కీచకవధకు ప్రణాళిక 8

బ్రతికున్నాను. ‘ఒక్కెడనే దురంత దురితోత్కట బాధల బెట్టి యున్న నా కెక్కడి దుఃఖశాంతి’ - ఇంతవరకు బాధలు అనుభవించడమే కాని మరచిపోయి సుఖించిన శాంతి ఎప్పుడు కలిగింది. ‘కడ యెయ్దుట యెమ్మెయి గల్గ నేర్చు?’ - ఈ దుఃఖ పరంపరల నుంచి బయటపడి గట్టెక్కే సమయము ఎప్పుడొస్తుందో గదా! ‘మీ ముక్కున ఊర్పు గల్గ’ - మీ ముక్కులో ఇంకా ఊపిరి ఉండగానే - ఆ పదం చూడండి ‘మీ ముక్కున ఊర్పుగల్గ’ మీకింకా వూపిరి వుండగానే, -’ఒక మూర్ఖుని చేబడితిన్ సభాస్థలిన్’ - ఒక మూర్ఖునివలన సభామంటపంలో అవమానాన్ని పొందాను. ‘మీరేమి చేయుదురు? దైవారంభము కాక ‘ – ఇదంతా మన ప్రారబ్ధము. ‘శుభము అశుభంబును సంసారులఁ దనతనతఱిన్ అనివారణ బొందంగ మాన్పవచ్చునె దానిన్’ - శుభము గాని అశుభము గాని చేసిన కర్మకు ఫలం అనుభవించవలసిందే! మీరేం చేస్తారు? ఆ బాధను చెప్పుకోవడంలో కూడా ఒక్కొక్కసారి ఒకదానిమీద ఒకటి పొరలా వస్తోంది. అన్నమాచార్యులే మన్నారు? ‘సామాన్యమా పూర్వసంగ్రహంబగు ఫలము, నేమమునఁ బెనగొనియె నేను నీవనక’- ఎవ్వరికైన పురాకృతకర్మల ఫలితం అనుభవించకతప్పదు. ‘పనిలేక జీవులను భవసాగరంబులో మునుగ లేవగజేయు మోహ దోషమున’ -  పనిలేక ప్రాణులకు ఒక్కో మాయ కల్పించి మోహసాగరంలో పడవేసిన దోషఫలితంగా, ‘పనిబూని జలధిలో పండబెట్టిరి’ - ఆ దోషంతో ఆ శ్రీమహావిష్ణువును సముద్రంలో పడుకోపెట్టారు. కర్మఫలం అనుభవించక ఆయనకే తప్పలేదు. మీరేంచేస్తారు? 

               ‘శుభాశుభాభ్యాం మార్గాభ్యాం’- శుభము అశుభములతో వున్న జీవనమార్గంలో, ‘వహన్తీ వాసనా సరిత్’- పురాకృత జన్మ వాసనలు కలవరపెడుతూనే వుంటాయి. ‘పౌరుషేణ ప్రయత్నేన’- ధైర్యంతో, ప్రయత్నంతో, -’యోజనీయా శుభే పథి’- మన బుద్ధిబలంచేత వాటిని నివారించుకొని ఎలాగైనా గట్టుకు చేరాలి. ‘కావున మీర లభ్యుదయ గౌరవ మొందుట ఆత్మగోరి ఏను ఏ విధినైన ఆపదల కెల్లను నోర్చెద’ - కాబట్టి మీ అభ్యుదయంకోసం నేను ఎన్ని ఆపదలనైనా ఓరుస్తాను. ‘దానికేమి’ - అదిగాదు ‘ఈ కావరమైన కీచకుఁడు కామనిపీడితుఁడై యలంతులం బోవగ యేచి పట్టుకొన బోయిన దూలెద గాక యెమ్మెయిన్’- కాని వీడు తన మదంతో, అహంకారం తో ఎంతమంది అమాయికలకు ఏ అఘాయిత్యం జేస్తాడో ననే భయం కూడా కలవరబెడుతోంది. కాబట్టి ఇంక మాటలు అనవసరం. ‘వానిఁ దెగజూడ వైతేని వాయుపుత్ర నీవు గనుగొన’ - వానిని కనుక మీరు చంపకపోతే నేను ‘ఉరినైన నీరనైన నీళ్ళలోన అగ్నినైన విషంబున నైన మేను దొఱగుదు’. భీముడి నోటి నుంచి ఇంతవరకు వాడిని ఎప్పుడు ఎలా చంపమంటావు? అనే మాట రాలేదు.

       ‘అనిన వృకోదరుండు చిఱునవ్వు నవ్వుచు నిట్లనియె’- ద్రౌపది అన్న మాటలను విని చిరుమందహాసం చేస్తూ ద్రౌపదితో ఈవిధంగా పలికాడు.

కీచకవధకు ప్రణాళిక

చ.           జలజదళాక్షి! కీచకునిఁ జంపుట కిమ్మెయి ముట్టఁ బల్కఁగా             

               వలయునె యేను జూడ నని వారణ నిన్నుఁ బరాభవించి వాఁ           

               డిల మన నింక నాండ్రకును నెవ్వరు భంగము నీఁగఁ జాలువా

               రలఘుమదీయబాహుబల మప్పుడ చూపనితప్పు సాలదే     (విరాట. 2-231)

            ‘జలజదళాక్షి! కీచకునిఁ జంపుట కిమ్మెయి ముట్టఁ బల్కగా వలయునె’ – ‘జలజ దళాక్షి’ -ఎంతో అర్థవంతమైన పద ప్రయోగం. దుఃఖంతో వున్న ద్రౌపది అశ్రుపూరిత నయనాలు, నీటిలో పుట్టిన కమల దళాల లాగా వున్నాయి. కన్నీటితో నిండిన విశాలనేత్రాలతో వున్న ద్రౌపదిని ఆర్ద్రతతో చూచిన భీముడు, మరెలా సంబోధిస్తాడు? ‘జలజదళాక్షి’, కీచకుడిని చంపమని చెప్పడానికి మనసుని పొడిచినట్లు ఈవిధంగా మాట్లాడాలా’, ‘యేను చూడ ననివారణ నిన్నుఁ పరాభవించి వాఁడిల మననింక నాండ్రకును నెవ్వరు భంగము నీఁగఁ జాలువార’ - నా కళ్ళముందు నిన్ను పరాభవించిన వాడిని ప్రాణాలతో వుంచితే, ఇక స్త్రీలకు రక్షణ ఏం వుంటుంది?, ‘అలఘు మదీయ బాహుబల మప్పుడ చూపని తప్పు సాలదే’ – అప్పుడే వాణ్ణి చంపకపోవటం నేను చేసిన పెద్ద తప్పు. నువ్వు ఇంతగా చెప్పవలసిన పనిలేదు. ‘ఎల్లి యెల్ల విధంబుల నెందుఁజొచ్చె నేని, ఆ ధర్మ తనయుండు 

Player
>>