కీచకవధకు ప్రణాళిక 12

అనిన –‘నవ్వెలంది వీఁడు దమకించి యున్నవాడు నా యంత్రించు మాటలకు మున్న కదియం బడినఁ గర్జంబు దప్పునని విచారించి’ - ఆ మాటలకు ద్రౌపది వీడు మంచి తమకంతో ఉన్నాడు కనుక నేను చెప్పేదానికన్నా ముందే తొందర పడితే, పథకం పాడై పోతుందని ఆలోచించి,

తే.           బహువిధంబుల నమ్మెయిఁ బలుకు నతని
              
పలుకు లేర్పడ విని మెత్తఁబడినయట్లు
              
సుభగ మెయివడిచూపుగాఁ జూచి తనదు
              
హృదయ మెఱిఁగించు తెఱఁగున నిట్టులనియె.                (విరాట. 2-259)

               నచ్చకపోయినా నచ్చినట్లు చూపించాలంటే ఆ ప్రకటించడమనేది కేవలము తరుణుల సొత్తేమో? సహజమైన నైసర్గికప్రవృత్తి. ‘అతని పలుకు లేర్పడ విని మెత్తబడిన యట్లు సుభగ మెయివడి చూపుగా’ - అతని మాటలు చక్కగా విని ఒకింత మెత్తబడిన విధంగా, ఆద్రౌపది ‘మెయివడి చూపుగా’, అంగీకారం తోచే విధంగా, ‘తనదు హృదయ మెఱిఁగించు తెఱఁగున నిట్టులనియె’ - కీచకునికి తన హృదయం తెలియవచ్చేట్లుగా ఇలా పలికింది.

                        ‘వలదని ఎంత సెప్పినను వావిరివై కడు వేగపాటుమై బలుమఱు నెల్లెడన్ దొడర బాఱెదు’ - వద్దని ఎంతచెప్తున్నా వినకుండా పరిస్థితులను గమనించకుండా ఉన్నావు. ఈ చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు. బహిరంగంగా నీతో నేనెలా మాట్లాడగలను? ‘నీ హృదయంబు నట్ల కాఁదలఁపు’,- నీ హృదయం కూడా అలాగే సమ యాసమయాలు గమనించని వేగిరపాటుతో వున్నట్లుంది. ‘మనోజు తూపులకు దక్కటి చిత్తములన్ కడంగి’- తన వికారానికి అంత బలహీనతతో, చిత్తస్థైర్యం ఏ మాత్రం లేక, ‘విచ్చలవిడి చేత కర్జమె? విచారము గోర్కికి గాని వావియే?’ విచ్చలవిడిగా ప్రవర్తించడం ఉచితమైన కార్యమా? విచక్షణాసహితమైన ఆలోచనకు కోరికకు పరస్పరం ఆధార ఆధేయ సంబంధం, ఆ కోరిక నెరవేర్చుకోవటానికి అనువౌతుందికదా. ఇక్కడ ద్రౌపది రెండు విధాలుగా చెప్పింది. ఆమె చెప్పేది వాడికి బుద్ధి చెప్తున్నట్టుంది. వాడర్థం చేసుకునేది విచారము. కొంచెం సమయం సందర్భం గమనించుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు జరిగే పని కాదు అనే. 

Player
>>