కీచకవధకు ప్రణాళిక 2

ఆక్రమించుకుని విరాటరాజు సంపదతో, సుస్థిరమైన రాజ్యాన్ని స్థాపించుకోగలిగాడు. ‘తం ప్రాప్య బలసంమత్తం విరాటః పృథివీపతిః జిగాయ సర్వాం శ్చ రిపూన్ యథేంద్రో దానవా నివ’ - వాడి సహాయంతో ఇంద్రుడు దానవుల్ని గెలిచినట్లు విరాటుడు శత్రువులను అంతం చేసి ఒక సుస్థిరస్థానం ఏర్పాటు చేసుకున్నాడు. కనుకనే ఈ కీచకునికి అంత ప్రాబల్యం, ప్రభుత్వం, అహంకారము, అధికారము. కనుకనే ఎంత మాత్రము శంకించకుండా ఈ విధమైన ప్రవర్తనతో నిలిచాడు.

      ‘ప్రబలుం డారయ సింహబలుండు’ - ‘ఇటువంటి సింహబలుడు చేసిన అవమానానికి ద్రౌపదీ మాత్రం ఏం చేస్తుంది? మనస్సు సరిపెట్టుకుని మిగిలిన దినాలను గడపాలా! కీచకుడికి ప్రతిక్రియ చేయవలసిన అవసరం లేదా? కీచకుడు దుర్యోధనునివంటివాడు కాదే? తరువాత యుద్ధంలో ఎప్పుడో పగతీర్చుకోవటానికి. ఇప్పుడే కీచకుడు చేసినపరాభవానికి ప్రతిక్రియ చేయవలసిన అవసరం ఉంది. ఇందుకు ఎవ్వరిని నమ్ముకోవాలి?’. ‘కిం కరోమి’ - ‘నేను ఏం చేయగలను,’ ‘క్వ గచ్ఛామి’ - ఎక్కడికి పోతాను?  సైరంధ్రీవృత్తి మానుకొని ఎక్కడికైనా ఎలా వెళ్ళ గలదు? ఏం చేయాలి? ‘కిం కరోమి? క్వ గచ్ఛామి? కథం కార్యం భవే న్మమ?’- నా పగ ఎలా తీరుతుంది?  అని ఆమె, -’ఇత్యేవం చింతయిత్వా సా భీమం వై మనసాగమత్’. అమెకు ఒక్కడే గుర్తుకు వచ్చాడు.

      ఈ పరిస్థితిలో నా మనఃఖేధాన్ని మాపగలిగినవాడు ఒక్క భీముడే, అర్జునుడు సమర్థుడైనా చేయగలిగిన స్థితిలో లేడు. భీముడు ఒక్కడే నా బాధను నివారించగలిగినవాడు. ‘నాన్యః కర్తా ఋతే భీమా న్మమాద్య మనసః ప్రియమ్’ - భీముడికన్నా నా పగచల్లార్చేవాడు ఇంకొకడు లేడు. ‘త ముత్థాయ రాత్రౌ’ - కాబట్టి ఆ భీముడికోసం  ఆ రాత్రి అందరూ విశ్రమించిన సమయంలో ఆమె లేచి అక్కడికి వెళ్ళింది. వలలుడు వంటశాలలో ఉన్నాడు. పరిజనములందరూ నిద్రిస్తుండగా ‘ఇట్లూహించి రాత్రి సమయం బగుట సమస్త జనంబులు గ్రమంబున నిద్రయుం దొడంగిన తానును శయ్యాతలంబు విడిచి మేను ధూళి కడిగి’ - ధూళిధూసరమైన తన శరీరాన్ని శుభ్రం చేసుకుని ‘ధౌతపరిధానపరీతయై’ - ‘పరిశుభ్రమైనవస్త్రం ధరించినదై’, ‘మహానస గృహంబున సుప్తుండైన వృకోదర కడకున్ జని’ - వంటశాలలో శయనించిన భీముని వద్దకు వెళ్ళింది.

ద్రౌపది ఆవేదన

      ద్రౌపది మహానసానికి వెళ్ళేసరికి భీముడు హాయిగా నిద్రిస్తున్నాడు. తనకు విరాటసభలో జరిగిన పరాభవాన్ని చూసి అంతగా ఆవేశపడినవాడు నిశ్చింతగానిద్రించడాన్ని చూసి, ‘నన్ను పరాభవించి సదనమ్మునకుం జని కీచకుండు మున్నున్న తెఱంగు దప్పక సుఖోచిత శయ్యను నిద్ర సేయ’, ‘ఆ కీచకుడు నన్ను పరాభవించి ఏమీ జరగనట్లు వాడి ఇంటికి వెళ్ళి సుఖంగా నిద్రిస్తుంటే నా దుస్థితిని ప్రత్యక్షంగా చూసిన నీవు, భర్తగా రక్షించవలసిన స్థానంలో ఉండి కూడా, ‘నీ కన్ను మొగుడ్చు నూఱటకుఁ గారణ మెయ్యది? భీమసేన!’ ‘ నిశ్చింతగా ఎలా నిద్రిస్తున్నావు?, ‘మీ యన్న పరాక్రమంబు వలదన్న నొకో దయమాలి తక్కటా’ - ‘మీ అన్నగారు నీకు చేసినట్టి బోధలు బాగుగా తలకెక్కినందువలన నామీద దయలేకుండా ఉన్నావా!’, ‘అనుచు మందమంద సంభాషణంబుల సంబోధించు పాంచాలి పాణి స్పర్శంబున మేలుకొని’ - అని ద్రౌపది మెల్లిమెల్లిగా మాట్లాడుతూ తాకగా ఆ స్పర్శకు భీముడు మేలుకొన్నాడు.

    ద్రౌపది వచ్చిన కారణం భీముడికి తెలీదా? తెలుసు! తెలిసినప్పటికీ, ‘అమ్మానిని ఎలుంగెఱింగి భీమసేనుండు యాజ్ఞసేనికి కీచకుదురాచరణంబు నాకుఁ బ్రకటించి వాని నిర్జింప నియోగించునదై అరుగుదెంచె’ - కీచక సంహారంకొరకు తనను ప్రేరేపించడానికి ఆమె వచ్చి ఉంటుందని తలచినప్పటికీ, ఆ సంగతి ఆమె నోటి వెంట వినాలనే కోరికతో, -’ఇంత ప్రొద్దేల ఇచ్చోటి కేగుదేరఁ గారణం బేమి’,- ‘ఇంత రాత్రిపూట ఈ విధంగా ఇక్కడకు రావడానికి గల కారణమేమి,’ ‘యనిన నయ్యింతి యిట్లను నతనితోడ’ - ద్రౌపది వివేకవంతురాలు. అన్నీ తెలిసి భీముడు తనను అడుగుతున్నాడని గ్రహించి భీమునితో ఈవిధంగా పలికింది. ‘ఎఱిఁగి యెఱింగి నన్నడుగ నేమిటికి?’ - అన్నీ తెలిసి కూడా నన్ను ఇలా అడగడం భావ్యమేనా? -’అప్పుడెఱింగి ఇంతకు న్మరచుట 

Player
>>