కీచక వధ1

కీచక వధ - వికృతపు చావు

               కీచకుడు నర్తనశాలకు వస్తే, అక్కడ సుదృఢం, సుప్రతిష్ఠితమై చలించని శయనంపై ‘తత్రైవ దర్శయిష్యామి పూర్వ ప్రేతాన్ పితామహాన్’ కీచకుడికి అతడి తాతల్ని చూపిస్తానని ద్రౌపదికి మాటిచ్చాడు భీముడు. ‘క్రోధము కృతార్థత్వంబు నొందించి’ క్రోధము అనే భావమేదైనా ఉంటే దానికి కృతార్థత్వాన్ని చేకూరుస్తానన్నాడు. కృతార్థత్వము అంటే చేయబడిన ప్రయోజనము కలిగినది. “క్రోధము అనేది నీ మనసులో ఉంటే దానికి ఫలితము సిద్ధించే విధంగా ఆ కార్యాన్ని నెరవేరుస్తాను. ‘చిత్రవధప్రౌడి వహించి’ ఆ కీచకుడికి సాధారణమైన మరణాన్ని సంప్రాప్తింపజేయను”. అతనికి ‘చిత్రవధప్రౌడివహించిసూతునకు రౌద్రం బేర్పడం జూపుదున్’ అని చెప్పాడు. ఒక్కసారి ద్రౌపది మనసు సంచలించింది. అజ్ఞాతవాసానికి చిట్టచివరి దశలో ఉన్నారు. ఇప్పుడు భీముడి రౌద్రస్ఫూర్తిచేత వీళ్ళ అజ్ఞాతవాసరహస్యం ప్రపంచానికి వెల్లడైతే కార్యమంతా చెడుతుంది. అందుకని, ‘ఒవ్వని వారు నవ్వ’ మనకు ఇష్టం లేనివారు - శత్రువులు ఎగతాళి చేసి - అపహాస్యం చేసి, నవ్వే విధంగా ‘మహిమోదధి ధర్మసుతుండు దీనికిన్ నెవ్వగఁ బొంద భూజనులు నింద యొనర్పగ నేనొనర్చు నీ చివ్వకు’ నేను చేసిన ఈ ప్రయత్నానికి, ‘నీవు నల్క మెయిఁజేసిన యా పని’ నీవు కోపంతో, క్రోధాన్ని ఆపుకోలేక ‘రౌద్రం బేర్పడం జూపుతాను’ అని విపరీతంగా ఏదైనా చేస్తే ‘గూఢవృత్తికిన్ దవ్వగునేని’ అది మనం గూఢంగా సంచరిస్తున్న విధానానికి దూరం అవుతుంది. కాబట్టి ‘ఈ అభిమతం బొడఁగూడియు’ ఈ కోర్కె తీరినా – కీచకుడిని చంపి ప్రతీకారం తీర్చుకున్నా ‘నిష్ఫలంబగున్’ అసలు కార్యక్రమం చెడిపోతుంది. ‘కావున వంచన బాహిర పోవక యుండంగ,’- కాబట్టి నువ్వు అజ్ఞాతంగా ఉన్న మన ప్రవర్తనను బయటకు పొక్కజేయని విధంగా ‘మన రిపుం బరిమార్పంగా వచ్చునేని’ నువ్వు ఈ పని సాధించగలిగినట్లైతే ‘అట్టిద నా వలపు’ అది నా కోరిక. ‘అటు గాక తక్కినను వలదు సుమీ’ ఈ కార్యక్రమం అతి రహస్యంగా జరగాలి. సమర్థంగా జరగాలి, సందేహం లేకుండా జరగాలి, సంశయానికి దూరంగా జరగాలి, ఎటువంటి ఆపద మళ్ళీ రాకూడదు.

                        కీచకుడు నర్తనశాలకు వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడు? భీముడు వాడు సాయంత్రం వస్తాడా రాడా అని సందేహిస్తే తిక్కనగారు అద్భుతమైన సూర్యోదయ వర్ణనము, సూర్యాస్తమయ వర్ణనము రెండు చేశారు. రెండిటికీ తెలుగు భారతంలో చాలా ప్రాముఖ్యం ఉంది. సంస్కృతంలో వ్యాసులవారు చేయలేదు. సూటిగా నర్తనశాలకు తీసుకెళ్ళారు. తిక్కన సూర్యోదయవర్ణనలో, సూర్యాస్తమయవర్ణనలో కీచకునిలో ఉన్న మనస్సంచలనాన్ని, సంచలితమైన ఆ మనసులో చెలరేగే భావోద్వేగాలను ఆ ప్రకృతిలో చూపించిన తీరు అన్ని సందేహాలనూ తొలగించివేస్తుంది. కీచకుడు ఆ ప్రాంతానికి చేరేటప్పటికి రాత్రి సమయం అయ్యింది. ద్రౌపదికి సందేహం, భీముడికి సందేహం, కీచకుడికి సందేహం - ముగ్గురికీ మనసులో సందేహంగానే ఉన్నది. ద్రౌపదికి సందేహం - కీచకుడు వచ్చి, భీముడు రావటానికి ఏదైనా ఆటంకమేర్పడుతుందా? భీముడికి సందేహం - అసలు వాడొస్తాడా? రాకుండా మళ్ళీ పని చెరిపేసి, వేరే వాళ్ళనెవరినన్నా తీసుకుని వస్తాడా? కీచకుడి సందేహం - అసలు ద్రౌపది వస్తుందా రాదా? తానెలా వెళ్ళాలి? ఒకొక్కరికి వారి వారి పరిధిలో చాలా గాఢంగా సందేహం కలిగింది. అటువంటి పరిస్థితిలో, కీచకుడిని ఆహ్వానించిన ద్రౌపది ఆపుకోలేక అటు భీముడిని సమయమయిందని హెచ్చరించుకుంది. “నువ్వు ఏమీ చేయవద్దు. నేను వెళ్తాను, నా వెనకల నువ్వెప్పుడో నిదానంగా రావచ్చునని భీముడు చెప్పి. ‘గమనము వీఁక వేఱొక వికారము చూపక’,- తన నడవడికలో ఉండే గాంభీర్యాన్ని తగ్గించుకోకుండా తనలో ఉన్న భావవికారాలు ఏ మాత్రము బహిర్గతం చేయక, -‘సంగరోత్సవోద్యమరభసాతిరేకము బయల్పడు టించుకలేక’,- చాలా ప్రశాంతమనముతో ఏదో సాయంత్రం వాహ్యాళికి బయల్దేరి వెళ్తున్నట్టుగా ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ‘రోషసంభ్రమ మొకయింతయైనఁ బరభావనిరూప్యముగాక’,- ఇతరులు భీముడిని పరికించి చూస్తే, ఏ విధంగా చూసినా తనలో ఉన్న రోషభావము కొంచెం కూడా బయటపడనీయకుండా, అమిత శాంత స్వభావ చిత్తంతో సాత్త్విక ప్రవృత్తిని వెలువరిస్తూ భీముడు బయల్దేరి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు?  'ద్రౌపదీ రమణుఁడు వోయె విక్రమధురంధరతం’ అది మాత్రం లోపల దాగి ఉంది. ‘నాట్యశాలకున్’ నర్తనశాలకు వెళ్ళాడు.

Player
>>