కీచక వధ3

రోషము అనే మహాగ్ని శాంతి చెందిందా? ‘దుశ్చారిత్రునిం జూచితే,’- దుష్టమైన చరిత్రగల వీనిని గుర్తుపట్టావా? వీడే కదా నిన్ను ఇంత బాధపెట్టాడు, ఏమైనా ఆనవాలుందా? పోలికలున్నాయా? ‘సంతోషించితె,’- సంతోషం కలిగింది కదా! ఇక్కడి శబ్దనిర్మాణము, ఒక పద్యాన్ని పూర్తిగా సమాసయుక్తంగా, ఏక సమాససంఘటితంగా కూర్పగలిగిన నేర్పరి అయిన తిక్కన ఇక్కడ విడి విడి పదాలతో వ్రాశారు. కీచకుడు ద్రౌపదిని పరాభవించిన సందర్భంలో -‘నితాంతదంతపీడన రటదాస్యరంగ వికటభ్రుకుటీ చటులప్రవృత్త నర్తనఘటనాప్రకారభయదస్ఫురణా పరిణద్ధ మూర్తియై’ అంటూ విరాటరాజు సభలో భీమసేనుని లోక భీకర భయంకరక్రోధమూర్తిని ఆవిష్కరించిన కవిబ్రహ్మ ఇక్కడ ఇంత విడివిడి మాటలు వ్రాయడంలో గల పద్యశిల్పం ఏమిటి? భీముడు యుద్ధం చేసి అలసిపోయాడు. కాబట్టి వేగంగా, బుసకొట్టి మాట్లాడాలంటే వీలుకాదు. కాబట్టే అలసట తెలిపే అలతి అలతి పదాల ప్రయోగం.

               ‘చింతాశల్యము వాసెనే? భుజబలోత్సేకంబు నీకెక్కెనే?’ శార్దూలపద్యమే, అయినా దానిని రూపొందించిన తీరు? సంతోషించితె? ఇట్లు కాక బ్రతుకన్ శక్యంబె దుర్వృత్తి నీ చెంతం జేరినయట్టి వీరులకు నా చేతం బయోజాననా’ పయోజాననా అనే పదం చాలా సార్థకమైన ప్రయోగం. పయోజము అంటే పద్మం, తెల్లవారవస్తోంది. ఇప్పుడు అర్ధరాత్రి. వీడి పని అయిపోయింది. ఇంకొకజాము గడిస్తే సూర్యోదయ మవుతుంది. సూర్యోదయం ఎలా అవుతున్నదో అలాగే ఈమె ముఖం కూడా వికసిస్తుంది. పరాభవంనుంచీ బయటపడేలా ప్రతీకారం జరిగిపోయింది కాబట్టి. తన జీవితంలో అంతవరకు పరాభవమే కాని ప్రతీకారచర్య జరగలేదు అనే దుఃఖంతో కూడిన ద్రౌపదికి మనసు తేలిక అయ్యేట్లుగా భీముడు ఆమె కోరిక నెరవేర్చాడు. సైంధవుడి విషయంలో అది జరగలేదు. అన్నగారు అడ్డుపడ్డారు. కాని ఇక్కడ జరిగింది. ఇక్కడ అన్నగారు ప్రత్యక్షంగాలేరు కానీ అంగీకారం ఉన్నది. కాబట్టి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది.

               కనుకనే ఇద్దరూ ఉత్సాహం పొందగలుగుతున్నారు. ‘అనిన విని సింహబలమర్దను నవలోకించి ద్రుపదరాజతనయ యిట్లను నిండారిన సమ్మోదంబు వెలి విరిసి బెరయంగన్’,- మహాబలవంతు డైన కీచకుని సంహరించిన భీమసేనునితో ద్రౌపది సంపూర్ణమైన ఆనందంతో ‘నిన్న విరాటుడి సభలో అంతకోపం వచ్చినా నిగ్రహించుకుని, నేడు ఎటువంటి వికారమూ లేక, మనవాళ్ళెవరినీ పిలవక, ఉత్సాహంతో, కీచకుడిని సంహరించి పరాభవానికి తగిన ప్రతీకారం చేసిన ఉత్తమనాయకునిగా’ అభినందించింది. దుష్టసంహారం చేసిన భీముడు తన దారిన తాను వెళుతూ, ‘నేను వెళ్తాను, నువ్వు నీ మందిరానికి వెళ్ళ’ మని చెప్పాడు. అక్కడ నుంచి వెళుతూ వెళుతూ భీముడు, ‘పవన తనయుం డట్లు చని మహానస మందిరము పరిసరంబున శరీర ప్రక్షాళనంబు సేసికొని’ చాలా జాగ్రత్తగా గమనించాలి. శరీర ప్రక్షాళనం చేసుకున్నాడు. శరీరాన్ని కడుగుకున్నాడు. జరిగిన యుద్ధంలో అతని శరీరం కీచకుని రుధిరధారలతో తడిసిపోయింది. చేసిన వధ అటువంటిది కదా! ప్రక్షాళనకు, స్నానానికి తేడా ఉంది. అందుకని ప్రక్షాళన- బాగా కడుగుకొని, ‘అనులేపనంబున’ ద్రౌపది తెచ్చి యిచ్చి వుంటుంది బహుశా. ఆమెకు చాలా సామర్థ్యం ఉంది కదా! అలసిపోయిన భీముడు ‘అనులేపనంబున నస్రగంధం బుడిపి కొని’ పెనుగులాడినపుడు ఏర్పడిన కల్మషములైన రక్తంతో వచ్చిన వాసనలన్నీ పోగొట్టుకుని సుగంధ పూరితమైన శరీరంతో ‘కృతకృత్యుండై’ చేయాలను కున్న పనిని పూర్తిచేసినవాడై, ‘శయ్యాతలంబున కూర్చుండె’ తన శయ్యపై కూర్చున్నాడు. ‘యాజ్ఞసేనియు భీమసేనుండింతకు వంట యింటికి పోయి నిశ్చితంబున నుండునని నిశ్చయించి’ సరే ఈ పాటికి భీముడు వెళ్ళి ఉంటాడు. ఇప్పుడు నేను బయల్దేరిపోతే ఏమీ ఇబ్బంది లేదు. దానికి తగిన సమయము ఇదే అనుకుని ‘వెలువడి కావలి వారలం బిలిచి’ కీచకుడు ఇక్కడ మరణించిన విషయం ప్రకటితం కావాలి. ఎవరు చెయ్యాలది? ఎవరు ప్రకటించాలి?

                ఉదయమే కీచకుడు అదృశ్యమైపోయుంటాడు, కీచకుడు కనపడడు, ఇక్కడ ఒక మాంసం ముద్ద కనపడుతుంది. అన్వయించుకోవడం కష్టం. కాని దానికి సమర్థంగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరు వెలువరించాలి? ద్రౌపదే చెప్పాలి. ద్రౌపది వచ్చి కావలివారిని పిలిచింది. ఒక్కసారిగా బయటకు వచ్చి ఆక్రందనలతో కావలి వారిని పిలిచింది, ‘నా పతులగు గంధర్వులఁ జేపడి మృతిఁ బొందె వీఁడె సింహబలుండు’ ఈమె చెప్పటానికి తగిన కారణముంది. ఎందుకు? పట్టపగలు అందరూ 

Player
>>