కీచకవధకు ప్రణాళిక 5

శత్రువులు కూడా గుర్తించి, గౌరవించారు కాబట్టి వచ్చింది. ‘రాజసూయమహాధ్వరము గోరి చేయంగఁ తీరునే పెర ధరిత్రీ పతులకు,’- అట్టి రాజసూయ యాగం మరొకరెవరైనా చేయగలరా? ‘అయ్యుధిష్ఠిరు గాంభీర్య మతని ధైర్య మరయ నొండెడ కలుగునే? యతడు కీర్తిధరుడు కరుణోత్తరుఁడు మహీసురసమృద్ధికరుడు నిజవంశకరుఁ డుపకారపరుఁడు’ - సకలసద్గుణోపేతుడైన ఆమహానుభావుని గాంభీర్యం, ధైర్యం మరెక్కడ గోచరిస్తుంది?,’ ‘కలిమికి నొప్పగు నీగియు,’- ‘సంపదకు తగిన త్యాగం,’ ‘బలిమికి తొడవైన యట్టి బలగమునై,’- ‘తన బలిమికి అనుకూలమైన సేనాబలము కలిగి యుండి,’ -’లోకుల చిత్తములకు వ్రేఁగగు కొలది మనన్ గొంతి పెద్దకొడుకున కమరున్,’- ‘జనుల మనస్సులలో ఆదరాభిమానాలు కలిగి జనవంద్యుడిగా కీర్తించబడ్డవాడు కదా కుంతి పెద్దకొడుకైన ఆ ధర్మరాజు.’

సీ.    ఎవ్వని వాకిట నిభమదపంకంబు రాజభూషణ రజోరాజి నడఁగు
       నెవ్వని చారిత్రమె ల్లలోకములకు నొజ్జయై వినయంబు నొఱపుఁ గఱపు;
       నెవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి మానితసంపద లీనుచుండు
       నెవ్వని గుణలత లేడు వారాసుల కడపటి కొండపైఁ గలయఁబ్రాఁకు
తే.    నతఁడు భూరిప్రతాప మహాప్రదీప,
       దూరవిఘటిత గర్వాంధకార వైరి
       వీరకోటీర మణి ఘృణి వేష్టితాంఘ్రి
       తలుఁడు కేవల మర్త్యుఁడే ధర్మసుతుఁడు!                       (విరాట. 2-191)

   సీసపద్యం మొదట నాలుగుపాదాల్లో చెప్పినగుణాలవల్ల ఈయన కీర్తి ఎంతదూరం విస్తరిల్లిందో చివరి ఎత్తుగీతిలో చెప్పిన ఆ సమాసం అంత దూరం విస్తరిల్లింది. ధర్మజుని కీర్తి ప్రతిష్ఠలు, అతని గుణగణాలు సప్తసముద్రాల ఆవల వరకూ విస్తరించాయి’, అట్టి ‘భూరిప్రతాపమహాప్రదీప దూరవిఘటిత గర్వాంధకార వైరివీర కోటీర మణి ఘృణి వేష్టితాంఘ్రితలుడు’ - ఈ శిల్పవిద్యారహస్యానికి ఆద్యుడు నన్నయగారే. - వ్యాసభారతం ఆంధ్రమహాభారతంగా రూపుదిద్దుకున్నప్పుడు మొట్టమొదటి పద్యంలోనే ఆ శిల్ప విద్యారహస్యాన్ని చూపాడు. మహాభారత ఆంధ్రీకరణకు ప్రోత్సహించిన రాజరాజనరేంద్రుని గురించి:

ఉ.    రాజకులైకభూషణుడు, రాజమనోహరు, డన్యరాజతే
       జోజయశాలిశౌర్యుడు, విశుద్దయశశ్శరదిందు చంద్రికా
       రాజితసర్వలోకు, డపరాజితభూరిభుజాకృపాణధా
       రాజలశాంతశాత్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతిన్      (ఆది. 1-3)

   ‘రాజకులైకభూషణుడు రాజమనోహరుడు అన్యరాజతేజోజయశాలి శౌర్యుడు’ శౌర్యంలో ఆయన అన్యరాజతేజోజయచాలి. దాని తరువాత వచ్చినది యశస్సు. ‘విశుద్ధయశశ్శర దిందు చంద్రికా రాజిత సర్వ లోకుడు’ - ఆయన యశస్సు సర్వలోకములయందు వ్యాపించినది - సమాసం గతి కూడా పూర్వ సమాసంతో దానికి తగినట్లుగానే ‘విశుద్ధయశశ్శరదిందు చంద్రికారాజిత సర్వలోకు డపరాజిత భూరిభుజా కృపాణ ధారాజల శాంతశాత్రవ పరాగుడు,’- రాజరాజనరేంద్రుని కీర్తి క్రమక్రమంగా ఎలా దిగంతాలవరకూ వ్యాపించిందో అలాగే రమణీయాక్షరపదసమ్మేళనంతో సమాసనిర్మాణం దీర్ఘ, దీర్ఘతర, దీర్ఘతమంగా జరిగింది. అదే నైపుణ్యాన్ని తిక్కనగారు ఇక్కడ ధర్మరాజు విషయంలో ప్రతిష్ఠించారు.

            ‘అట్టి మహాత్ము డొక్కనికి నాశ్రితుడై,’- ‘అటువంటి ధర్మరాజు, -దుర్యోధనుడు చెప్పుకున్నాడు, రాజసూయయాగం చేస్తున్న సమయంలో పదివేలమంది భోజనం చేస్తే ఒకసారి గంట కొడతారు అటువంటి గంట నిరంతరం మ్రోగు తూనే వుండేది- అట్టి ధర్మరాజు ఒకడికి ఆశ్రితుడై, ‘వెడకూడు చీరయున్ పెట్టగ నిల్చి’ –పరుల ఇంటిలో తిండి గుడ్డ కొఱకు పని చేస్తున్నాడు. ‘వాని 

Player
>>