కీచకవధకు ప్రణాళిక 11

కీచకుడికి మరేదీ కనబడటం లేదు, వినపడటం లేదు. ‘కామాతురాణాం న భయం న లజ్జా’ ఈ సూక్తికి పరమోదాహరణప్రాయంగా నిలిచిన కీచకుడు ‘అతిత్వరితంబ సుదేష్ణ మందిరంబున కరుగుచు నతరంగంబున’ - అక్కగారి భవనానికి వెళుతూ మనసులో ఈ విధంగా అనుకున్నాడు.

ఉ.           చయ్యన నేగి అంబుజ విశాలవిలోచనఁ గాంచి ప్రీతిమై    
               నయ్యెడ నేకతంబ హృదయం బలరం దగఁ బల్కి యొక్క మై        
               నియ్యకొనంగ చేసి యెలయించెద నిక్కకుఁ దార్చి నేర్పునన్          
               శయ్యకుఁ దెచ్చెదన్ కుసుమసాయకు పూనికి నేఁడ దీర్చెదన్
                                                                                     (విరాట. 2-245)

               ‘చయ్యన నేగి అంబుజ విశాలవిలోచనఁ గాంచి ప్రీతిమై’ - ఆమెను చూచి, ఎలాగో మనస్సు చిక్కబట్టుకుని, నెమ్మదిగా మాటలాడి, ఒప్పించి, నావాంఛను తీర్చుకుంటాను. ‘అని యువ్విళ్ళూరుచు వెసఁ జని కేకయరాజపుత్రి సదనంబున న య్యనిమిషచారువిలోచన’ - ద్రౌపది. రాత్రి ఆమె కంటిపై రెప్పపడలేదు కదా! దేవతాకాంతలతో సమానమైన సౌందర్యం అని బాహ్యార్థమైనప్పటికి అంతరార్థం ఆమె కనురెప్ప మూతపడలేదు. ‘అనురూప విధాననిరతయై యుండగన్’ - తనకు అనురూపవతిలా అక్కడ ఉండటం చూసి, ‘కనుఁగొనని యప్డు గ్రొత్తయగు కౌతుకవృత్తి మునింగి’ - నూతనోత్సాహం తెచ్చుకొని ద్రౌపది వద్దకు వెళ్ళాడు. ‘చనుటయు ద్రౌపది యతనిం గనియుఁ గానని విధంబు గైకొని’ - ద్రౌపది అతనిని చూసీ చూడనట్లుగా ప్రవర్తించింది. ‘చిత్తంబున బెదరక’ - ఆమె మనసులో ఇప్పుడు భయం లేదు. ఎందుకంటే ‘తత్రాస్య దర్శయిష్యామి’ అని భీముడు మాట ఇచ్చాడు. కాబట్టి, తన ముందటి పని వెరవున నుండె భీము పలుకుల యూతన్’ - నిర్భయంగా తన పనులు చేసుకుంటోంది.

               ‘అట్టి యెడ’ - అప్పుడు ‘ఎవ్వరితో నైన నెలుగెత్తి యొక్కింత పనిలేని వెంగలి పలుకు పలుకు’ – ఏ పనిలేకున్నా అక్కడున్నవారితో ఏవో వృధా మాటలు మాట్లాడుతూ, ‘బహుప్రకారంబులగు దుర్విలాపంబులు సేయుచు న ద్దురాత్ముండు ద్రుపదరాజనందన డాయం బోయి’ - ఆ దురాత్ముడు సైరంధ్రి వద్ద చేరి, ‘భాగ్యముగాదె నీచరణపద్మము లెప్పుడుఁ జేరికొల్వఁగా యోగ్యత గల్గెనేని’ - ‘నీ లేత అరవిందాల వంటి ఆ పాదాలను సంవాహనం చేసే ఆ సౌఖ్యము ఎవరికుంటుంది?,’ ‘నను నొక్కని నొల్లవొ’ - నేను ఒక్కడినే నీకు నచ్చలేదా? ‘కామసౌఖ్య వైరాగ్యంబు నీ మనంబునం దిరంబొఁ’ – లేకపోతే శరీరధర్మానికి సహజమైన కామసౌఖ్యం గురించిన ఆలోచన నీకు లేదా? ‘నిజం బెరుగంగఁ ప్పు సౌభాగ్యముఁ గుందునే మగలపై నొక యించుక చూడ్కి నిల్పినన్’- పురుషులమీద కొంచెం చూపు సారిస్తే నీ అందమేమైనా తరుగుతుందా? ‘ఆలము సేసి నా తగుల మారడిఁ బుచ్చఁగ’ - నువ్వు నా ఓపికను పరీక్షిస్తున్నావు. ‘రాజుల నెల్ల నుగ్ర సమరంబున వ్రేల్మిడి నోర్చి పేర్చి ఈ భూజనకోటికి నెపంబిడి విరాటునకున్ తగ కూడుపెట్టెదన్’- యుద్ధంలో రాజులను సంహరించి, ఈ రాజ్యానికి, ఆ విరాటుడికి కూడు పెట్టేది నేనే. ‘నీ వొకతవేల యిలఁ బదివేవుర నే వలచి పట్ట’- నీలాంటివాళ్ళను పదివేలమందిని నేను వలచి పట్టుకున్నా, ‘అడ్డంబై వచ్చి వలదు నా నిం దేవాడు మగండు’ - ‘అడ్డుపడి ఈ పనిచేయవద్దు అనే మగవాడెవడు? అంత పౌరుషం సాహసం ఎవరికీ లేదు. ‘దీని నెఱుఁగవ కంటే’,- ఇది నీకర్థం కావటం లేదు. నన్ను అడ్డుపెట్టేవాడు లేడు. ‘విరటుఁడు సూచుచుండ’ - ఆ విరాటరాజు కళ్లముందే, ‘నిను వేవుర ముందట అట్లు ద్రోవ’ - అంతమంది ముందు నిన్నలా పడవేసినా, ‘ఒక్కరుడును గాదుఁ గూడ దనగల్గెనె’- ఒక్కడన్నా నోరు విప్పాడా? ‘పోటరులైన భర్తలు ఏవురు గలరంటివి’- బలవంతులు, శక్తిసంపన్నులు అయిన భర్తలు అయిదుగురున్నారన్నావు’, ‘వారి యలవుం జలముం గడగంటి’- వాళ్ళ పరాక్రమము ఎటువంటిదో కూడా చూశాను, ‘ఇంక నెవ్వరు కల రెట్లుఁ దప్పె దనివారణఁ బట్టెద నెందుఁ జొచ్చినన్’- ఇంక నిన్ను ఎవరు కాపాడగలరు? నువ్వు ఎక్కడ ఉన్నా నేను చేపట్టగలను. 

Player
>>