కీచకవధకు ప్రణాళిక 7

నా చేతులలో పెట్టి, ‘బోరన నశ్రులు క్రమ్ము చుండగన్’- ‘కళ్ళల్లో జలజల నీళ్ళు కారుతుంటే నాకు అప్పగించింది. ‘మఱియును’ అంతేకాదు. ‘కడుపసిబిడ్డ వీడు’ - చాలా చిన్నవాడు. మాతృహృదయానికి అలాగే అనిపిస్తుంది మరి! ‘వీడొకటి గాదవునా నెఱుఁగండు’ – ‘అవును కాదని కూడా చెప్పలేని వాడ’.-’ముందరెయ్యెడ ఒక పాటెరుగండు’ - ‘కష్టం అనేది తెలియని అమాయకుడు’. ‘ఎద ఎంతయు కోమలము’ - ‘చాలా సున్నితమైన మనస్తత్వము కలిగినవాడు’. -’ఎప్పుడైన నే కుడువగ బిల్తుగాని’ – ‘నేనుగా అన్నం తిందువు రమ్మని పిలుస్తాను కాని’, ‘గాని తనకుం గల ఆకటి ప్రొద్దెరుంగడు’ – తనకు తానుగా తన ఆకలైన విషయం కూడా తెలుసుకోలేడు. ఏం తల్లి హృదయమండీ! కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదంటారు. తల్లి లేని పిల్లలను తన అక్కున పెట్టుకొని పెంచింది కాబట్టి సహదేవుడి పరిస్థితి అంతా తెలుసు. కనుక –‘ఈ కొడుకిటుపోకకున్’- ‘అటువంటి సహదేవుడు ఇప్పుడు ఈ అరణ్యవాసం చేయాలంటే’, ‘మనము కుందెడు’ – మనస్సు తల్లడిల్లుతోంది. ‘నిన్ గని ఊరడిల్లెడున్’ - ‘నిన్ను జూసిన పిదప నాకు ధైర్యము కలుగుతున్నది. అని ఇంకా ఆమె ఇలా చెప్పింది.’ ‘ఎప్పుడెయ్యడ ఏమిట ఎట్టు లరయవలసె నమ్మెయి ఆరయు’- ‘ఎప్పుడు, ఎక్కడ, ఏవిధంగా అవసరం వస్తుందో గమనించుకో తల్లీ!’ ‘అప్పుడు మలసి డస్సి నొచ్చియైనను’,- నీకు అలసట శ్రమ అయినా సరే, ‘నేమర కిచ్చఁదలచి,- ఏమరుపాటు లేక అవసరాలు గమనించు తల్లీ! ‘తడమి నాచేత దీవెన వడయు మమ్మ’- వాడిని మాత్రం జాగ్రత్తగా చూసుకో! తక్కినవారు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోగల సమర్థులు. వీడికి చేతగాదు తల్లీ! నువ్వు చూసుకొని నా మనసుకు సంతోషము కలిగించు’. అని అప్పగించగా, ‘నేనును వనవాస కాలంబున నా నేర్పు విధంబున మీ కెల్లను గారామైన తమ్ముని అమ్మెయిన్ పరకించుకొనివచ్చితిని ‘ఇంతకాలం ఆమె చెప్పినట్లుగానే చూసుకుంటూ వచ్చాను. ‘ఇపు డజ్ఞాతవాసాయాసితుండగు నతని ననుసరింపు వెరవుఁ గామిం జేసి చేయునదిలేక చింతిలుచున్న దాన’. కాని ఇప్పుడు అజ్ఞాతవాససమయంలో ఆనుకూల్యం, అవకాశం కుదరక అలా గమనించు కోలేక పోతున్నాను. నా మనసులోని దుఃఖం అయిదువిధాలుగా బాధిస్తున్నది. నా పంచప్రాణాలు అయిన మీ అయిదుగురు అనుభవిస్తున్న దుస్థితిని జూసి ఆ పంచప్రాణాలు అలాగే రగిలిపోతున్నాయి. ‘నా తెఱంగు వినుము’ - ఇక నా సంగతి విను.

               ఒకళ్ళను ఆజ్ఞాపించి పనిచేయించుకోవటమే గాని ఒకరికి పనిచేయడం తెలియదు గదా! ‘పనిసేయ నెఱుంగ నన్ను బనిగొను నెడ పాండుని యగ్రమహిషి గొంకుచు బని గఱపెడు చందమునన పనుచు టెఱుఁగవె’ మా అత్తగారు కుంతీదేవి కూడా నన్ను గమనించుకొని నాకు ఏదైనా పనిజెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా సున్నితంగా చెబుతుంది. అటువంటి నేను ఇక్కడ ఇటువంటి పనులు చేయవలసిన స్థితి వచ్చింది. నా చేతులు చూడు. నేను వీళ్ళకు చేస్తున్న పనులేమిటి? ‘నున్నదనంబుగా నలుగు నూరియు’ - నలుగు పెట్టటానికి మెత్తగా నూరాలి, దానిలో ‘చందనమట్లు రాచియున్ పన్నుగ క్రొత్తలైన కలపంబులు కూర్చి’ చందనములు కలిపి, సుగంధద్రవ్యాలను తయారు చేస్తున్నాను. ‘ఆ సుదేష్ణకున్ కన్నుల సన్నలన్ పనులు గైకొని వారక చేయుచుండుటన్ మున్నటులున్న పాణితలముల్ బలుకాయలుకాచె చూచితే’ - అయ్యా! నా చేతులు చూడు. ఇంతకుముందు ఉన్న కోమలత్వము పోయి కణుపులు కట్టి కర్కశత్వాన్ని పొందిన ఈ చేతులను గమనించు. ఎలా కాయలు కాచిపోయినాయో చూడు! ‘అనుచుం దొరగెడు నశ్రుల మునిగిన మో మతని వక్షమున జేర్చిన’ - అని చెప్తూ కళ్ళలో నీరు కారిపోతుండగా అతని వక్షంపై తల వాల్చింది.

ద్రౌపది ప్రతీకార వాంఛ - భీమసేనుని ఊరడింపు

                        ‘చింతాక్రాంతుడైన ఆ కౌంతేయునకు అయ్యింతి ఇట్లనియె’ ‘ఇందఱకు ఇన్నిభంగుల నిడుమ గుడువ వలసె’ - ఇందరకు ఇన్ని బాధలు ‘ధర్మతనూభవవలన జేసి’ –ఆ ధర్మరాజువల్లనే కదా! ఆయన జూదమాడటంవల్లనే కదా! ‘దాయలొడ్డిన మాయజూదంపుటురుల బడికులంబున’ - వాళ్ళు చేసినది దుర్ద్యూతము -  మాయా ద్యూతము అనే విషయాన్ని గమనించలేకపోయాడు. ‘ఆత డిప్పాటు దెచ్చె’ – అందువల్లనే ఈ ప్రమాదం కలిగింది. ‘అక్కట మోసపోయి యడియాసల’- వాళ్ళను వీళ్ళను అనుకొని ఏమి లాభం? నా భాగ్యం, నా జాతకచక్రం బాగుంటే అన్నీ సక్రమంగా జరిగి ఉండేవి. ఎవ్వరికైనా కర్మఫలం అనుభవించక తప్పదు కదా! ‘అక్కట మోసపోయి యడియాసలఁ జావక యున్నదాన’ - అయినా ఏదో ఆశ చావక

Player
>>