకు ఇలా గడిస్తే వాడికి కూడా ఉద్విగ్నతతో గడచింది. చేతివరకూ వచ్చి తప్పించుకుపోయిందే అనే బాధతో వాడికి నిద్రపట్టలేదు. సూర్యోదయం కాగానే లేచి సింగారం చేసుకొన్నాడు.
క. తనమదిఁ గదిరిన తమకం
బున జిడిముడి పడుచు ద్రుపదపుత్రికపై నూ
నిన వేడ్క దిగువ నొకటియుఁ
గనుఁగొన వినలేక మదనకంపితు డగుచున్’ (విరాట. 2-243)